పార్టీ ఆఫీసులో ఒంటరిగా కూర్చొని ఉన్నాను. నా వెనుక గోడపై మోదీజీ ఉన్నారు. అమిత్ షా ఉన్నారు. అయినప్పటికీ నేనివాళ ఒంటరినే! ముప్పై ఏళ్లుగా హుబ్లీ–ధార్వాడ్ సెంట్రల్‌లో గెలుస్తూ వస్తూ, ఇవాళ ఓడిపోవడం వల్ల నేను ఒంటరిని కాలేదు.
ముప్పై ఏళ్లకు ముందు హుబ్లీ–ధార్వాడ్‌లో అడ్రెసే లేని బీజేపీకి... గెలుపునే అడ్రెస్‌గా ఇచ్చిన నన్ను కాదని పార్టీ వేరొకరికి టికెట్ ఇచ్చినందు వల్ల నేను ఒంటరిని కాలేదు.
బీజేపీ నుంచి బయటికి వచ్చి, కాంగ్రెస్‌లో చేరి, నా కారుకు కాంగ్రెస్ జెండా తగిలించుకుని, నా కారు అద్దాలపై కాంగ్రెస్ స్టిక్కర్ అంటించుకుని ఎన్నికల ప్రచారంలో తిరిగినందుకు నేను ఒంటరిని కాలేదు.
ఏడోసారీ నేనే గెలిస్తే యడ్యూరప్ప తర్వాత నేనే నంబర్ వన్ అవుతానన్న భయంతో పార్టీ జనరల్ సెక్రెటరీ నాకు కాకుండా, వేరొకరికి పార్టీ టికెట్ ఇప్పించుకున్నందుకు నేను ఒంటరిని కాలేదు.
మరెందుకు ఒంటరినయ్యాను?!
గెలుస్తూ గెలుస్తూ వచ్చి ఓడినందుకా? అయినా నేనెక్కడ ఓడిపోయాను! విజయమే తొలిసారి నా తోడు లేక ఒంటరిదయింది. బీజేపీ నాపై నిలబెట్టి గెలిపించుకున్న మహేశ్ 30 వేల ఓట్ల తేడాతో విజేత అయితే కావచ్చు. బీజేపీ ముప్పై ఏళ్ల నియమ ఉల్లంఘనకు కూడా అదే 30 వేల ఓట్ల దూరం.
మరి నన్ను ఒంటరిని చేసిందెవరు?!
‘‘ఇకనైనా ఆ గోడకున్న మోదీ, అమిత్‌షాల ఫొటోలు తొలగిస్తారా?’’ అని రెండు పార్టీల వాళ్లూ అడుగుతున్నారు. నేను ఓడినందుకు బీజేపీ. నేను గెలవనందుకు కాంగ్రెస్.
అంతటా ఓడిపోయి బీజేపీ ఇక్కడ గెలిచింది. అంతటా గెలిచి కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోయింది. అప్పుడిక ఫొటోలు ఉంచేయడానికి, తీసేయడానికి పెద్ద తేడా ఏముంది? టికెట్ ఇవ్వనప్పుడే నేను ఫొటోలు తొలగించలేదు. ఓడినప్పుడు తొలగిస్తానా? ఓటమి కన్నా టికెట్ దక్కకపోవడం ఎక్కువ ఓటమి కాదా?
‘‘ఓటమిలో ఎక్కువ తక్కువలు ఉంటాయా?’’... నా బీజేపీ అంత రాత్మ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో అడుగుపెట్టి నన్ను ప్రశ్నిస్తోంది. ఆ అంతరాత్మ నా రూపంలో లేదు. యడ్యూరప్ప ఆకృతిలో ఉంది.
‘‘శెట్టర్‌జీ.. పార్టీ మిమ్మల్ని వదులుకోలేదు! మిమ్మల్ని రాజ్యసభకు పంపిస్తాను అంది. కేంద్ర మంత్రిని కూడా చేస్తానంది. స్వయంగా అమిత్‌షానే మీతో మాట్లాడారు. కానీ మీ దృష్టిలో ఆయన ఫొటోకు ఉన్న విలువ ఆయన మాటకు లేకుండా పోయింది. తప్పు చేశారు శెట్టర్‌జీ. కాంగ్రెస్‌లోకి మారి తప్పు చేశారు. కాంగ్రెస్‌కు మారుపేరు ‘ఖర్గే’ అని అనుకుని మీరు వెళ్లారు కానీ, సమన్యాయానికి మారుపేరు బీజేపీ అన్న సంగతిని మీరు మీ ఇగో వల్ల మర్చిపోయారు’’ అంది యడ్యూరప్ప ఆకృతిలోని నా అంతరాత్మ.
‘‘ఇగో కాదు. అది సెల్ఫ్ రెస్పెక్ట్..’’ అన్నాను.
‘‘ఇగోకు పోయినవారంతా చెప్పే మాటే అది శెట్టర్‌జీ! చెప్పండి.. మీరు కోరుకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్లింది? విజయానికా, అపజయానికా? రాజ్యసభకా, మీ హుబ్లీ–ధార్వాడ్‌ను గెలుచుకోలేని కాంగ్రెస్ పార్టీకా?’’ అన్నారు యడ్యూరప్ప.
నేనిక.. నాది కాని నా అంతరాత్మతో సంభా షణను కొనసాగించ దలచలేదు. కుర్చీలో గిర్రున్న వెనక్కు తిరిగి గోడపై మోదీజీ, అమిత్‌షాల ఫొటోల వైపు చూశాను. నాపై నాకెంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందో, వాళ్లపైనా అంతే రెస్పెక్ట్ ఉంది. అంత పెద్ద నాయకు లను అక్కడి నుంచి కదల్చదలచలేదు నేను.
పెద్ద నాయకులు!!
అయినా ప్రజల్ని మించిన పెద్ద నాయకులు ఉంటారా? కర్ణాటక అంతటా బీజేపీ కూలిపోతున్న ప్పుడు హుబ్లీ–ధార్వాడ్‌ను మాత్రం వాళ్లెందుకు గట్టిగా పట్టు కుని ఉన్నట్లు?! నన్నెందుకు ఒంటరిని చేసినట్లు? సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటాం కానీ, అదెప్పుడూ మన చేతుల్లో ఉండదు.
-మాధవ్ శింగరాజు
రాయని డైరీ
జగదీశ్ శెట్టర్ (కర్ణాటక మాజీ సీఎం)
Comments
Please login to add a commentAdd a comment