
సాక్షి, న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో ఎన్నికలు, సామాజిక సమీకరణాల ప్రాతిపదికగా 77 మంది మంత్రులతో కొత్త మంత్రి మండలి కొలువుతీరింది. నారాయణ రాణె, శర్బానంద, జ్యోతిరాదిత్య సింథియా, అనుప్రియ పటేల్ తదితరుల కొత్త కేబినెట్‌లో స్థానం సంపాదించారు. వీరిలో కొందరు గురించి క్లుప్తంగా..
నారాయణ రాణే (69): మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి చెందిన వారు. శివసేనలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగానూ విధులు నిర్వర్తించారు. అనంతరం కాంగ్రెస్‌లో కీలకపాత్ర పోషించారు. 2017లో సొంతంగా మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష పార్టీని స్థాపించారు. 2020లో పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన రాణే రాజ్యసభ సభ్యుడు కావడం తొలిసారి. మహారాష్ట్ర పరిశ్రమలు, రెవెన్యూ, ఓడరేవులు, పశుసంవర్ధక వంటి శాఖలకు మంత్రిగా పనిచేశారు. 35 ఏళ్లుగా ఏదో ఒక పదవిలో ఉన్నారు. రాజకీయాలకు ముందు 1971 నుంచి 1984 వరకూ ఆదాయపన్ను శాఖలో పనిచేశారు.
శర్బానంద సోనోవాల్ (58): అస్సాంలోని దిబ్రూగఢ్‌కు చెందినవారు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేసిన సోనోవాల్ అసోం గణపరిషద్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో బీజేపీలో చేరారు. 2014లో లఖింపూర్ నుంచి ఎంపీగా ఎన్నికై ప్రధాని మోదీ కేబినెట్‌లో క్రీడల మంత్రిగా పనిచేశారు. 2016లో అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
వీరేంద్ర కుమార్ (67): మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో జన్మించారు. సీనియర్ పార్లమెంటేరియన్. ఏడుసార్లు ఎంపీగా గెలిచారు. 17వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా పనిచేశారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్ విస్తరణ సమయంలో మైనారిటీ వ్యవహారాలు, మహిళ,శిశు అభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా నియమితులయ్యారు.
జ్యోతిరాదిత్య సింథియా (50): మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2020లో బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. జ్యోతిరాదిత్య రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు.
రామచంద్ర ప్రసాద్ సింగ్ (63): బిహార్‌లోని నలందకు చెందిన రామచంద్ర ప్రసాద్ ఎన్డీయే భాగస్వామ్య పార్టీ జేడీయూ కీలకనేత. యూపీ క్యాడర్ 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సింగ్ 2010 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశారు.
అశ్విని వైష్ణవ్ (50): ఒడిశాకు చెందిన అశ్విని వైష్ణవ్ 2019లో రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి. పెన్సిల్వేనియా వర్సిటీ నుంచి ఎంబీయే చేశారు. 1994 బ్యాచ్ ఐఏఎస్ (27వ ర్యాంకు) అధికారి. జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రశంసలు పొందారు. 1999లో ఒడిశాలో సైక్లోన్ సమయంలో యూఎస్ నేవీ వెబ్‌సైట్ ట్రాక్ చేసి తాజా పరిస్థితులు ఉన్నతాధికారులకు చేరవేసి భారీ నష్టం జరగకుండా చూశారు. వాజపేయి హయాంలో పీఎంవోలో పనిచేశారు.
పశుపతి కుమార్ పారస్ (68): బిహార్‌లోని ముంగేర్‌కు చెందిన పశుపతి పారస్ ఎన్డీయే భాగసామ్య లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు. బిహార్‌లోఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. దేశంలోని సీనియర్ చట్టసభ సభ్యుల్లో ఒకరు. నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజా జీవితంలోకొనసాగుతున్నారు. భాగల్‌పూర్ వర్సిటీ నుంచి బీఈడీ చేశారు.
భూపేందర్ యాదవ్ (52): బీజేపీలో ట్రబుల్ షూటర్‌గా పేరుపొందిన భూపేందర్ యాదవ్ రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అమిత్‌షా అనుచరుడిగా పేరొందిన భూపేందర్ పలు పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో తన నాయకత్వ లక్షణాల ద్వారా గుర్తిం పు పొందారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమ యంలో పార్టీ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు.
పంకజ్‌చౌధరి (56): ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ లోక్‌సభ సభ్యుడు. ఆరోసారి ఎంపీగా ఉన్నారు. గతంలో గోరఖ్‌పూర్ డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న చౌధరి గోరఖ్‌పూర్ వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.
అనుప్రియ సింగ్ పటేల్ (40): ఎన్డీయే భాగస్వామి అప్నాదళ్(సోనేలాల్) పార్టీ అధ్యక్షురాలు. ఛత్రపతి సాహూజీ మహరాజ్ వర్సిటీ నుంచిఎంబీయే చేసిన అనుప్రియ అమిటీ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. మీర్జాపూర్ నుంచి వరసగా రెండోసారి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో ఆరోగ్య శాఖసహాయమంత్రిగా పనిచేశారు. యూపీ ఎమ్మెల్యేగానూ పనిచేశారు. వెనకబడిన వర్గాల సమస్య పరిష్కారం నిమిత్తం మైనారిటీ వ్యవహారాల స్థానంలో ఓబీసీ మంత్రిత్వశాఖ తీసుకురావాలని ఇటీవలే అనుప్రియ డిమాండు చేశారు.
ప్రొఫెసర్ ఎస్‌పీ సింగ్ భగేల్ (61): యూపీలోని ఆగ్రాకు చెందిన భగేల్ ఐదోసారి ఎంపీ. యూపీప్రభుత్వంలో పశుసంవర్ధక, మత్స్య, మైనర్ ఇరిగేషన్ శాఖలకు మంత్రిగా పనిచేశారు. మిలటరీ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసిన భగేల్ ఎల్‌ఎల్‌బీ తోపాటు ఎంఏ, ఎమ్మెస్సీ పూర్తి చేశారు.
రాజీవ్ చంద్రశేఖర్ (57): బెంగళూరుకు చెందిన రాజీవ్ రాజ్యసభ సభ్యుడు. పలు పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యుడిగా ఉన్నారు. విజయవంతమైన పారిశ్రామికవేత్తగా గుర్తింపుపొందారు. హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రొగ్రామ్ చేసిన రాజీవ్ కంప్యూటర్ సైన్స్‌లో ఎంటెక్ చేశారు.
శోభ కరాంద్లాజే (54): దక్షిణ కన్నడ ప్రాంతానికి చెంది శోభ ఉడుపి చిక్‌మగ్‌లూర్ నియోజకవర్గంనుంచి వరసగా రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్ణాటకలో ఆహార, ప్రజా పంపిణీ, విద్యుత్తు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పనిచేశారు. మూడు దశాబ్దాలుగా ప్రజా జీవనంలో ఉన్న శోభ సోషియాలజీలో ఎంఏ చేశారు.
భానుప్రతాప్ సింగ్ వర్మ: ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు చెందిన భానుప్రతాప్ జలాన్ నియోజకవర్గం నుంచి ఐదోసారి ఎంపీగా గెలిచారు. యూపీ ఎమ్మెల్యేగానూ ఎన్నికైన వర్మ మూడు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్నారు. బుందేల్‌ఖండ్ వర్సిటీ నుంచి ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్నారు.
దర్శన విక్రమ్ జర్దోష్ (60): గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన దర్శన మూడోసారి సూరత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుజరాత్ సోషల్ వెల్ఫేర్ బోర్డు సభ్యురాలిగా పనిచేసిన దర్శన సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా పనిచేశారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న ఆమె బీకాం చదివారు. సంస్కృతి ఆర్ట్ కల్చర్ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారు.
మీనాక్షి లేఖి (54): న్యూఢిల్లీ నియోజవర్గం నుంచివరసగా రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన లేఖి ఎన్‌డీఎంసీ సభ్యురాలిగా కూడా ఉన్నారు. మీడియాలో బీజేపీ వాయిస్‌గా పేరుపొందిన మీనాక్షి సామాజిక కార్యకర్తగానూ సేవలందించారు. ప్రధాని మోదీని ‘చౌకీదార్ చోర్ హై’అని వ్యాఖ్యానించిన రాహుల్‌గాంధీపై సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం పార్లమెంటులో పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్యానెల్ స్పీకర్ సభ్యురాలు.
అన్నపూర్ణదేవి (51): జార్ఖండ్‌లోని నార్త్‌ఛోతంగపూర్‌కు చెందినఅన్నపూర్ణ దేవి కోడర్మ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికయ్యారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిన ఆమె జార్ఖండ్ సాగునీరు, మహిళ, శిశు అభివృద్ధి, రిజి్రస్టేషన్ శాఖల మంత్రిగా పనిచేశారు. రెండు దశాబ్దాల క్రితం 30 ఏళ్ల వయసులో జార్ఖండ్ మైన్స్,జియాలజీ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాంచీవర్సిటీ నుంచి చరిత్రలో ఎంఏ చేశారు.
ఎ.నారాయణ స్వామి (64): కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన నారాయణ స్వామి చిత్రదుర్గ నియోజకవర్గం నుంచితొలిసారి ఎన్నికయ్యారు. కర్ణాటక అసెంబ్లీకి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన కేబినెట్‌మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. మూడు దశాబ్దాలపాటు ప్రజా జీవితంలో ఉన్న నారాయణస్వామి బీఏ చదివారు.
కౌశల్ కిషోర్ (61): ఉత్తరప్రదేశ్‌లోని అవద్‌కు చెందిన కౌశల్ మోహన్‌లాల్‌గంజ్ నియోజకవర్గానికి రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూపీ ప్రభుత్వంలో సహాయమంత్రిగా పనిచేసిన కౌశల్ మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. బీఎస్సీ చదివారు.
అజయ్‌భట్ (60): ఉత్తరాఖండ అల్మోడాకు చెందిన అజయ్ భట్ నైనిటాల్–ఉధమ్‌సింగ్‌నగర్ నుంచి తొలిసారి ఎన్నికయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన భట్ ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో పలు మంత్రిత్వశాఖలు చేపట్టారు. రెండున్నర దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్న అజయ్‌భట్ న్యాయవాది.
బీఎల్ వర్మ (59): ఉత్తరప్రదేశ్‌లోని రోహిలాఖండ్‌కు చెందిన వర్మ రాజ్యసభ సభ్యుడు మూడున్నర దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్న వర్మ వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత వర్సిటీ నుంచి ఎంఏ పూర్తిచేశారు.
అజయ్‌కుమార్ (60): ఉత్తరప్రదేశ్‌లోని అవద్‌కు చెందిన అజయ్‌కుమార్ ఖేరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాపరిషద్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా పదవులు నిర్వహించారు. మూడు దశాబ్దాలపాటు ప్రజాజీవితంలో ఉన్న అజయ్‌కుమార్ బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ చేశారు.
చౌహాన్ దేవుసిన్హ్ (56): గుజరాత్‌లోని ఖేడాకు చెందిన చౌహాన్ వరసగా రెండోసారి ఖేడా నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆల్‌ఇండియా రేడియోలో ఇంజినీరుగా పనిచేసిన చౌహాన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాచేశారు.
భగవంత్ కుభ(54): కర్ణాటకలోని బీదర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు.
కపిల్ మోరేశ్వర్ పాటిల్ (60): మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి చెందిన కపిల్ భివండి నియోజకవర్గంనుంచిప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా వివిధ పదవుల్లో ఉన్న కపిల్ సర్పంచి, జిల్లా పరిషద్ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. ముంబయి వర్సిటీ నుంచి బీఏ పూర్తి చేశారు.
ప్రతిమా భౌమిక్ (52): అగర్తలాకు చెందిన ప్రతిమా భౌమిక్ త్రిపుర వెస్ట్ నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. బయోసైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు.
సుభాష్ సర్కార్ (67): పశ్చిమ బెంగాల్ మేదినిపూర్‌కు చెందినసుభాష్ బంకురా నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎయిమ్స్ కల్యాణి బోర్డు సభ్యుడైన సుభాష్ గైనకాలజిస్ట్. చిన్నతనం నుంచే సామాజిక కార్యక్రమంలో చురుగ్గా ఉండేవారు. ఐదు దశాబ్దాల ప్రజా జీవితంలో ఉన్న సుభాష్ రామకృష్ణ మిషన్‌తోకలిపి పనిచేసేవారు. కలకత్తా వర్సిటీ నుంచి ఎంబీబీఎస్ చేశారు.
భగవత్ కిషన్‌రావ్ కరాద్ (64): మరాట్వాడా ప్రాంతానికి చెందిన భగవత్ రాజ్యసభ సభ్యుడు. ఔరంగాబాద్ మేయర్‌గా పనిచేసిన ఆయన మరాట్వాడా లీగల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. వృత్తి రీతా వైద్యుడైన భగవత్ ఎంబీబీఎస్, ఎంఎస్(జనరల్ సర్జరీ), ఎంసీహెచ్(పీడియాట్రిక్ సర్జరీ), ఎఫ్‌సీపీఎస్ (జనరల్ సర్జరీ ) చేశారు.
రాజ్‌కుమార్ రంజన్ సింగ్ (68): ఇంఫాల్‌కు చెందిన రాజ్‌కుమార్ ఇన్నర్ మణిపూర్ నియోజవర్గంనుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న రాజ్‌కుమార్ జియోగ్రఫీ ప్రొఫెసర్. గువాహటి యూనివర్సిటీ నుంచి జీయోగ్రఫీలో ఎంఏ ,పీహెచ్‌డీ చేశారు.
భారతి ప్రవీణ్ పవార్ (42): మహారాష్ట్రలోని ఖందేశ్‌కు చెందిన భారతి దిండోరి నియోజకవర్గం నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాసిక్‌జిల్లా పరిషద్ సభ్యురాలిగా చేసిన భారతి రక్షిత నీరు అందించడం, పౌష్టికాహారలోపాన్ని రూపుమాపడంలో కృషి చేశారు. నాసిక్‌లోని ఎన్‌డీఎంవీపీఎస్ వైద్య కళాశాల నుంచి సర్జరీలో ఎంబీబీఎస్ చేశారు.
బిషే్వశ్వర్ తుడు(56): ఒడిశాలోని మయూర్‌భంజ్‌కు చెందిన తుడు తొలిసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒడిశాలోని జలవనరుల విభాగంలో సీనియర్ ఇంజినీరుగా పనిచేశారు. రూర్కెలాలోని ఉత్కళమణి గోపబంధు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా చేశారు.
శాంతను ఠాకూర్ (38): ప్రధాని మోదీ కేబినెట్‌లో రెండో అత్యంత పిన్నవయస్కుడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన శాంతను బాంగాన్ నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మతువా వర్గానికి చెందిన శాంతను కర్ణాటక దూరవిద్య వర్సిటీ నుంచి బీఏ ఇంగ్లిష్ చేశారు.
ముంజపరా మహేంద్రభాయ్ (52): గుజరాత్‌లోని సురేంద్ర నగర్‌కు చెందిన ముంజపరా వృత్తిరీతా వైద్యుడు. జనరల్ మెడిసిన్‌లో ఎండీ చేసిన ముంజపరా మూడు దశాబ్దాలుగా కార్డియాలజిస్ట్, ప్రొఫెసర్‌గా గుర్తింపుపొందారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే ఆయన వైద్య శిబిరాల ద్వారా 8లక్షలకు పైగా రోగులకు సేవలందించడంతోపాటు రూ.2కే మందులు అందించేవారు.
ఎల్.మురుగన్ (44): ఉభయసభల్లోనూ సభ్యుడు కాదు. తమిళనాడులోని కొంగునాడుకు చెందిన మురుగన్ 15 ఏళ్లుగా మద్రాస్ హైకోర్టులో న్యాయ వాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. మద్రాస్ వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం, లా లో పీహెచ్‌డీ చేశారు.
నిశిత్ ప్రమానిక్ (35): ప్రధాని మోదీ కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కుడు. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురికి చెందిన నిశిత్ కూచ్‌బెహార్ నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీసీఏ చదివిన నిశిత్ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment