సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు మంత్రివర్గంలో చోటు దక్కదని అన్నారు. హరీశ్‌తో పాటు మరో నలుగురు సీనియర‍్లుకు మంత్రివర్గంలో స్థానం దక్కదని పేర్కొన్నారు. కేసీఆర్ కేబినెట్‌లో అసమర్థులకు చోటిస్తారని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ టీఆర్‌ఎస్ పార్టీపై పలు ఆరోపణలు గుప్పించారు.
రేవంత్ రెడ్డి సోమవారమిక్కడ విలేకరలుతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మిడ్ మానేరు, గౌరెల్లి, తోటపల్లి పనుల్లో సుమారు వెయ్యి కోట్లు తీసుకున్నారు. తన బినామీలకే కాంట్రాక్ట్‌లు ఇప్పించారు. ఆ డబ్బులనే కేసీఆర్‌కు తెలియకుండా హరీష్ ఎన్నికల్లో డబ్బులు పంచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 26మందికి ఆయన డబ్బులిచ్చారు. కొందరు కాంగ్రెస్ వాళ్లకు ఇస్తానంటే తీసుకోలేదు. హరీష్..అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడటం కేసీఆర్‌కు తెలిసింది. అందుకే మంత్రి పదవి కట్. ఒకవేళ హరీశ్ ఎదురు తిరిగితే పాస్‌పోర్టు కేసులో ఇరికించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారు.
కడియం, నాయినిని పక్కన పెట్టారెందుకు?
ఇక కడియం శ్రీహరిపై ఒక‍్క అవినీతి ఆరోపణ లేదు. మరి ఆయనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వడం లేదు?. మాదిగలకు కేబినెట్‌లో చోటు కల్పించడం లేదు. అలాగే నాయిని నర్సింహారెడ్డిని పక్కనపెట్టారు. కేసీఆర్‌కు అహంకారం తలకెక్కింది. పాలన పక్కన పెట్టి ప్రత్యర్థులను వేధిస్తున్నారు. కేసీఆర్, నరేంద్ర మోదీల మధ్య ఫెవికాల్ బంధం. ఎన్నికల్లో యాభై లక్షలు దొరికిన పట్నం నరేందర్ రెడ్డి కేసు ఎందుకు ఈడీకి ఇవ్వరు?. ఐటీ శాఖ ఇచ్చినా కూడా ఈడీ ఎందుకు విచారణ చేపట్టడం లేదు. అదే నాపై మాత్రం ఐటీ, ఈడీ కేసులు పెట్టించారు.
ఉగ్రదాడిలో అమరులైన జవాన్లుకు కేసీఆర్ నివాళులు అర్పించకపోవడం దారుణం. ఆయన దృష్టిలో జవాన్‌లకు, కిసాన్‌లకు విలువలేదు. పార్టీ నేత పోచారం శ్రీనివాసరెడ్డి తల్లి చనిపోతే పలకరించిన కేసీఆర్‌కు జవాన్ కుటుంబాలను పలకరించలేదు. నిజామాబాద్‌లో ఆందోళన చేస్తున్న రైతులను కేసీఆర్ పట్టించుకోలేదు.ఎర్రజొన్న, పసుపు రైతులను ప్రభుత్వం పట్టించుకోదు. ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తున్నా. వారంలోగా పరిష్కరించకుంటే నేనే ఆ రైతులకు మద్దతుగా వెళతా. పార్టీ ఓటమిపై అంతర్గతంగా చర్చించుకుంటాం. నేను ఎక్కడున్నా కంఫర్ట్‌గానే ఉంటా.’ అని అన‍్నారు.
Comments
Please login to add a commentAdd a comment