వచ్చే వారంలో మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ | Maharashtra cabinet expansion likely next week says cm Eknath Shinde | Sakshi
Sakshi News home page

వచ్చే వారంలో మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ

Published Sun, Jul 10 2022 6:15 AM | Last Updated on Sun, Jul 10 2022 6:15 AM

Maharashtra cabinet expansion likely next week says cm Eknath Shinde - Sakshi

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కేబినెట్‌ విస్తరణ వచ్చే వారంలో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే చెప్పారు. ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో సంపూర్ణ చర్చల తర్వాత మంత్రిమండలి కూర్పు ఉంటుందని తెలిపారు. శనివారం షిండే, ఫడ్నవీస్‌లు ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేపట్టారు. రాష్ట్రపతి కోవింద్, ప్రధానమంత్రి మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలుసుకున్నారు. అనంతరం సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే చెబుతున్న మాటల్ని షిండే తోసిపుచ్చారు.

164 మంది ఎమ్మెల్యేలతో తమ ప్రభుత్వం బలంగా ఉందని, పూర్తి కాలం తను పదవిలో ఉంటానని ధీమాగా చెప్పారు. ఒకప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్‌ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కావడం పట్ల అసంతృప్తిగా లేదా అన్న ప్రశ్నకు తాను పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటానని బదులిచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రే నాయకుడని, షిండే నాయకత్వంలో పని చేస్తామనన్నారు. ప్రభుత్వాన్ని పూర్తికాలం విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. శుక్రవారం హోం మంత్రి అమిత్‌ షాతో షిండే, ఫడ్నవీస్‌ సుదీర్ఘంగా జరిపిన చర్చల్లో అధికార పంపిణీ కసరత్తు కొలిక్కి వచ్చినట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement