అవకాశం రావడం గర్వంగా ఉంది: కిషన్‌ రెడ్డి | I Will Work to resolve disputes between Telugu states: Kishan Reddy | Sakshi
Sakshi News home page

Kishan Reddy: అవకాశం రావడం గర్వంగా ఉంది: కిషన్‌ రెడ్డి

Published Thu, Jul 8 2021 4:14 AM | Last Updated on Thu, Jul 8 2021 4:15 AM

I Will Work to resolve disputes between Telugu states: Kishan Reddy  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జి.కిషన్‌రెడ్డికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలు దక్కాయి. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.  ఈ మూడు శాఖలకు అయిదుగురు సహాయ మం త్రులను కేటాయించారు. శ్రీపాద యశో నాయక్, అజయ్‌భట్‌లను కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రులుగా, మీనాక్షి లేఖి, అర్జున్‌ రాం మేఘ్వాల్‌లను సాంస్కృతిక శాఖ సహాయ మంత్రులుగా, బీఎల్‌ వర్మ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించనున్నారు. బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో కేంద్ర కేబినెట్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన తన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...

గర్వంగా ఉంది...
తెలంగాణ నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మొట్టమొదటి కేబినెట్‌ మంత్రిగా తనకు అవకాశం రావడం గర్వంగా ఉంది. భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్తకు అవకాశం దక్కుతుందనడానికి నాకు కేబినెట్‌ పదవి రావడమే ఒక నిదర్శనం. హోం మంత్రి అమిత్‌ షాతో కలిసి పనిచేసిన అనుభవం ఎన్నటికీ మర్చి పోలేను. పార్టీకి– ప్రభుత్వానికి, ప్రజలకు–కార్యకర్తలకు మధ్య మంత్రిగా ఎలా సమన్వయం చేయాలో అమిత్‌ షా నుంచి నేర్చుకున్నాను. కేంద్ర కేబి నెట్‌ మంత్రిగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు సాయం చేయడంలో శక్తివంచన లేకుండా పని చేస్తాను. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు రావాలి. ఈ వ్యవహారాల్లో తప్పని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. 

పదోన్నతి కోరలేదు..
ఈ రెండేళ్ళలో ఏ రోజూ అధిష్టానం వద్ద పదోన్నతి కోసం అడగలేదు. అలా అడిగే అవకాశం బీజేపీలో చాలా తక్కువగా ఉంటుంది. అయినా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాతో పాటు అనేక మందిని విస్తరణలో భాగంగా పార్టీ అగ్ర నాయకత్వం మంత్రులుగా అవకాశం ఇచ్చింది. కేంద్ర మంత్రివర్గంలో బడుగు, బలహీనవర్గాల వారికి అత్యధిక ప్రాతినిధ్యం లభించింది. కేంద్ర కేబినెట్‌ మంత్రిగా వెంకయ్యనాయుడు తర్వాత నాకు అవకాశం లభించింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా జమ్మూ, కశ్మీర్, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించిన కారణంగా గత రెండేళ్ళలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అందుబాటులో ఉండలేకపోయాను. ఇకపై తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తర ఫున అందుబాటులో ఉంటాను. ‘సబ్‌ కే సాత్‌ సబ్‌ కే వికాస్‌’ అన్న రీతిలో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాను. 

వివాదాల పరిష్కారం..
ఇటీవల పలు అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాను. నాకు ఏ బాధ్యత అప్పగించినా, ఏ శాఖ కేటాయించినా, ఆ శాఖ ద్వారా తెలుగు ప్రజలకు మంచి పేరు తెచ్చేలా పనిచేస్తాను. తెలుగు ప్రజలు, నాకు ఓటేసిన ప్రజలు ఎప్పుడూ, ఏ సందర్భంలోనూ తలదించుకునే ఎలాంటి పనిచేయనని హామీ ఇస్తున్నాను. ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా పరిస్థితుల్లో భారత ప్రజలను సంఘటితం చేసి కరోనాపై పోరాడాల్సిన అవసరం ఉంది. కరోనా కారణంగా గత ఏడాదిగా అదుపు తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, ఉద్యోగాల కల్పన, మౌలిక వసతులను మెరుగుపర్చే దిశగా కేంద్రం ముందుకెళ్తుంది.

రింగ్‌ రోడ్డు పనులపై..
ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో తెలంగాణకు మణిహారమైన హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డు పనుల పురోగతిపై చర్చించాను. అంతేగాక తెలంగాణకు సంబంధించి రైల్వే, ఇతర ప్రాజెక్టుల విషయంలో ఎప్పటికప్పుడు పురోగతిని తెలుసు కుంటున్నాను. హైదరాబాద్‌లో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం కోసం నా వంతు కృషి చేశాను. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో రాజకీయం చేయడం సహజం. ఒకరిపై ఒకరికి పోటీ ఉంటుంది. అయితే ఎన్నికల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలన్నీ సమన్వయంతో కలసి పనిచేయాల్సి ఉంటుంది. 

ఆర్టికల్‌ 370 ప్రస్తావన..
2019లో లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన తర్వాత హోంశాఖ సహాయమంత్రిగా అమిత్‌ షా తీసుకున్న నిర్ణయాలు, తీసుకొచ్చిన చట్టాల అమలు విష యంలో నా వంతు ప్రయత్నం చేశాను. జమ్మూ, కాశ్మీర్‌లో గతంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితి, ఉగ్రవాద బాధిత నేపథ్యంలో ఆర్టికల్‌ 370 తొలగించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ ఎక్కువగా పర్యటించాల్సి వచ్చింది. ఆర్టికల్‌ 370 తొలగింపు డిమాండ్‌ జనసంఘ్‌ సమయం నుంచి ఉంది. ఆర్టికల్‌ 370 తొలగింపు, పౌరసత్వ సవరణ చట్టం తేవడంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా నా వంతు పాత్ర పోషించాను. రెండేళ్ల పాటు అమిత్‌ షా తో కలసి పనిచేయడం మర్చిపోలేని అనుభవాన్ని ఇచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనా వ్యవహారాల్లో భాగమయ్యాను. ప్రతిక్షణం పార్టీ కోసమే ఆలోచించాను. పార్టీ కోసమే పనిచేశాను. 1980 నుంచి ఈరోజు వరకు పార్టీ బలోపేతం కోసం నిరంతరం పని చేస్తూనే ఉన్నాను. సాధారణ కార్యకర్తగా ఎలాగైతే పనిచేశానో కేంద్రమంత్రిగాను ఒదిగి ఉంటూ అలాగే పని చేస్తాను.

కిషన్‌రెడ్డికి సంజయ్‌ శుభాకాంక్షలు 
కేంద్ర కేబినెట్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జి.కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని కిషన్‌రెడ్డి నివాసంలో ఆయనను కలసి సన్మానించారు. కిషన్‌రెడ్డి కృషికి, పార్టీకి చేసిన సేవలకు తగిన గుర్తింపుగా ఈ పదవి దక్కిందని తాను భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని చెప్పడానికి కిషన్‌రెడ్డికి కేబినెట్‌ హోదా దక్కడమే నిదర్శనమన్నారు. కాగా, కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, సుభాష్‌ చందర్‌జీ తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement