సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు వాస్తవరూపం దాల్చింది. అసమ్మతి నేతల ఎత్తులు, నాయకత్వ మార్పు అంటూ గత కొన్ని నెలలుగా సాగుతున్న ప్రచారానికి తెరపడ్డట్టైంది. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు కేబినెట్‌లో చోటుకల్పించారు. రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన కేబినెట్ విస్తరణలో గవర్నర్ వజూభాయ్ వాలా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉమేష్ కట్టి (హక్కేరి), ఎస్.అంగర (సల్లియా), మురుగేష్ నిరానీ (బిల్గీ), అరవింద్ లింబావలీ (మహదేవపుర), ఎమ్మెల్సీలు ఆర్.శంకర్, ఎంటీబీ నాగరాజ్, సీపీ యోగేశ్వర్ ముఖ్యమంత్రి యడియూపరప్ప ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేశారు.
కాగా, నాటకీయ పరిణామాల మధ్య 2019 జులైలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ యడియూరప్పకే మళ్లీ సీఎం పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. 17 మంది ఎమ్మెల్యేల తిరుబాటుతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ కుప్పకూలడంతో బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమైంది. అయితే, యడ్డీ నాయకత్వంపై సొంతపార్టీలోనే అసంతృప్తులు, తిరుగుబాటుదారులు ఎక్కువ కావడంతో ప్రభుత్వానికి సమస్యలు తప్పలేదు. ఇప్పటికే 2019 ఆగస్టులో ఓసారి, 2020 ఫిబ్రవరిలో మరోసారి కేబినెట్‌ను విస్తరించారు. అయినప్పటికీ బీజేపీ సర్కారులో లుకలుకలు తగ్గలేదు. ఈసారి యడ్డీ సీటుకు ఎసరు ఖాయమనే ప్రచారం ముమ్మరంగా సాగింది. ఈనేపథ్యంలో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి వచ్చిన సీఎం యడియూరప్ప ముచ్చటగా మూడోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment