సర్టిఫికెట్లు ప్రదానం చేస్తున్న ఎడిటర్ వర్ధెల్లి మురళి
బన్సీలాల్‌పేట్: లక్ష్యసాధన కోసం అస్త్రాన్ని సంధించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునేందుకు యువతీ, యువకులు నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగా లని సాక్షి సంపాదకులు వర్ధెల్లి మురళి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం యశోద ఫౌండేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువతీ, యువకుల సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
జీవితంలో కష్టాలు, కన్నీళ్లు చూసిన మీరు ఎంతో ధైర్యంతో ముందుకు సాగాలని యువతకు ఉద్బోధించారు. విద్యావంతులైన యువతకు సాఫ్ట్‌స్కిల్స్ ప్రాణవాయువు వంటిదనీ, అలాంటి స్కిల్స్‌లో మరింత సమర్థవంతంగా రాణించినప్పుడే అవకాశాలు వస్తాయని సూచించారు. సమాజంలోని అనాథలను చేరదీయాలని, వారు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో పడితే దేశానికి తీరని నష్టమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎంతో మంది అనాథలు, నిరుపేదలను చేరదీసి సాఫ్ట్‌స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణతో వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న యశోద ఫౌండేషన్ చైర్మన్ రవీందర్‌రావును సాక్షి ఎడిటర్ మురళి అభినందించారు. సీఎస్‌ఆర్ కార్యక్రమం ద్వారా యశోద ఫౌండేషన్ చిత్తశుద్ధితో సమాజమార్పు కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.
ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చి యశోద ఫౌండేషన్‌లో శిక్షణ పొంది ఉద్యోగాలు చేస్తున్న సోనీ(నిర్మల్), సురేఖ(నాగర్‌కర్నూల్), స్వాతి(యాదగిరిగుట్ట), రాకేష్, సరిత, స్వాతి, లిడియా, సుమిరాలు మాట్లాడుతూ కూలీ నాలీ చేసుకొని జీవనం సాగించే కుటుంబం నుంచి వచ్చి ఇక్కడి శిక్షణతో ఉద్యోగాలు చేస్తున్న వైనాన్ని వివరించారు.
తినడానికి తిండి లేక, కంప్యూటర్ అంటే ఏమిటో తెలియని పరిస్ధితుల్లో ఇక్కడ శిక్షణతో ఆత్మవిశ్వాసం, స్కిల్స్‌తో జీవితంలో స్ధిరపడిన తీరును వివరిస్తూ కంటతడి పెట్టారు. అనంతరం సాక్షి ఎడిటర్ వర్ధెల్లి మురళి, యశోద ఆసుపత్రి డైరెక్టర్ బాలక్రిష్ణరావుతో కలిసి శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి డైరెక్టర్ రాజేందర్, డాక్టర్ హరీశ్‌కుమార్, డాక్టర్ రఘవీర్, ప్రిన్సిపల్ అరుణజ్యోతి, మేనేజర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment