
ఫైల్‌ఫొటో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈనెల 19న తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమాత్యుల జాబితా దాదాపు ఖరారైనట్లేనని టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. ఆదిలాబాద్ నుంచి సీనియర్‌నేత, మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి బెర్తు కన్‌ఫాం అయినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, వరంగల్ నుంచి పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకి అవకాశం లభించిందని సమాచారం.
ఇక మహబూబ్‌నగర్ నుంచి వనపర్తి శాసన సభ్యుడు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇద్దరిలో ఒక్కరికి అవకాశం కల్పించే విషయంపై కేసీఆర్ కసరత్తు ఇంకా కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని, పద్మారావుకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై కేసీఆర్ మరింతో లోతుగా ఆలోచిస్తున్నారు. కరీంనగర్ నుంచి ధర్మపురి ఎమ్మెల్యే కొప్పల ఈశ్వర్, ఈటల రాజేందర్ విషయంపై ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. నల్గొండ నుంచి మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి పదవి దాదాపు ఖరారైనట్లే.
ఇక రంగారెడ్డి, మెదక్, ఖమ్మం జిల్లాల నుంచి ఈసారికి ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కడే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో కొత్తగూడెం, ఖమ్మం కోటాలో ఆయనకు పదవి దక్కుతుందని ధీమాగా ఉన్నారు. ఇదిలావుండగా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఎస్సీ కోటాలో ఆయనకు పదవి దక్కుతుందని సమాచారం. కాగా ఈ నెల 19న మాఘ శుద్ధ పౌర్ణమి నేపథ్యంలో కేసీఆర్.. మంత్రివర్గ విస్తరణకు ఆ రోజున ముహుర్తం నిర్ణయించారు. తొలి విడతలో 10మందితో క్యాబినెట్ విస్తరణ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment