12న కర్ణాటక మంత్రివర్గ విస్తరణ | Karnataka Cabinet Expansion On June 12 | Sakshi
Sakshi News home page

12న కర్ణాటక మంత్రివర్గ విస్తరణ

Published Sun, Jun 9 2019 9:38 AM | Last Updated on Sun, Jun 9 2019 9:38 AM

Karnataka Cabinet Expansion On June 12 - Sakshi

సాక్షి, బెంగళూరు: మంత్రివర్గ విస్తరణ ద్వారానే సంకీర్ణ సర్కారులోని అసమ్మతి వేడిని చల్లబరిచేందుకు కాంగ్రెస్, జేడీఎస్‌ పెద్దలు  సిద్ధమయ్యారు. ఈ నెల 12న మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం కుమారస్వామి తీర్మానించారు. విస్తరణపై శనివారం గవర్నర్‌ వజుభాయివాలాను సీఎం కలిసి వివరాలు అందజేశారు. 12న ఉదయం 11.30 గంటలకు విస్తరణ ముహూర్తంగా నిర్ణయించారు. దీంతో పదవుల కోసం సంకీర్ణ పక్షంలో చాలామంది ఆశావహ ఎమ్మెల్యేలు లాబీయింగ్‌లు షురూ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని తమకు తెలిసిన పరిచయాలతో విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

శంకర్, నాగేశ్‌లకు పదవులు  
కేబినెట్‌లో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒకటి కాంగ్రెస్, రెండు జేడీఎస్‌ కోటాలోనివి. రెండు మంత్రి పదవులు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలకు దాదాపుగా ఖరారయ్యాయి. రాణిబెన్నూర్‌ స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్‌. శంకర్, ముళబాగిలు స్వతంత్ర ఎమ్మెల్యే నాగేశ్‌లకు మంత్రి పదవులు దక్కనున్నాయి. మిగిలిన స్థానాన్ని అలాగే ఉంచుతారని సమాచారం. ఆ ఒక్క స్థానాన్ని ఎవరికో ఒకరికి ఇస్తే మిగిలిన వారిలో  అసంతృప్తి మరింత చెలరేగే ప్రమాదం ఉందని సంకీర్ణ సారథులు ఆందోళన చెందుతున్నారు. కాగా, మంత్రివర్గాన్ని ఏకంగా ప్రక్షాళన చేయాలని కొందరు సంకీర్ణనేతలు డిమాండ్‌ చేస్తున్నారు.
 
 ఆ ఒక్కటీ కాంగ్రెస్‌లో ఎవరికి?  
 ఒకవేళ కాంగ్రెస్‌ నుంచి ఒత్తిడి ఎక్కువయితే ఆ పార్టీ నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అప్పుడు  ఎవరికి చోటు కల్పించాలనే విషయమై ఆదివారం కాంగ్రెస్‌ రాష్ట్ర ఇంచార్జి కేసీ వేణుగోపాల్‌తో సీఎం చర్చించి ఖరారు చేయనున్నారు. కాంగ్రెస్‌లో చాలామంది ఎమ్మెల్యేలు మంత్రి పదవిని ఆకాంక్షిస్తున్నారు. బీసీ పాటిల్, రామలింగారెడ్డి, రోషన్‌ బేగ్, రమేశ్‌ జార్కిహొళితో సహా సుమారు 10 మందికి పైగా ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఎంతోకాలంగా కన్నేసి  ఉన్నారు. వీరిలో ఎవరికి అనేది సస్పెన్స్‌గా ఉంది. లోక్‌సభ ఫలితాల తర్వాత మంత్రివర్గ విస్తరణకు రెండు సార్లు ముహూర్తాలు పెట్టి తర్వాత విరమించుకున్నారు. బుధవారం మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం రాజ్‌భవన్‌లో జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement