హరిహర సభలో సీఎం యడియూరప్ప
17 మంది రాజీనామా చేశారు. వారికి మంత్రి పదవులు ఇవ్వాలి. నా పరిస్థితిని అర్థం చేసుకోండి అని సీఎం యడియూరప్ప ఆవేదన. ఫలానా వారికి మంత్రి పదవినివ్వాలని స్వామీజీ కోరడంతో వేదికపైనే సీఎం ససేమిరా అన్నారు. రాజీనామా చేస్తాను గానీ ఇలాంటి బెదిరింపులకు లొంగను అన్నారు.
సాక్షి, బళ్లారి: నా పరిస్థితి బాగోలేదు, ఇలానే కొనసాగితే రాజీనామా చేస్తాను అని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం దావణగెరె జిల్లాలోని హరిహరలో జాతర మహోత్సవంలో సభాముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. వచనానంద స్వామీజీ పంచమశాలి మాట్లాడుతూ మురుగేష్ నిరాణికి మంత్రి పదవి ఇవ్వాలని సూచించారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోతే వీరశైవ పంచమశాలి వర్గం మీకు దూరం కాబోతుందని హెచ్చరించడంతో ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
అర్థం చేసుకోండి
కూర్చున్న స్థలం నుంచి లేచి ముఖ్యమంత్రి ఘాటుగా మాట్లాడారు. వచనానంద స్వామీజీ మాటలకు మనస్తాపం చెందినట్లు కనిపించారు. నేను రాజీనామా చేస్తాను కానీ ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు, నా పరిస్థితిని అర్థం చేసుకోవాలి అని స్పష్టంచేశారు. 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మంత్రి పదవుల కోసం ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఎవరి సహకారంతో ఏర్పడిందన్నది గమనించాలన్నారు. (మేమే కర్ణాటక వస్తాం..అన్నీ తేలుస్తాం)
ఇదే విషయం నా చెవిలో చెప్పి ఉంటే మరోలా ఉండేది, బహిరంగ వేదికల మీద మంత్రి పదవిపై మాట్లాడుతూ సమాజం దూరమవుతుందని చెప్పడం సరి కాదన్నారు. అవసరమైతే పరిపాలన విషయంపై సలహాలు ఇవ్వండన్నారు. మంత్రి పదవులు తదితరాలపై తనపై అజమాయిషీ చేసే మాటలు మానుకోవాలన్నారు. తన అవసరం లేదనుకుంటే రాజీనామా చేయాలని నేరుగా సూచిస్తే తన సీఎం పదవికి రాజీనామా చేస్తానన్నారు. స్వామీజీ, ముఖ్యమంత్రి సంవాదం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment