రాజస్తాన్‌పై కాంగ్రెస్‌ దృష్టి | Rajasthan Cabinet Expansion Likely By August 10 | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌పై కాంగ్రెస్‌ దృష్టి

Published Mon, Jul 26 2021 3:40 AM | Last Updated on Mon, Jul 26 2021 8:27 AM

Rajasthan Cabinet Expansion Likely By August 10 - Sakshi

జైపూర్‌: పంజాబ్‌లో రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించిన కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పుడు తన దృష్టి రాజస్తాన్‌పైకి మళ్లించింది. రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్‌ల మధ్య ఇంకా ఘర్షణాత్మక వాతావరణమే కొనసాగుతోంది. కేబినెట్‌లో బెర్త్‌ల కోసం సచిన్‌ పైలెట్‌ వర్గీయులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. దీనిపై కాలయాపన జరుగుతూ ఉండటంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మూడు రోజుల క్రితమే సచిన్‌ పైలెట్‌ అధిష్టానం తమ డిమాండ్లను నెరవేరుస్తుందని సూచనప్రాయంగా వెల్లడించారు.

ఆ తర్వాతే మంత్రివర్గంలోకి తీసుకునే సభ్యులపై కసరత్తు చేయడానికి పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, రాజస్తాన్‌  పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అజయ్‌ మాకెన్‌ జైపూర్‌కు చేరుకొని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌తో మంతనాలు జరిపారు. ఈ నెల 28న కేబినెట్‌ విస్తరణ చేపట్టాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ దోత్సారా ఆదివారం ఉదయం 25 మంది ఎమ్మెల్యేలతో సమావేశమై కేబినెట్‌ విస్తరణపై చర్చలు జరిపారు. ఈ సమావేశానికి హాజరైన సచిన్‌ పైలెట్‌ కేబినెట్‌లో తన వర్గీయులకి చోటు కల్పించాలని డిమాండ్‌ చేశారు.  

తొమ్మిది ఖాళీలు
వేణుగోపాల్, అజయ్‌ మాకెన్‌ గత రెండు రోజులుగా వరుసగా పార్టీ నాయకుల్ని కలుసుకొని మాట్లాడుతున్నారు. ఆదివారం ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు. ‘‘కేబినెట్‌ విస్తరణపై చర్చలు జరిపాం. జిల్లా, బ్లాక్‌ స్థాయిలో పార్టీ చీఫ్‌ల నియామకం, వివిధ పాలకమండళ్లు, కార్పొరేషన్లలో నియామకాలకు సంబంధించిన కసరత్తు మొదలైంది. రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో ఎలాంటి విభేదాలు లేవు. కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నేతలందరూ చెబుతున్నారు ’’ అని మాకెన్‌ తెలిపారు. రాజస్తాన్‌ కేబినెట్‌లో అత్యధికంగా 30 మంది మంత్రులు ఉండొచ్చు. ప్రస్తుతం సీఎం గహ్లోత్‌తో సహా కేబినెట్‌లో 21 మంది మంత్రులే  ఉన్నారు. ఇంకా తొమ్మిది మందికి కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉంది. గత ఏడాది 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి గహ్లాత్‌పై సచిన్‌ పైలెట్‌ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్‌ అధిష్టానంతో సయోధ్య కుదిరి ఆయన వెనక్కుతగ్గారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement