
ఎట్టకేలకు ఒక పునర్వ్యవస్థీకరణ! గంటన్నర సాగిన మహా పునర్వ్యవస్థీకరణ! అనేక ఆశ్చర్యాలు కలిగిస్తూ... పాత బరువులు కొన్ని వదిలించుకొని, కొత్త ముఖాలు, సహకార శాఖ లాంటి కొత్త శాఖలతో, సరికొత్త ఇమేజ్ వచ్చేలా... కేంద్ర క్యాబినెట్ ఎన్నికల మార్కు సమూల పునర్వ్యవస్థీకరణ!! 2019లో రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టాక నరేంద్ర మోదీ బుధవారం తొలిసారి మంత్రి మండలిలో చేసిన భారీ మార్పుచేర్పులు అనేక కోణాల్లో ఆసక్తికరం. సన్నిహితులైన పలువురు పాత మంత్రులకు ఆయన ఉద్వాసన పలికారు. తొలిసారి ఎంపీలైనవారికీ, విద్యాధికులకూ చోటిచ్చారు. కొత్తగా ఏడుగురు స్త్రీలకు అవకాశమిచ్చి, మొత్తం 11 మంది మహిళా మంత్రుల క్యాబినెట్‌గా నారీ శక్తిని గౌరవించారు. అదే సమయంలో కులాలు, ప్రాంతాల వారీ పదవుల పందేరంతో సమతూకం కోసం ప్రయత్నించారు. ఉత్తరప్రదేశ్ సహా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రాంతాల్లో పట్టు బిగించేందుకు అక్కడి వారిని మంత్రులుగా చేర్చుకున్నారు. 35 ఏళ్ళ అతి పిన్నవయస్కుడికి (పశ్చిమబెంగాల్ –నిశిత్ ప్రామాణిక్) ఛాన్సిచ్చి, మంత్రిమండలి సగటు వయసు 58 ఏళ్ళనే మార్కు పడేలా చూశారు. వెరసి, ఇది ‘మోడీ 2.0 క్యాబినెట్’ అనే భావన కలిగించారు.
క్యాబినెట్ విస్తరణ వార్త కొద్ది రోజులుగా వినిపిస్తున్నా, ఈ స్థాయి మార్పులను నిన్న మొన్నటి దాకా ఎవరూ ఊహించలేదు. ‘మినిమమ్ గవర్నమెంట్... మ్యాగ్జిమమ్ గవర్నెన్స్’ అనేది ఒకప్పుడు మోదీ వ్యాఖ్య. దానికి తగ్గట్టే ఆయన తొలి క్యాబినెట్ తక్కువమందితోనే సాగింది. కానీ, సమర్థ పాలనకూ, సమస్యల పరిష్కారానికీ తగినంతమంది జట్టులో ఉండాలని రెండేళ్ళ ఎదురుదెబ్బలతో ఆయనకు తెలిసొచ్చినట్టుంది. అందుకే, ఇప్పుడు 78 మందికి తన టీమ్‌ను విస్తరించారు.
2014లో తొలిసారిగా మోదీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఎన్నడూ లేనంత పెద్ద జట్టు ఇది. ఈ కొత్త కూర్పులో 12 మంది పాతవారికి స్వస్తి పలికారు. 36 మంది కొత్త మంత్రులకు చోటిచ్చారు. టీఆరెస్‌పై పైచేయి సాధించి, పట్టు బిగించదలచిన తెలంగాణలో ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పదోన్నతి కల్పించారు. అదే రీతిలో మరో ఆరుగురికి ప్రమోషన్ దక్కింది. జ్యోతిరాదిత్య సింధియా సహా బుధవారం మొత్తం 43 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఏడేళ్ళుగా అధికారంలో ఉన్న మోదీ ఈ స్థాయిలో క్యాబినెట్ మార్పులు చేయడం ఇదే తొలిసారి. 2019లో రెండో దఫా పగ్గాలు చేపట్టాక, ఆయన మంత్రివర్గ విస్తరణ చేయనే లేదు. కానీ, ఇప్పుడు చేయక తప్పలేదు.
కరోనా కష్టకాలంలో ఆరోగ్య, ఆర్థిక, కార్మిక రంగాల్లో ఎదురైన సవాళ్ళతో పడిపోతున్న ఇమేజ్‌ను కూడగట్టుకొనేందుకు, క్యాబినెట్‌లో కొత్త రక్తం ఎక్కించడమే మందు అని మోదీ బృందం భావించింది. అవునన్నా కాదన్నా.. కరోనా రెండో ఉద్ధృతి అంచనాలో, సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యం ప్రపంచ వేదికపై అప్రతిష్ఠ తెచ్చింది. కొత్త ఐ.టి. నిబంధనలు, సినిమాటోగ్రాఫ్ చట్టం సవరణల లాంటివీ విమర్శల పాలయ్యాయి. దేశరాజధాని వెలుపల రైతుల ఆందోళనను విరమిపజేయడంలో మంత్రుల దౌత్య వైఫల్యం లాంటివీ బాధిస్తున్నాయి. వెరసి, పరిస్థితి చేయి దాటక ముందే సరిదిద్దుకోవాలనే ఆలోచన ఈ తాజా కూర్పుకు దారి తీసింది. ఇప్పటికిప్పుడు ఆరోగ్య మంత్రి– ఆయన సహాయకుడు (డాక్టర్ హర్షవర్ధన్, అశ్వినీ చౌబే), సమాచార శాఖ మంత్రి (ప్రకాశ్ జావదేకర్), ఐ.టి మంత్రి (రవిశంకర్ ప్రసాద్), విద్యా మంత్రి (రమేశ్ పోఖ్రియాల్), కార్మిక మంత్రి (సంతోష్ గాంగ్‌వర్)తో రాజీనామా చేయించారు. కొత్త వారికి బాధ్యతలు ఇచ్చారు.
అలాగే, వచ్చే ఏడాది మొదట్లో ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ సహా అయిదు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వ్యూహం కూడా కొలువు తీరిన కొత్త మంత్రుల ప్రాంతాలు, సామాజిక నేపథ్యాలతో అర్థమవుతోంది. సరికొత్త కేంద్ర క్యాబినెట్‌లో సుమారు 27 మంది ఓబీసీలు, అయిదుగురు మైనారిటీలని ఓ లెక్క. అంటే ఈ పునర్వ్యవస్థీకరణ రాజకీయ అనివార్యతలతో పాటు, ఓటర్లను దృష్టిలో పెట్టుకొని చేసిన ఓ రాజకీయ విన్యాసం కూడా అని స్పష్టమవుతోంది. అలాగే, కేంద్రమంత్రి సదానంద గౌడతో రాజీనామా చేయించి, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సన్నిహితురాలైన శోభా కరంద్లాజేకు క్యాబినెట్‌లో చోటివ్వడం గమనార్హం.
అధికారంలోకి వచ్చాక బీజేపీ హవాకూ, మోదీ పాపులారిటీకీ తొలిసారిగా గత ఏణ్ణర్ధ కాలంలో బలమైన దెబ్బలు తగిలాయి. మార్పులు అనివార్యమని తేలింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కంభంపాటి హరిబాబు సహా కొత్త గవర్నర్లకు ఛాన్సిచ్చి, మంగళవారం మొదట కొన్ని మార్పులు చేశారు. బుధవారం కేంద్ర క్యాబినెట్‌లో సమూల మార్పులు తెచ్చారు. ఇక, పలు ఖాళీలతో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పార్టీ వ్యవస్థాగత మార్పులు చేయడమే బాకీ. సమైక్య ప్రతిపక్షం లేకపోయినప్పటికీ, సర్వసన్నద్ధమవుతున్నట్టు మోదీ బృందం ఒక రకంగా సంకేతాలిచ్చింది.
మిత్రపక్షాలకూ క్యాబినెట్‌లో చోటిచ్చిన బీజేపీ... కొత్త రక్తంతో పాలనలో, పనితీరులో మార్పు తెస్తామంటోంది. ప్రభుత్వ పాలనలో, పనితీరులో మార్పు మాటెలా ఉన్నా... ముందు చూడగానే ఏదో మారిందని భావనాత్మకంగా అనిపించడానికి ఈ మెగా మార్పులు ఉపకరిస్తాయి. రేపు నిజంగా ప్రభుత్వ పాలనలోనూ ఈ మార్పు కనిపిస్తే మంచిదే. ఆ దిశలో ఇది తొలి అడుగు అవునో, కాదో కొద్దికాలమైతే గానీ తెలియదు. ఇప్పటికైతే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ప్రతిపక్షాలతో యుద్ధానికి సిద్ధమవుతున్న మోదీ సర్కారు కొత్త యోధులతో సిద్ధమైనట్టు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment