సాక్షి, హైదరాబాద్ : భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రభుత్వం మరోసారి మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సెప్టెంబరు రెండోవారంలో కేసీఆర్ కేబినెట్‌లో కొత్తగా ముగ్గురు ఎమ్మెల్యేలు... మంత్రులుగా అవకాశం దక్కించుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులతో పాటు మహిళా ప్రజాప్రతినిధులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే వీరిలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ తనయుడు కేటీఆర్‌కు మంత్రి పదవి ఖాయమైనట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రతిష్టాత్మక సంస్థగా పేరొందిన అమెజాన్, స్మార్ట్‌ఫోన్ దిగ్గజాలు ఒప్పో, వన్ ప్లస్ వంటి ప్రపంచ దిగ్గజాలకు నగరం వేదికైందనే నెటిజన్ల ట్వీట్లకు స్పందించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ..‘ఈ ఘనత మాజీ మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందని. ప్రభుత్వంలో ఆయనను మరోసారి చూడాలని ఉంది’ అంటూ ఆసక్తికర కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ మరోసారి మంత్రిగా తన సేవలు అందించాల్సి ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కాగా కేటీఆర్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కాలంటే జిల్లాల ప్రాతినిథ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరో ఒకరిపై వేటు తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగమైన సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ గతంలో మంత్రి పదవి దక్కించున్నారు. అయితే ప్రస్తుతం అదే జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు కేబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు. ఇక కరీంనగర్ ఎంపీగా రెండు పర్యాయాలు ఎన్నికైన బి.వినోద్‌కుమార్ ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ స్థాపించిన నాటి నుంచి టీఆర్‌ఎస్‌లో కీలక పాత్ర పోషించిన వినోద్‌కు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే ఈ పదవితో ఆయన అనుచరవర్గం అంతగా సంతృప్తి చెందలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాలు, సామాజిక వర్గాల ఆధారంగా ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ నుంచి ఇద్దరు మంత్రులను కేబినెట్‌లోకి తీసుకున్న కేసీఆర్..మరోసారి అదే జిల్లాకు ప్రాధాన్యం ఇస్తే వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ మంత్రి పదవి ఇవ్వడం ఖాయమైతే ఎవరో ఒకరి అమాత్య పదవి చిక్కుల్లో పడనుందనే సందేహాలు తలెత్తున్నాయి.
ఇక రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ కేసీఆర్ మంత్రివర్గంలో ఇంతవరకు ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడంతో ఆయన ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈసారైనా మంత్రివర్గ విస్తరణలో భాగంగా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చి, విమర్శలను తిప్పికొట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ హోం మంత్రిగా అపార అనుభవం ఉన్న సబితాఇంద్రారెడ్డికి కీలక శాఖ దక్కనుందనే ప్రచారం ఊపందుకుంది. అయితే కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన సబితతో పాటు సత్యవతి పేరు కూడా ప్రముఖంగా వినిపించడంతో ఎవరికి మంత్రివర్గంలో చోటుదక్కనుందనే విషయం ఆసక్తికరంగా మారింది.
కాగా గత ప్రభుత్వం హయాంలో భారీ నీటిపారుదల శాఖా మంత్రిగా కీలక సేవలు అందించిన హరీశ్‌రావుకు ఈసారి మంత్రివర్గంలో చోటు లేకపోవడం ఆయన అభిమానులతో పాటు సామాన్యులను కూడా ఆశ్చర్యపరిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించిన ఆయన.. ప్రస్తుతం కేవలం తన నియోజకవర్గం సిద్ధిపేటకు మాత్రమే పరిమితవడాన్ని హరీశ్ అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. లోకసభ ఎన్నికల్లో పార్టీ భారీ విజయం సాధించినట్లైతే కేసీఆర్‌తో పాటు హరీశ్ కూడా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని సంబరపడిన అభిమానులకు.. ఎన్నికల ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఈ క్రమంలో హరీశ్‌కు మంత్రిపదవి దక్కితేనే సముచిత గౌరవం దక్కుతుందని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకు కచ్చితంగా చోటు దక్కాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి అసంతృప్తిని చల్లార్చేందుకు, పార్టీ భవిష్యత్తు కోసం కేసీఆర్.. పార్టీ కీలక నాయకుడు, తన మేనల్లుడు అయిన హరీశ్‌రావుకు మంత్రిగా మరో అవకాశం ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ మేరకు ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment