రాంచీలో ఇంట్లో పుస్తకం చదువుతున్న హేమంత్
న్యూఢిల్లీ/రాంచీ: హేమంత్ సోరెన్ నేతృత్వంలో జార్ఖండ్‌లో నూతన ప్రభుత్వం ఆదివారం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్‌తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీల నుంచి ఒక్కొక్క మంత్రి చొప్పున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా, (జేఎంఎం) దాని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)ల్లో మంత్రుల ఎంపిక ఖరారైనట్లు తెలిసింది. దీని ప్రకారం జేఎంఎం నుంచి ఆరుగురికి, కాంగ్రెస్ నుంచి నలుగురికి, ఆర్జేడీ నుంచి ఒకరికి మంత్రి పదవులు ఖరారయ్యాయి. కాంగ్రెస్‌కు అసెంబ్లీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం. లేదా మరో మంత్రి పదవి వరించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో జేఎంఎం 30 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 స్థానం గెలుచుకున్నాయి. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని వెల్లడించాయి. కాగా, కాంగ్రెస్‌లో ఆ పార్టీ సీనియర్ నేతలు అలాంగిర్ ఆలం, రామేశ్వర్ ఓరాన్, రాజేంద్ర ప్రసాద్ సింగ్‌లకు మంత్రి పదవులు దాదాపు ఖరారయ్యారని, మరొకరిని ఎంపిక చేయాల్సి ఉందన్నాయి. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ముఖ్యమంత్రులు కమల్‌నాథ్ (మధ్యప్రదేశ్), భూపేశ్ బఘేల్ (ఛత్తీస్‌గఢ్), అశోక్ గెహ్లోత్ (రాజస్తాన్), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), ఉద్ధవ్ ఠాక్రే (మహారాష్ట్ర), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment