
తెలంగాణ కేబినెట్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు కావడంతో ఇప్పుడు... కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ విస్తరణలో పదిమందికి మంత్రులుగా అవకాశం లభించనుంది. కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. కాగా గత ప్రభుత్వంలోని మంత్రులతోపాటు కొత్త వారిని కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనుంది. ఊహించని విధంగా ఒకరిద్దరికి చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19ద తేదీ ఉదయం 11.30 గంటలకు రాజ్ భవన్‌లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది.
మంత్రివర్గ కూర్పులో సాధారణంగా మూడు కీలక అంశాలను ప్రాతిపదికగా చేసుకొని పరిపాలన సమర్థత, సామాజిక సమీకరణాలు, ప్రభుత్వం–పార్టీని అనుసంధానించే నేతలతో కేబినెట్ ఏర్పాటు కానుంది. అంతేకాకుండా గత టీఆర్‌ఎస్ కేబినెట్‌లో మహిళలకు చోటు దక్కలేదన్న విమర్శల నేపథ్యంలో ఈసారి ఒకరికి అవకాశం లభించనుంది. మంత్రివర్గంలో చోటు దక్కేవారిలో గత ప్రభుత్వంలో పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిన కేటీఆర్, సాగునీటి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన హరీశ్ రావుతో పాటు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, జోగు రామన్న, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డికి కేబినెట్‌లో అవకాశం లేనట్లేనని తెలుస్తోంది.