AP: పంటలకు ‘ధ్రువీకరణ’ ధీమా
సాక్షి, అమరావతి: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను డిమాండ్ ఉన్నచోట అమ్ముకోగలిగినప్పుడే రైతుకు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అసలు పంట పండించడం కంటే మార్కెటింగ్ చేసుకునేందుకు పడే ఇబ్బందులే ఎక్కువ. ఇక ఎగుమతులకైతే చెప్పలేనన్ని ఆంక్షలు. మరోవైపు.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగుల మందులతో ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత పూర్తిగా లోపిస్తోంది. దీంతో ఎవరికి వారు తమవే ఆర్గానిక్ ఉత్పత్తులంటూ సర్టిఫై చేసుకుంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. వీటన్నింటికీ ప్రధాన కారణం ఇప్పటివరకు ఎక్కడా పంటల ధ్రువీకరణకు ప్రత్యేక విధానమంటూ లేకపోవడమే. ఈ నేపథ్యంలో.. గడిచిన రెండేళ్లుగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా అడుగులేస్తోంది. ఓ పక్క సేంద్రియ పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తూనే మరోపక్క పంటల ధృవీకరణ (క్రాప్ సర్టిఫికేషన్)పై దృష్టిసారించింది. చదవండి: విశ్వ బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం అండ
సర్టిఫికేషన్ లేకే ఎగుమతులకు దెబ్బ
రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో 92.45 లక్షల ఎకరాలు, రబీలో 58.65 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా.. 44.60 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఇక 1.19 లక్షల ఎకరాల్లో పట్టు (మల్బరీ), 4.52 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. వీటి ద్వారా గడిచిన ఏడాదిలో రాష్ట్రంలో 175 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు, 312.24 లక్షల టన్నుల ఉద్యాన, 8,420 టన్నుల పట్టు, 46.24 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తుల దిగుబడులు వచ్చాయి. పలు రకాల ఆహార, ఉద్యాన పంటలతో పాటు ఆక్వా ఉత్పత్తుల్లో మన రాష్ట్రం దేశంలోనే నం.1గా ఉంది. కానీ, విదేశాలకు ఎగుమతయ్యే ఆక్వా ఉత్పత్తులతో పాటు కొన్నిరకాల ఉద్యాన పంటలకు మాత్రమే క్రాప్ సర్టిఫికేషన్ చేసుకోగలుగుతున్న రైతులను వేళ్లమీద లెక్కించొచ్చు.
చదవండి: Andhra Pradesh: పేద విద్యార్థులకు... టాప్ వర్సిటీల్లో సీట్లు
లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగుచేస్తున్నామని చెప్పుకుంటున్న వారు సైతం క్రాప్ సర్టిఫికేషన్‌కు దూరంగానే ఉంటున్నారు. ఎగుమతుల దగ్గరకొచ్చేసరికి సర్టిఫికేషన్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. బెంగళూరుకు చెందిన ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ నిర్వహించిన సర్వేలో సర్టిఫికేషన్‌పై ఏపీ నుంచి ఏటా కేవలం రూ.130 కోట్ల ఎగుమతులు జరుగుతున్నట్లుగా తేలింది. నిర్దిష్టమైన పాలసీ, సర్టిఫికేషన్ వ్యవస్థ ఉంటే కనీసం అవి రూ.2వేల కోట్లకు పైగా జరుగుతాయని అంచనా వేసింది. దీంతో వచ్చే రెండేళ్లలో వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులకూ ధ్రువీకరణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
పొలం బడిలో జీఏపీ పద్ధతులను డాక్యుమెంటేషన్ చేస్తోన్న రైతులు
రబీ సీజన్ నుంచి జీఏపీ జారీ
పరిశోధనల ఫలితాలను నేరుగా రైతులకు చేర్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 2019 రబీ సీజన్లో పొలంబడులకు శ్రీకారం చుట్టింది. 2020 ఖరీఫ్, రబీ సీజన్లలో నిర్వహించిన పొలంబడుల ద్వారా సత్ఫలితాలను సాధించడంతో 2021–22 సీజన్లో ఆర్బీకేలు కేంద్రంగా పొలంబడి, తోట, పట్టు, మత్స్యసాగు, పశువిజ్ఞాన బడులకు శ్రీకారం చుట్టింది. వీటికోసం ఆయా యూనివర్సిటీల ద్వారా ప్రత్యేక సిలబస్‌ను రూపొందించారు. 13–14 చాప్టర్స్‌గా తయారుచేసిన ఈ సిలబస్‌పై తొలుత ఆర్బీకే సిబ్బందికి శిక్షణనిచ్చారు. వీటి ద్వారా ఎంపిక చేసిన క్షేత్రాల్లో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే మూడు సీజన్లలో పొలంబడులు పూర్తికాగా.. ప్రస్తుత ఖరీఫ్‌లో నాలుగో విడతను చేపట్టారు. గడిచిన మూడు సీజన్లలో ఉత్తమ యాజమాన్య పద్ధతులతో అత్యుత్తమ ఫలితాలను సాధించిన రైతులకు రానున్న రబీ సీజన్లో జీఎపీ సర్టిఫికెట్ జారీచేయనున్నారు. ఆ తర్వాత థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా.. అనంతరం ప్రైవేటు ఏజెన్సీ ద్వారా పంటల ధ్రువీకరణ చేయబోతుంది. ఈ విధంగా సర్టిఫై చేసిన ఉత్పత్తులను ప్రభుత్వ బ్రాండింగ్ (లోగో)తో ఎగుమతి చేసేందుకు వీలుగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
ఖర్చులకు కళ్లెంతో పెరిగిన ఆదాయం
2019–20 రబీలో రూ.17.04 కోట్లతో నిర్వహించిన 5,037 పొలంబడుల ద్వారా 1,51,110 మంది రైతులు లబ్ధిపొందారు. 2020–21 ఖరీఫ్‌లో రూ.18.92 కోట్లతో నిర్వహించిన 10,790 పొలంబడుల ద్వారా 5.65 లక్షల మంది, రబీలో రూ.17.78 కోట్లతో నిర్వహించిన 8,050 పొలంబడుల ద్వారా 4.98 లక్షల మంది రైతులు లబ్ధిపొందారు. సాగు ఖర్చులు తగ్గించడం ద్వారా ఖరీఫ్‌లో రూ.83.93 కోట్లు, రబీలో రూ.69.70 కోట్ల మేర దిగుబడులు పెరగడంతో ఖరీఫ్‌లో రూ.145.96 కోట్లు, రబీలో 126.45 కోట్ల మేర అదనపు ఆదాయం పొందారు.
రూ.20 కోట్లతో క్రాప్ సర్టిఫికేషన్ విభాగం
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో క్రాప్ సర్టిఫికేషన్ దిశగా అధికారులు అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగా.. ప్రజల ఆరోగ్యాలకు హానిచేయని పంటలకు ప్రభుత్వమే సర్టిఫికేషన్ ఇవ్వనుంది. ఆ తర్వాత దశల వారీగా సేంద్రియ సాగువైపు రైతులను మళ్లించాలన్నది ప్రభుత్వాలోచన. ఉత్తమ యాజమాన్య పద్ధతుల ద్వారా నాణ్యమైన పంటలు ఉత్పత్తి చేసే రైతులకు తొలుత గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ (జీఏపీ) సర్టిఫికేషన్ ఇవ్వనుంది. ఆ తర్వాత థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా సర్టిఫికేషన్ ఇప్పించనుంది. విత్తన నాణ్యతను ధ్రువీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాధీనంలో సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ పనిచేస్తోంది. దీనికి అనుబంధంగానే క్రాప్ సర్టిఫికేషన్ ఏజెన్సీని కూడా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.20 కోట్లు ఖర్చుచేయనుంది.
ఈ ఏజెన్సీ ద్వారా నియోజకవర్గస్థాయిలో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్స్‌లో శాంపిల్స్ పరీక్షించి విషపూరిత రసాయనాల్లేవని నిర్ధారించిన వాటికి ‘క్రాప్ సర్టిఫికేషన్’ ఇచ్చేలా ఏర్పాట్లుచేస్తున్నారు. ఇదే లక్ష్యంతో డిసెంబర్ నెలాఖరుకల్లా కనీసం 30 శాతం ల్యాబ్‌లకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్ (ఎన్‌ఎబీఎల్) గుర్తింపు సాధించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు ఖర్చుతో కూడుకున్న ఈ సర్టిఫికేషన్‌ను పలు రాష్ట్రాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు చేస్తుండగా, మొదటిసారిగా మన రాష్ట్రంలో ప్రభుత్వమే దీనిని చేపడుతోంది.
ప్రతీ పంటకు ప్రభుత్వ బ్రాండింగ్
ప్రతీ పంటకు క్రాప్ సర్టిఫికేషన్ ఇవ్వడం ద్వారా బ్రాండింగ్ కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచన. సర్టిఫికేషన్ ఉంటే వ్యాపారులే క్యూ కడతారు. ప్రపంచంలో ఎక్కడైనా నచ్చిన రేటుకు అమ్ముకోవచ్చు. రాష్ట్రంలో పండే ప్రతీ పంటను ప్రభుత్వ లోగోతో ఎగుమతులు ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పొలంబడుల స్ఫూర్తితో క్రాప్ సర్టిఫికేషన్ కార్యాచరణ సిద్ధంచేశాం.
– పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ
గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్బీకేల ద్వారా సాగు ఉత్పాదకాలనే కాదు.. పరిశోధనా ఫలితాలను కూడా రైతుల వద్దకు తీసుకెళ్తున్నాం. ప్రతి పంటకు క్రాప్ సర్టిఫికేషన్ చేయగలిగితే గిట్టుబాటు ధరకు ఢోకా ఉండదు.
– కురసాల కన్నబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
వేరుశనగలో ఖర్చు బాగా తగ్గింది
నాకు రెండెకరాల పొలం ఉంది. ఏటా వేరుశనగ సాగుచేస్తున్నా. గతంలో రూ.22 వేల వరకు ఖర్చయ్యేది. అలాంటిది పొలంబడిలో చెప్పిన విధానం ద్వారా రూ.19,050లే ఖర్చయ్యింది. నా తోటి రైతులకు ఎకరాకు 4.12 క్వింటాళ్ల దిగుబడి వస్తే నాకు 5.35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వాళ్లకి ఎకరాకు రూ.21,733ల ఆదాయం వస్తే నాకు రూ.28.221ల ఆదాయం వచ్చింది.
– వై. రెడ్డప్ప, జరిగడ్డదిగువపాలెం, చిత్తూరు జిల్లా
పెట్టుబడి తగ్గింది.. దిగుబడి పెరిగింది
నాకు ఎకరం పొలం ఉంది. గతంలో మూస పద్ధతిలో సాగుచేసేవాడిని. గడిచిన సీజన్లో పొలంబడి కింద మా పొలాన్ని ఎంపిక చేసి సాగుచేసే పద్ధతులను వివరించారు. దీంతో పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాక దిగుబడి బాగా వచ్చింది. పెట్టుబడిపోను ఇతర రైతులకు రూ.20,135 మిగిలితే నాకు రూ.27,050 మిగిలింది. వచ్చే రబీలో సర్టిఫికేషన్ ఇస్తామని చెబుతున్నారు.
– డి. మనోహర్‌రెడ్డి, తాళ్లపూడి, నెల్లూరు జిల్లా
కందిలో రాబడి పెరిగింది
నేను కంది సాగుచేస్తున్నా. గతంలో నాకు ఎకరాకు రూ.15వేలకు పైగా ఖర్చయ్యేది. పొలంబడి పద్ధతిలో సాగుచేస్తే కేవలం రూ.11,600 ఖర్చయ్యింది. నా తోటిì రైతులకు ఎకరాకు 250 కిలోలొస్తే నాకు 450 కిలోల దిగుబడి వచ్చింది. పెట్టుబడిపోను వాళ్లకి రూ.2,600లు మిగిలితే నాకు రూ.15,400 ఆదాయం వచ్చింది. చాలా ఆనందంగా ఉంది.
– తమటం బ్రహ్మారెడ్డి, వెలిగండ్ల, ప్రకాశం జిల్లా
సిలబస్ రూపొందిస్తున్నాం
పంటల వారీగా సిలబస్ రూపొందిస్తున్నాం. పొలం, ఉద్యాన బడుల్లో సాధించిన ఫలితాలను అధ్యయనం చేస్తున్నాం. వీటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు యత్నిస్తున్నాం. నెమ్మదిగా కొత్త పద్ధతికి అలవాటుపడేలా రైతులను తయారుచేస్తున్నాం.
– ఏవీ నాగవేణి, శాస్త్రవేత్త, డాట్ సెంటర్, కలికిరి
సర్టిఫికేషన్‌తో రైతులకెంతో మేలు
పంటల ధ్రువీకరణతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. సేంద్రియ సాగుచేస్తున్న వారు సైతం సర్టిఫికేషన్ గురించి తెలీక నష్టపోతున్నారు. ప్రభుత్వమే సర్టిఫై చేస్తే రైతులకు ఎంతో మేలు. ఇదే జరిగితే రైతులకు మంచి గిట్టుబాటు రావడమే కాక ఎగుమతులూ పెరుగుతాయి.
– జలగం కుమారస్వామి, జాతీయ కార్యదర్శి భారతీయ కిసాన్ సంఘ్