సాక్షి, అమరావతి: ‘మీ విధానాలు, ఆలోచనలు ఆదర్శనీయం... చరిత్రాత్మకం... విప్లవాత్మకం...’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు పలికారు. ఏలూరు బీసీ డిక్లరేషన్‌కు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు మంత్రివర్గంలో పెద్ద పీట వేయాలని భావిస్తున్నట్లు శనివారం వైఎస్సార్ ఎల్పీ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా ఆయనకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ మాట్లాడినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మీ ఆలోచనలు విప్లవాత్మకం: బొత్స
తొలుత పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కొంత ఉద్వేగానికి లోనయ్యారు. మీ ఆలోచనా విధానాలు విప్లవాత్మకమైనవని గద్గద స్వరంతో పేర్కొన్నారు. వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేసిన తాను మీ హయాంలో ఎమ్మెల్యేగా ఉండటం ఎంతో సంతృప్తిని ఇస్తోందంటూ వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంచి పరిపాలన ప్రజలకు అందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. పార్టీకి ఇంత భారీ విజయం లభిస్తుందని తాను ఊహించలేదని అయితే మీరు మాత్రం ఈ విజయాన్ని ఊహించారని వ్యక్తిగత చర్చల్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
వారికి ప్రాధాన్యం కల్పించండి: కరణం ధర్మశ్రీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే వారికి తదుపరి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించేలా చూడాలని కరణం ధర్మశ్రీ కోరారు. ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగా నాడు చంద్రబాబు చేసిన దుర్మార్గాలపై విచారణ జరిపించి అవినీతిని ప్రజల దృష్టికి తేవాలని సూచించామన్నారు. అయితే వైఎస్సార్ పెద్దమనసుతో ‘ప్రజలే చంద్రబాబును శిక్షించారు పోనీలే.. ’ అన్నారని చెప్పారు. తరువాత దాని పర్యవసానం ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు సర్కారు దుర్మార్గాలపై ఒక కమిషన్ వేసి దర్యాప్తు జరిపి శిక్షించాలని కోరారు.
పదవులొద్దు.. మీరు సీఎంగా ఉంటే చాలు: రాచమల్లు
తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన అభిమతం అని రాచమల్లు ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి కావాలని ఏనాడూ లేదని, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే చాలని చెప్పారు. పర్వత పూర్ణచంద్రప్రసాద్ మాట్లాడుతూ వారం రోజులుగా సాగుతున్న నూతన పాలనను ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. మీరు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే పార్టీ విజయం కోసం కృషి చేసిన క్షేత్ర స్థాయి కార్యకర్తలపై దృష్టి పెట్టాలని వై.వెంకటరామిరెడ్డి కోరారు. మంత్రులైన వారు ఎమ్మెల్యేలను పట్టించుకునేలా చూడాలని వై.సాయిప్రసాద్‌రెడ్డి కోరారు. కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ తన భర్తను హత్య చేసినపుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ధైర్యం తమకు ఎంతో భరోసా ఇచ్చిందని, ఆయన విజ్ఞప్తి ప్రకారమే తనను ప్రత్తికొండ ప్రజలు భారీ ఆధిక్యతతో గెలిపించారన్నారు. జీవితాంతం జగన్ వెంటే ఉంటానన్నారు. కొలుసు పార్థసారథి మాట్లాడుతూ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని వైఎస్ జగన్ చెప్పిన మాట ఆ వర్గాల్లో ఎంతో విశ్వాసాన్ని పాదుగొల్పిందన్నారు. వారం రోజులుగా సాగుతున్న పాలన రాష్ట్ర ప్రజల్లోకి మంచి సంకేతాలు పంపిందన్నారు. బలహీనవర్గాల పట్ల జగన్ చిత్తశుద్ధి ఆయన్ను అంబేడ్కర్, పూలే సరసన నిలబెడుతుందని కొనియాడారు. రివర్స్ టెండరింగ్ విధానంపై విద్యావంతుల్లో సానుకూలమైన చర్చ జరుగుతోందన్నారు. జగన్ కృషి తామందరినీ గెలిపించినందున యావత్ శాసనసభాపక్షం ఒక తీర్మానం ఆమోదించాలని కోరారు.
మాటకు కట్టుబడ్డారు: ధర్మాన
మరో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమన్నారు. మీ నిర్ణయాలను పూర్తిగా సమర్థిస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేసేవారిని ఆదరించే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. కొత్త విధానాలు, సంస్కరణలు తలపెట్టినపుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సి ఉంటుందని అయితే ప్రస్తుతం పార్టీ తరఫున వాణిని వినిపించే అధికార ప్రతినిధులు అంత చక్కగా వాదనలు వినిపించలేక పోతున్నారని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల విషయంలో ప్రక్షాళన అవసరమని, గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా కక్షపూరిత వాతావరణం లేకుండా మార్పులు తేవాలని సూచించారు. అధికారం నుంచి నిష్క్రమిస్తూ రూ.30 వేల కోట్లను తగలేసిన పెద్దమనిషి దుర్మార్గంగా వ్యవహరించారని చంద్రబాబునుద్దేశించి విమర్శించారు.
70 శాతం ఓట్లు లక్ష్యం కావాలి: కోటంరెడ్డి
ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ దాదాపు 50 శాతం ఓట్లను సాధించడం ఓ చరిత్రని, ఈ స్థాయిలో ప్రధాని మోదీకి కూడా ఓట్లు రాలేదని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 70 శాతం ఓట్లను సాధించడం లక్ష్యం కావాలన్నారు. తనకు వైఎస్ జగన్ 2010లో పరిచయం అయినపుడే ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన నాయకత్వం లభించబోతోందని అంచనా వేశానని, నేడు అదే నిజమైందన్నారు. ముఖ్యమంత్రి అంటే జగన్‌లా ఉండాలి అనే విధంగా రాష్ట్రాన్ని పాలిస్తారన్న నమ్మకం తనకుందన్నారు. ఈ సమావేశంలో హఫీజ్‌ఖాన్, ఆదిమూలపు సురేష్, కొట్టుగుళ్ల భాగ్యలక్ష్మి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల్, కొటారు అబ్బయ్య చౌదరి, విడదల రజని తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment