తెలంగాణలో 'కర్ణాటక వ్యూహం'.. కాంగ్రెస్‌ మాస్టర్‌ ప్లాన్‌..! | Telangana Congress To Implement Karnataka Plan | Sakshi
Sakshi News home page

TCongress: తెలంగాణలో 'కర్ణాటక వ్యూహం'.. కాంగ్రెస్‌ మాస్టర్‌ ప్లాన్‌..!

Published Sun, May 14 2023 7:57 AM | Last Updated on Sun, May 14 2023 8:17 AM

Telangana Congress To Implement Karnataka Plan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాదిన బీజేపీ కంచుకోటను భారీ మెజారిటీతో బద్దలుకొట్టిన కాంగ్రెస్‌.. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుపై గురి పెట్టింది. ఇప్పటికే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న హస్తం పార్టీ ఆ దిశగా అడుగులు ప్రారంభించనుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో సానుభూతి, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంతోపాటు కన్నడ నాట ఫలించిన వ్యూహాలను కూడా ఉపయోగించాలని అధిష్టానం యోచిస్తోంది.

కన్నడ కాంగ్రెస్‌లో కొదమ సింహాలైన డీకే శివకుమార్, సిద్దరామయ్యలను ఒకేతాటిపైకి తెచ్చి పార్టీలో ఐకమత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన విధంగానే తెలంగాణలో నేతలందరినీ ఒకేతాటిపైకి తెచ్చేలా శ్రేణులకు సంకేతాలు పంపుతోంది. సగానికిపైగా అభ్యర్థుల్ని ముందే ప్రకటించడం, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, కుటంబపాలన, కుంభకోణాలపై బీఆర్‌ఎస్‌ను ఎండగడుతూనే పార్టీ మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది.  

పార్టీ శ్రేణుల మధ్య అంతరం లేకుండా.. 
అంతర్గత కుమ్ములాటలు, పలువురు ముఖ్యమంత్రుల అభ్యర్థులు, నేతల మధ్య ఐకమత్యం లేకపోవడం... ఇదీ కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ముందు కాంగ్రెస్‌ పరిస్థితి. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్‌ చేసుకోవాలంటే ముందుగా పార్టీ శ్రేణుల మధ్య అంతరం లేకుండా చూసుకోవాలని అధిష్టానం డీకే శివకుమార్, సిద్ధరామయ్యలకు సంకేతాలు పంపింది. వేర్వేరు పాదయాత్రలు, వేర్వేరు సభలు పెడుతూ కేవలం పార్టీ మేనిఫెస్టోనే ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేసింది.

ఎన్నికల తేదీకి ముందుగా ఇద్దరు బడా నేతల్ని ఒకే వేదికపైకి తెచ్చి పార్టీలో ఎలాంటి పొరపొచ్ఛాలు లేవని సంకేతాలు పంపింది. తెలంగాణ కాంగ్రెస్‌లోనూ ఐకమత్యం లేకపోవడాన్ని గుర్తించి అధిష్టానం తొలిగా ఈ అంశంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించింది. సీనియర్లందరికీ వేర్వేరు టాస్‌్కలు అప్పగించి పార్టీ అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా నిర్దేశం చేయనుంది. ముఖ్యమంత్రి అభ్యరి్థని కూడా ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రకటించేందుకు సిద్ధమైంది. కుమ్ములాటలను ప్రోత్సహించే నేతలకు ముందుగానే చెక్‌ పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 

ప్రభుత్వ అవినీతి.. ఉద్యోగ కల్పన 
తెలంగాణలో ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని, అప్పుడే ప్రత్యామ్నాయ పార్టీగా ముందుకెళ్లొచ్చని అధిష్టానం భావిస్తోంది. ప్రాజెక్టుల పేరిట చేస్తున్న అవినీతిపై ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ప్రజల్లోకి వెళ్తుండగా.. దీన్ని మరింత పటిష్టంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలోనూ బీఆర్‌ఎస్‌ నేతల ప్రమేయంపై ఆరోపణలు వచి్చన నేపథ్యంలో ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. తెలంగాణలో కుటుంబ పాలనకు తెర దించి అధికారంలోకి వచ్చేలా శ్రేణులు కష్టపడాలని దిశానిర్దేశం చేయనుంది. తెలంగాణ ఉద్యమానికి కారణమైన అంశాల్లో ఒకటైన ఉద్యోగ కల్పనలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధించిందేమీ లేదని, ఈ అంశాన్ని అనుకూలంగా మార్చుకొని మేనిఫెస్టోలో ఉద్యోగ కేలండర్‌ను పొందుపరచాలని భావిస్తోంది. 

ముందుగానే ప్రకటన 
అభ్యర్థుల ప్రకటన విషయంలోనూ ఒక అడుగు ముందు వేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. కర్ణాటకలో 100 స్ధానాలు ప్రకటించినట్లే.. తెలంగాణలో నూ కనీసం 60 స్థానాల్లో ప్రకటించేందుకు సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకుంటోంది. ఏకాభిప్రా యం ఉన్న చోట్ల అభ్యర్థులను ముందుగా ప్రకటించి కదనరంగంలో ముందడుగు తమదేనని శ్రేణుల్లో నూతనోత్తేజం నింపాలని చూస్తోంది. అభ్యర్థుల విషయానికొస్తే ప్రజల్లో గుర్తింపు ఉన్న గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది.  

మరింత ఉత్సాహంగా గర్జనలు
తెలంగాణ కాంగ్రెస్‌ యువ గర్జన, దళిత–గిరిజన గర్జన, రైతు గర్జన అంటూ వేర్వేరు వర్గాలకు చెందిన ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమని చెప్పింది. ఆయా వర్గాలకు అండగా ఉంటామని, అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెబుతూ వారికి దగ్గరయ్యే యత్నాలు ప్రారంభించింది. త్వరలోనే మహిళా గర్జన, యువ గర్జన, మైనారిటీ గర్జనలతో మరింతగా ప్రజల్లోకి వెళ్లడానికి సమాయత్తమవుతోంది. అన్ని వర్గాల ప్రజలకు చేదోడువాదోడుగా ప్రభుత్వం ఉంటుందన్న విశ్వాసం నెలకొనేలా మేనిఫెస్టో రూపొందించేలా అధిష్టానం కసరత్తు ప్రారంభించనుంది.
చదవండి: శభాష్‌ రాహుల్‌.. మహాత్మా గాంధీలా ప్రజల మనసులు గెలుచుకున్నావ్‌.. కమల్ ప్రశంసల వర్షం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement