న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం పదవి ఎవరికి దక్కుతుందా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయంపైనే అధిష్టానంతో చర్చలు జరిపేందుకు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఢిల్లీ చేరుకున్నారు. హైకమాండ్ పిలుపు మేరకు హస్తిన వెళ్లారు. సిద్ధరామయ్య, డీకేలు సీఎం పదవి చెరో రెండేళ్లు చేపట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిపాదించిందని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై స్పందిస్తూ డీకే కీలకవ్యాఖ్యలు చేశారు. ఇద్దరు పంచుకోవడానికి సీఎం పదవి ఏమీ వారసత్వ ఆస్తి కాదని పేర్కొన్నారు. అసలు ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదనేమీ తమ ముందుకు రాలేదని చెప్పారు.
అలాగే సిద్ధరామయ్యకు 80 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, దీంతో ఆయనకే అవకాశం లభిస్తుందని జరుగుతున్న ప్రచారంపైనా డీకే స్పందించారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 135 అని, దీన్ని ఎవరు విడగొట్టలేరని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల మద్దతు గురించి అసలు అంత కచ్చితంగా సంఖ్య ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ సమయంలో డీకే పక్కనే ఉన్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఎమ్మెల్యేల మద్దతుపై ఇంకా కౌంటింగ్ జరాగాల్సి ఉందని జోకులు పేల్చారు.
మరోవైపు కర్ణాటక సీఎం ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ మంగళవారం ఉదయం బేటీ అయ్యారు. ఢిల్లీ చేరుకున్న డీకేతోనూ కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు జరపనుంది. ఇద్దరిని బుజ్జగించి సాయంత్రం వరకు సీఎం ఎవరనే విషయాన్ని తేల్చే అవకాశం ఉంది.
కాగా.. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని డీకే అంతకుముందే స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేలను విడగొట్టనని, వెన్నుపొటు పొడవనని స్పష్టం చేశారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడబోనని తేల్చిచెప్పారు. చరిత్రలో తన గురించి తప్పుగా ఉండాలని కోరుకోవడం లేదని, చెడ్డపేరుతో వెళ్లాలనుకోట్లేదని చెప్పుకొచ్చారు. దీంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. తిరుగుబాటు ఉండదనే సంకేతాలు ఇచ్చారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌కు 20 సీట్లు తేవడమే తమ ముందున్న తదుపరి సవాల్ అని డీకే తెలిపారు.
చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమర్ కీలక వ్యాఖ్యలు..
Comments
Please login to add a commentAdd a comment