‘యశోద’లో కూలిన లిఫ్ట్ | Yashoda Hospital | Sakshi
Sakshi News home page

‘యశోద’లో కూలిన లిఫ్ట్

Published Tue, Jan 14 2014 4:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

Yashoda Hospital

  •    ఐదుగురికి గాయాలు     
  •     బంధువుల ఆందోళన
  •  
    రాంగోపాల్‌పేట్, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో రన్నింగ్‌లో ఉన్న ఓ లిప్టు 8వ అంతస్తు నుంచి కిందకు పడిపోవడంతో ఐదు మందికి గాయాలయ్యాయి. అదష్టవశాత్తు ఆ లిప్టులో పేషంట్లు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగినా ఆస్పత్రి వర్గాలు స్పందించకపోవడంతో  కొద్దిసేపు ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో బయటి భాగంలో ఇటీవల ఓ లిప్టును నిర్మించారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో 8వ అంతస్తులో లిఫ్ట్‌లోకి 15మంది రోగుల బంధువులు ఎక్కారు.

    లిప్టు ఆపరేటర్ 9వ అంతస్తుకు తీసుకుని వెళ్లాడు. అప్పటికే ఓవర్ లోడ్ అయింది. దానికి తోడు మరో ఆరు మంది సిబ్బంది అందులో ఎక్కారు. అక్కడి నుంచి లిప్టు కిందకు వస్తూ 8వ అంతస్తుకు రాగానే పట్టుతప్పి కిందకు పడిపోయింది. దీంతో లిప్టులో ఉన్న వారందరు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అక్కడ సిబ్బంది లిప్టు డోర్ తీసి లోపలున్న వారిని బయటకు తీశారు. అల్వాల్‌కు చెందిన వీణారెడ్డి(36), ఆమె తల్లి భారతి(60) సైనిక్‌పురికి చెందిన లక్ష్మి(55) ఆమె కుమారుడు ప్రభుదాస్(25), మహారాష్ర్టకు చెందిన అమర్‌జిత్ యాదవ్(25)లకు గాయాలయ్యాయి. వీణారెడ్డి నడుముకు గాయాలు కావడంతో ఆమె లేవలేని పరిస్థితిలో ఉంది. అలాగే లక్ష్మి ఎడమకాలుకు, ప్రభుదాస్‌కు రెండు కాళ్లకు, అమర్‌జిత్ యాదవ్ వీపు వెనుక భాగంలో గాయాలయ్యాయి. భారతికి స్వల్ప గాయాలు కావడంతో అప్పటికప్పుడే పంపించారు. ముగ్గురికి మాత్రమే దెబ్బలు తగిలాయని.. అందరివీ స్వల్ప గాయాలని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారు.
     
    బంధువుల ఆందోళన.. ఉద్రిక్త పరిస్థితి
     
    రోగుల బంధువులకు గాయాలు కావడంతో వారి సంబంధీకుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీనికి తోడు యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సెక్యురిటీ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వారు ఆస్పత్రి వర్గాలతో గొడవకు దిగారు. గాయాలపాలైన వారిని చూసేందుకు వచ్చిన వారికి ఓ సెక్యూరిటీ గార్డు ‘ముగ్గురు నలుగురు చచ్చారా’ అంటూ మాట్లాడటంతో గొడవ పెద్దదైంది. సెక్యురిటీ గార్డుపై కొంతమంది చేయి చేసుకున్నారు.
     
    పోలీసులకు సమాచారం లేదు.

     లిప్టు ప్రమాదానికి గురై ఐదు మంది గాయాలపాలైతే సిబ్బంది కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. మూడు గంటల తర్వాత మీడియా మొత్తం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు.
     
    ఎవరూ పట్టించుకోవడం లేదు:అమర్‌జిత్ యాదవ్

     అమ్మ ఇక్కడ చికిత్స పొందుతుంటే చూడటానికి వచ్చాను. లిఫ్ట్ కిం దపడి దెబ్బలు తగిలి రెండు గంటలైంది. ఏ డాక్టరూ పట్టించుకోలే దు. కనీసం ఒక్క టాబ్లెట్ కూడా ఇవ్వలేదు. చాలా నొప్పిగా ఉంది.
     
    నాపైనే కేసు పెడతామన్నారు:ప్రభుదాస్

     దెబ్బ తగిలి ట్రీట్‌మెంట్ చేయమంటుంటే.. అతి చేస్తే నీపైనే ఉల్టా కేసు పెడతామని బెదిరిస్తున్నారు. రెండు కాళ్లకు దెబ్బ తగిలి నొప్పి పెడుతుంటే ఇంత వరకు ఏ ట్రీట్‌మెంట్ చేయలేదు. మా అమ్మ కాలికి దెబ్బ తగిలింది.
     
    లిప్టులో నాణ్యత లేదు:వెంకటరెడ్డి బంధువు

     యాజమాన్యం అత్యాశతో బయట లిప్టు ఏర్పాటు చేసింది. అది ఫిల్లర్లతో నిర్మించాల్సి ఉన్నా కేవలం ఐరన్ రాడ్‌తో కట్టారు. దీనికి తోడు బంధువులకు దెబ్బతగిలి తామొస్తే చచ్చారా అంటూ మాట్లాడుతున్నారు. సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement