టీపీసీసీ చీఫ్ రేసులో మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీ, అంజన్
అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, బలరాం నాయక్ కూడా..
మహేశ్ వైపే అధిష్టానం మొగ్గు చూపే చాన్స్.. 6లోగా ప్రకటన?
నేడు ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడి నియామక కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గత 20 రోజులుగా అధిష్టానం పరిశీలనలో ఉన్న కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం పలుమార్లు చర్చల అనంతరం తుది దశకు చేరుకుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలంటు న్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్ కుమార్‌గౌడ్, మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు అధిష్టానం తుది పరిశీలనలో ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, బలరాం నాయక్‌ల పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎస్సీ కోటాలో తమ జిల్లాకు చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కు అవకాశం ఇవ్వాలని మంత్రి డి.శ్రీధర్‌బాబు, సీనియర్ నేత జీవన్‌రెడ్డి అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. అన్ని ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం వారిలో ఒకరిని ఈ నెల ఆరో తేదీలోగా పీసీసీ చీఫ్‌గా ప్రకటిస్తారని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో మరోమారు అధిష్టానం చర్చించనుంది. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వారితో చర్చించాక టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే మహేశ్‌కుమార్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గుచూపే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.
మంత్రివర్గం రేసులో బాలూనాయక్, టి. రామ్మోహన్‌రెడ్డి
మంత్రివర్గ విస్తరణలో నల్లగొండ జిల్లాకు చెందిన లంబాడా సామాజికవర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఎన్. బాలూనాయక్‌కు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. గిరిజన వర్గాల నుంచి ఆదివాసీలకు ఇప్పటికే కేబినెట్‌లో స్థానం కల్పించినందున లంబాడా సామాజికవర్గానికి కూడా అనివార్యంగా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుందని, ఈ కోటాలో బాలూనాయక్ పేరు కూడా ఉందని తెలుస్తోంది. బాలూనాయక్‌కు మంత్రి పదవి లభిస్తే డిప్యూటీ స్పీకర్‌గా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అదే జిల్లాకు చెందిన పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి కూడా మంత్రివర్గంలో స్థానం కోసం ఢిల్లీలోనే ఉండి ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఎవరిని ఏ పదవికి ఎంపిక చేయాలనే విషయంపైనా బుధవారం నాటి చర్చల్లో స్పష్టత రానుంది.
పీసీసీ చీఫ్‌గా నా పేరు పరిశీలించండి
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి కోరిన మహేశ్‌కుమార్‌గౌడ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్‌గా తన పేరును పరిశీలించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఖర్గేను ఆయన కలిశారు. పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న నేతలు అధిష్టానం పెద్దలను కలుస్తూ తమ పేర్లను పరిశీలించాలని కోరుతున్నారు. అందులో భాగంగానే మహేశ్‌కుమార్‌గౌడ్ ఖర్గేను కలిసి తన పేరును పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీతోపాటు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కూడా కలవడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment