సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏసర్కార్ తాజా కేబినెట్ విస్తరణ తీవ్ర ఆసక్తిని రేపుతోంది. ఇటీవలి అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తగిలిన ఎదురు దెబ్బ నేపథ్యంలో తన మంత్రి వర్గాన్ని భారీగా విస్తరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొగ్గు చూపారు. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక సంవత్సరమే సమయం ఉండటంతో అటు కుల, ఇటు మిత్ర పక్షాలను సంతృప్తిపరచేలా వివిధ సమీకరణాలను మోదీ పరిశీలించినట్టు తెలుస్తోంది.
2022లో రానున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, ఈ రోజు కేంద్ర కేబినెట్‌లో చేరే అవకాశం ఉన్న యూపీకి చెందిన అభ్యర్థులను పరిశీలిస్తే వరుణ్ గాంధీ, అనుప్రియా పటేల్, రీటా బహుగుణ జోషిలకు మోదీ కొత్త మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.
అనుప్రియా పటేల్
అప్నా దళ్ (సోనెలాల్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌ను కేంద్ర మంత్రివర్గంలో చేర్చడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. యూపీ అసెంబ్లీలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ కేబినెట్ విస్తరణలో అప్నా దళ్ (సోనెలాల్) కోటా 2019 ఆగస్టులో పెరగలేదు. వాస్తవానికి అనుప్రియా పటేల్ తన పార్టీ నుండి ఇద్దరు మంత్రులకు బెర్తులు పొందాలని భావించారు ఈ నేపథ్యంలో వారిని బుజ‍్జగించే క్రమంలో అనుప్రియకు అవకాశం రానుంది.
వరుణ్ గాంధీ
వచ్చే ఏడాది యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం రానుందని భావిస్తున్న కేంద్ర మాజీమంత్రి మేనకాగాంధీ కుమారుడు, వరుణ్ గాంధీకి అనూహ్యంగా మోదీ కేబినెట్‌లో ఛాన్స్ దక్కనుంది. ఇప్పటిదాకా దూకుడు నాయకుడిగా పేరొందిన వరుణ్‌గాంధీని పక్కన పెట్టిన మోదీ ఇపుడిక అవకాశాన్నివ్వనున్నారు.ముఖ్యంగా యూపీలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంక గాంధీ వాద్రాకు, గాంధీ కుటుంబానికి చెక్ పెట్టేలా వరుణ్ గాంధీని రంగంలోకి దింపనుంది.
రీటా బహుగుణ జోషి
అలహాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ, ప్రొఫెసర్ రీటా బహుగుణ జోషి కూడా కేంద్ర మంత్రివర్గం రేసులో ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ తొలి మంత్రివర్గంలో పర్యాటక రంగంతో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి. బలమైన మహిళా బ్రాహ్మణ నాయకురాలిగా, విద్యావేత్తగా, రీటా బహుగుణ కీలకంగా ఉన్నారు.
అజయ్ మిశ్రా
ఉత్తరప్రదేశ్‌లోని బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించడానికి లఖింపూర్ ఖేరి ఎంపీ అజయ్ మిశ్రాను కేంద్రమంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉంది. తద్వారా మోదీ 2.0 క్యాబినెట్‌లోకి యువతకు ప్రాధాన్యం అవకాశం సందేశాన్నివ్వనుంది.
రామ్ శంకర్ కాథెరియా
దళిత ఓటర్లను ఆకర్షించే బీజేపీ వ్యూహంలో భాగంగా దళిత నాయకుడు, ఇటావా ఎంపి రామ్ శంకర్ కాథెరియాకు అవకాశం దక్కనుంది. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ మాజీ ఛైర్మన్. ఇంతకుముందు ఆగ్రా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాథెరియా, మోదీ తొలి కేబినేట్‌లో కూడా చోటు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment