సాక్షి, న్యూడిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణపై భారీ ఊహాగానాల మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైనట్టే. ప్రస్తుత కేబినెట్‌లో మరో 43 మందిని కొత్తగా మంత్రి పదవులు వరించనున్నాయని అంచనా. వీరిలో నలుగురు మాజీ సీఎంలకు కేబినెట్‌లో బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది.
స్వతంత్ర హోదా, సహాయ మంత్రి బాధ్యతలను నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. అలాగే సీనియర్ మంత్రుల నుంచి అదనపు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ వద్ద ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో మోదీ కేబినెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఇప్పటికే ఇద్దరు మంత్రులు వెల్లడించారు. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా ప్రకటించారు. కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌ను మోదీ కేబినెట్ నుంచి తప్పించ నున్నారు. దీంతో కేబినెట్ విస్తరణకు ముందే రమేష్ రాజీనామాను ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం, 21 మంది క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర బాధ్యత కలిగిన తొమ్మిది మంది మంత్రులు, 23 మంది సహాయ మంత్రులు ఉన్నారు. తాజా ఈ విస్తరణతో ఈ సంఖ్య 81కి పెరగొచ్చని భావిస్తున్నారు.
మోదీ కేబినెట్‌నుంచి రాజీనామా చేసినవారు
ప్రధానంగా కీలకమంత్రులను మంత్రివర్గంనుంచి తప్పించడం పలువురిని విస్మయ పర్చింది. ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవడేకర్, కేంద్ర కార్మిక శాఖమంత్రి, విద్యా శాఖా మంత్రికి తోడు కేంద్ర కెమికల్స్, ఎరువుల మంత్రి డీవీ సదానంద గౌడ కూడా కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దేబశ్రీ చౌదరి, పర్యావరణ సహాయ మంత్రి బాబూల్ సుప్రియో తప్పుకున్నారు. అలాగే విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే కూడా తప్పుకోనున్నారు. బెంగాల్‌కు చెందిన మరో మంత్రి ప్రతాప్ సారంగి కూడా రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment