సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్‌కు తెరపడింది. కేబినెట్ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న కేబినెట్‌ను విస్తరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. శుక్రవారం మధ్యా హ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్‌ను కలసి ఈ మేరకు వివరించారు. 19న మాఘ శుద్ధ పౌర్ణమి కావడంతో ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖరారు కావడంతో సాధారణ పరిపాలనశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గతేడాది డిసెంబర్ 11న వెలువడగా అదే నెల 13న ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణం చేశారు. వారం రోజుల్లోనే మరో ఎనిమిది మంది వరకు మంత్రులను నియమిస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నా వివిధ కారణాలతో రెండు నెలలపాటు ఈ ప్రక్రియ వాయిదా పడింది.
ఎంత మందికి చాన్స్?
కొత్త జట్టులో ఎవరెవరు ఉండాలనే విషయంపై సీఎం కేసీఆర్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. మంత్రులతోపాటు డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్, విప్, పార్లమెంటరీ కార్యదర్శుల పదవుల పంపకంపైనా నిర్ణయానికి వచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశల్లోపే మంత్రులతోపాటు మిగిలిన పదవుల పంపకాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో మరో 16 మందిని చేర్చుకునే అవకాశం ఉంది. మంత్రులుగా ఎవరెవరికి అవకాశం దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. పాత, కొత్త కలయికగా మంత్రివర్గం ఉంటుందని తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, ఉమ్మడి జిల్లాలను ప్రాదిపదికగా చేసుకొని మంత్రివర్గ కూర్పు ఉండనుంది.
ఎర్రబెల్లి, రెడ్యానాయక్‌కు బెర్త్‌లు ఖాయం!
గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన తుమ్మల నాగేశ్వరరావు (కమ్మ), జూపల్లి కృష్ణారావు (వెలమ), అజ్మీరా చందూలాల్(ఎస్టీ–లంబాడా), పట్నం మహేందర్‌రెడ్డి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. జూపల్లి స్థానంలో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, చందూలాల్ స్థానంలో డి.ఎస్. రెడ్యానాయక్‌కు మంత్రివర్గంలో చోటు ఖాయమైనట్లు తెలుస్తోంది. పట్నం మహేందర్‌రెడ్డి స్థానంలో రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్ ఎవరికి అవకాశం కల్పిస్తారనేది అంతుచిక్కడంలేదు. తుమ్మల నాగేశ్వర్‌రావుకు బదులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రివర్గంలో చోటు కల్పించే విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ ఒకే స్థానాన్ని గెలుచుకుంది. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న మొత్తం 16 స్థానాలను భర్తీ చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించే పరిస్థితి లేదు. టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పదవిపై కేసీఆర్ ఇప్పుడే నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఖమ్మం ఉమ్మడి జిల్లాకు ఇప్పుడే ప్రాతినిధ్యం కల్పించాలని భావిస్తే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఈ జిల్లా తరఫున చోటు కల్పించే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. దీంతో ఈసారి మహిళకు చోటు దక్కుతుందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌లో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు, ఒక మహిళా ఎమ్మెల్సీ ఉన్నారు. వీరంతా మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్), గొంగిడి సునీత (ఆలేరు), ఆజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్)తోపాటు ఎమ్మెల్సీ ఆకుల లలితల్లో కచ్చితంగా ఒకరికి మంత్రిగా అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
భారీగా ఆశావహులు...
మంత్రి పదవిని ఆశించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్నికల్లో స్వతంత్రులుగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరితో కలిపి గులాబీ దళానికి ప్రస్తుతం 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో దాదాపు సగం మంది మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీలు సైతం మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీలుగా ఉన్న మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, కడియం శ్రీహరి గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేశారు. మంత్రివర్గంలో శాసనమండలికి ఈసారి కూడా ఇదే రకంగా ప్రాతినిధ్యం ఉంటుందని ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. అయితే వారిలో ఎవరిని సీఎం కేసీఆర్ కేబినెట్‌లోకి ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తుది జట్టులో తమ పేరు ఉంటుందా లేదా అని సీనియర్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. సీఎం కేసీఆర్ నుంచి పిలుపు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
సామాజికవర్గాల వారీగా మంత్రి పదవుల ఆశావహులు...
ఎస్సీ: కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్, అరూరి రమేశ్, రసమయి బాలకిషన్
ఎస్టీ: డి.ఎస్. రెడ్యానాయక్, అజ్మీరా రేఖానాయక్, డి. రవీంద్రనాయక్
బీసీ: తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, టి. పద్మారావుగౌడ్, జోగు రామన్న, బాజిరెడ్డి గోవర్ధన్, గంగుల కమలాకర్, దానం నాగేందర్, ఆకుల లలిత, వి. శ్రీనివాస్‌గౌడ్, కె.పి. వివేకానందగౌడ్
కమ్మ: కోనేరు కోనప్ప, పువ్వాడ అజయ్ కుమార్, అరికెపూడి గాంధీ
వెలమ: తన్నీరు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కె.తారక రామారావు
రెడ్డి: వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జి. జగదీశ్‌రెడ్డి, సి. లక్ష్మారెడ్డి, సొలిపేట రామలింగారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గొంగిడి సునీత, పట్నం నరేందర్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి
19న విస్తరణ
Published Sat, Feb 16 2019 1:51 AM | Last Updated on Sat, Feb 16 2019 5:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment