సాక్షి, న్యూఢిల్లీ: 2019 మేలో రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన క్యాబినెట్‌ను భారీగా విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. 2024లో కూడా అధికార పీఠం లక్క్ష్యంగా పలు సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని మంత్రుల మండలి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూండటంతో పాటు యువ రక్తానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం.
కేంద్ర కేబినెట్‌లో కొత్తగా 43 మందికి అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని ఆహ్వానం అందుకున్న నేతలు ఆయన నివాసానికి చేరుకున్నారు. కేబినెట్ బెర్త్ ఖాయం చేసుకున్న వారి జాబితాలో జ్యోతిరాదిత్య సింధియా, సర్బానంద సోనోవాల్, నారాయణ్ రాణే, భూపేంద్ర యాదవ్, ఆర్.పి.సింగ్, అనుప్రియ పటేల్, పశుపతి పరాస్, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాల, కిషన్‌రెడ్డి, కపిల్ పాటిల్, మీనాక్షి లేఖి, అశ్వినీ వైష్ణవ్, శాంతను ఠాకూర్, పంకజ్ చౌదరి, దిలేశ్వర్ కామత్, రాహుల్ కాస్వా, వినోద్ సోంకర్, చందేశ్వర్ ప్రసాద్, రామ్‌నాథ్ ఠాకూర్, రాజ్‌కుమార్ రంజన్‌సింగ్, అజయ్ మిశ్ర, బీఎల్ వర్మ, అజయ్ భట్, శోభా కరంద్లాజే ఉన్నారు.
సామాజిక సమీకరణాలు.. వివిధ అంచనాలు
కేంద్ర కేబినెట్‌లో 12 మంది ఎస్సీలకు చోటు దక్కనుంది. వీరిలో ఇద్దరికి కేబినెట్ హోదా లభించే అవకాశం. అలాగే 8 మంది ఎస్టీలకు చాన్స్ దక్కనుండగా, వీరిలో ముగ్గురికి కేబినెట్ హోదా కల్పించనున్నారు. ఇక బీసీల విషయానికి వస్తే 27 మంది ఓబీసీలకు చోటు దక్కనుంది. వీరిలో ఐదుగురికి కేబినెట్ హోదా లభించనుంది. వీరితో పాటు ఐదుగురు మైనారిటీ మంత్రులకు ఛాన్స్ లభించనుంది. ముగ్గురికి కేబినెట్ హోదా దక్కనుంది. వీరితోపాటు ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధులకు ఒక‍్కొక్కరు చొప్పున సమానం ప్రాతినిధ్యాన్నివ్వనున్నారు.
మహిళలు
భారీగా విస్తరించనున్న మోదీ కొత్త కేబినెట్‌లో 11 మంది మహిళలకు మంత్రులుగా అవకాశం లభించనుందని అంచనా. ముఖ్యంగా ఇద్దరికి కేబినెట్ హోదా కల్పించ నున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనంతరం, రాష్ట్రపతి భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుంది. కేంద్రమంత్రుల సగటు వయసు 58 సంవత్సరాలు కాగా 50 ఏళ్ల లోపు వయసు ఉన్న మంత్రులు 14 మంది ఉండగా, 50 ఏళ్ల లోపు వయసు ఉన్నవారిలో ఆరుగురికి కేబినెట్ ర్యాంక్ ఉంది. దీంతో ప్రస్తుతం 53గా ఉన్న కేబినెట్ సభ్యుల సంఖ్య 81 వరకు పెరగ వచ్చనేది ప్రధాన అంచనా.
Comments
Please login to add a commentAdd a comment