బెంగళూరు: రుణమాఫీపై 15 రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం కుమారస్వామి చెప్పారు. ప్రతి రైతు ఇంటికొచ్చి వారి రుణాలను రద్దుచేసినట్లు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్లని, చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయానికి తీసుకున్న రుణాలను రెండు దశల్లో మాఫీ చేస్తామని చెప్పారు. బుధవారం ఆయన రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రైతులు ఎంత రుణం తీసుకున్నా మాఫీచేస్తామని స్పష్టంచేశారు. 2009 ఏప్రిల్ 1 – 2017 డిసెంబర్ మధ్య రుణాలు పొందిన రైతులకు పథకాన్ని వర్తింపజేస్తారు.
వేడుకలు, బైకులకు వాడుకున్న రుణాలనూ రద్దుచేయాలా..
సాగు కోసం తీసుకున్న రుణాలతో కొందరు పెళ్లి వేడుకలు జరుపుకుంటున్నారని, కొందరు బైకులు కొనుగోలు చేస్తున్నారని కుమారస్వామి అన్నారు. అలాంటి వారి రుణాలను కూడా మాఫీ చేయాలా అని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ‘రుణ మాఫీపై 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే, రైతులను కాపాడేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మాఫీ చేయాల్సిన మొత్తం ఎంతో లెక్కగడుతున్నాం. మరో 2–3 రోజుల్లో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి వివరాలు తెలుసుకుంటాం’ అని కుమారస్వామి అన్నారు.
ప్రతి జిల్లాలో నియమించే నోడల్ అధికారి రుణాలు పొందిన రైతుల వివరాలు సేకరిస్తారని, వాటి ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తాను, ఉపముఖ్యమంత్రి పరమేశ్వర సమావేశమై ఈ విషయంపై చర్చిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రూ.53 వేల కోట్ల విలువైన రైతు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచార సమయంలో జేడీఎస్ ప్రకటించింది. ఈ హామీ అమలు ఆలస్యమవడంతో బీజేపీ సోమవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment