కర్ణాటక ఎన్నికల్లో మంత్రులు సహా కీలక నేతలెందరో ఓటమితో భంగపడ్డ వేళ.. ఆ రేసు గుర్రం విక్టరీని దావణగెరె దక్షిణ నియోజకవర్గం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. వయసైపోయింది.. ఇంకేం పోటీ చేస్తాడు? టికెట్ ఇచ్చినా గెలుస్తాడా? అంటూ విమర్శించిన వాళ్ల నోళ్లు మూయిస్తూ అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని మరీ గ్రాండ్ విక్టరీ సాధించారు 92 ఏళ్ల కాంగ్రెస్ నేత శామనూరు శివశంకరప్ప ఉరఫ్ అప్పాజీ.
ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం శివశంకరప్పకు కాంగ్రెస్ మరోసారి టికెట్ ఇచ్చినప్పుడు సొంత నేతలు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో దీటుగా బదులిచ్చిన శివశంకరప్ప.. ‘‘నేను రేసు గుర్రాన్ని.. అందుకే కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. భారీ మెజారిటీతో గెలుస్తా’’ అని శపథం చేశారు. మాటలతోనే కాదు.. ఇప్పుడు ఫలితాల్లో చేతల్లోనూ చూపించారు. దాదాపు 28 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు.
👉 శామనూరు శివశంకరప్ప 1994లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అదే సంవత్సరంలో దావణగెరె నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. 2004లో మరోసారి దావణగెరె నుంచి పోటీ చేసి గెలుపొందారు.
👉 2008 నుంచి దావణగెరె దక్షిణ నుంచి పోటీ చేస్తున్నారు. 2013, 2018, 2023లో వరుసగా గెలుపొందారు. మొత్తంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
👉 ఈ దఫా ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగి.. హుషారుగా ప్రచారంలో పాల్గొన్నారు.
👉 కర్ణాటక ఎన్నికల చరిత్రలోనే అత్యంత వృద్ధ అభ్యర్థిగా బరిలోకి దిగి శివశంకరప్ప మరోసారి జయకేతనం ఎగురవేశారు.
👉 దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
👉 శివశంకరప్పకు 84,298 ఓట్లు రాగా, ఆయన సమీప బీజేపీ అభ్యర్థి అజయ్ కుమార్ కు 56,410 ఓట్లు పడ్డాయి.
👉 ఈ ఎన్నికల్లో శివశంకరప్పకు పోటీగా బీజేపీ అజయ్‌కుమార్‌ను నిలబెట్టింది. ఆ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లింలతో అజయ్‌కుమార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో బీజేపీ విజయం సాధించడం ఖాయమనుకున్నారు. కానీ దావణగెరె నియోజకవర్గ ప్రజలు తమ అప్పాజీకే గెలుపు కట్టబెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment