గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు
బెంగళూరు/కోలారు : శాసనమండలి మాజీ చైర్మన్ వి.ఆర్.సుదర్శన్‌ను కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్‌సీ) అధ్యక్ష స్థానానికి సిఫార్సు చేస్తూ, ఇందుకు సంబంధించిన పత్రాలను గవర్నర్ వాజుభాయ్ రుడాభాయ్ వాలాకు రాష్ట్ర ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది. పత్రాలపై గవర్నర్ ఆమోద ముద్ర వేసిన తక్షణం వి.ఆర్.సుదర్శన్ కేపీఎస్‌సీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ అంశంలో కేపీఎస్‌సీలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కాగా ఈ అక్రమాలకు సంబంధించి అప్పటి అధ్యక్షుడు గోనాళ్ భీమప్పతో పాటు కేపీఎస్‌సీ సభ్యుడు మంగళా శ్రీధర్, ఇతర అధికారులపై సైతం అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారం కోర్టు వరకు వెల్లింది. ఈ నేపథ్యంలో ఏడాది కాలంగా అధ్యక్ష స్థానం ఖాళీగానే ఉంది. కాగా, ప్రస్తుతం అధ్యక్ష స్థానానికి సుదర్శన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తూ ఉద్యోగాలను కల్పించాల్సిన కేపీఎస్‌సీ వంటి సంస్థకు అధ్యక్షుడిగా రాజకీయ ఇతివృత్తం ఉన్న వ్యక్తిని నియమించడం ఎంత మాత్రం సరికాదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
సుదర్శన్ పేరు సిఫార్సు చేయడంపై హర్షం
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. ఆర్. సుదర్శన్ పేరును కేపీఎస్‌సీ అధ్యక్ష స్థానానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అపార రాజకీయ అనుభవం కలిగిన సుదర్శన్‌కు పార్టీ తగిన విధంగా గుర్తించడం లేదనే అపవాదు ఉండేదని, ప్రస్తుతం ఈ పదవి ద్వారా ఆయనకు తగిన గౌరవం లభించనుందని కోలారు లోని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. వి.ఆర్. సుదర్శన్ 24 సంవత్సరాల పాటు సుధీర్ఘంగా ఎమ్మెల్సీగా ఉన్నారు. విధాన పరిషత్ డిప్యూటీ స్పీకర్‌గా, స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. కోలారు తాలూకా వేమగల్ గ్రామ పంచాయతీ అధ్యక్ష స్థాయి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. తొలుత జనతా పార్టీ రాష్ట్ర యువ అధ్యక్షుడిగా పనిచేసిన సుదర్శన్ తదనంతరం కాంగ్రెస్‌లోకి వచ్చారు.
కేపీఎస్‌సీ చైర్మన్‌గా వి.ఆర్.సుదర్శన్
Published Thu, Dec 25 2014 2:20 AM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM
Advertisement
Advertisement