వారంలో విస్తరణ! ఢిల్లీలో ముమ్మర కసరత్తు | Congress High Command Focus On Expansion of Telangana State Cabinet | Sakshi
Sakshi News home page

వారంలో విస్తరణ! ఢిల్లీలో ముమ్మర కసరత్తు

Published Thu, Jun 27 2024 3:40 AM | Last Updated on Thu, Jun 27 2024 3:40 AM

గడ్కరీకి పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో వంశీ, భట్టి, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, వివేక్‌

గడ్కరీకి పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో వంశీ, భట్టి, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, వివేక్‌

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు

ఖాళీగా ఉన్న ఆరు స్థానాల భర్తీపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ దృష్టి

మూడ్రోజులుగా హస్తినలోనే ముఖ్యమంత్రి రేవంత్‌ 

ఖర్గే, రాహుల్‌ గాంధీ,వేణుగోపాల్‌తో వరుస భేటీలు 

భట్టి, ఉత్తమ్,శ్రీధర్‌బాబుతో పాటు ఆశావహులు కూడా ఇక్కడే 

రేసులో రాజగోపాల్‌రెడ్డి,వివేక్, సుదర్శన్‌రెడ్డి, మల్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్,బల్మూరి, వాకాటి 

జూలై 1 లేదా 2న విస్తరణ ఉండొచ్చంటున్న ఏఐసీసీ వర్గాలు

బలరాం నాయక్, మహేశ్‌గౌడ్,షెట్కార్‌లలో ఒకరికి పీసీసీ పగ్గాలు! 

రైతు కమిషన్‌ చైర్మన్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి!

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేయడంపై నేతలు దృష్టి సారించారు. గడిచిన మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి ఈ అంశంతో పాటు, పీసీసీ అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. బుధవారం కూడా ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు. 

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీలతో జరిపిన భేటీల్లో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించడంతో పాటు, కొన్ని పేర్లపై సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆయా పేర్లపై రాష్ట్ర సీనియర్‌ మంత్రుల అభిప్రాయాలను నేతలు తీసుకున్నట్లు తెలిసింది. అన్నీ కుదిరితే వారంలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  

మూడు కోణాల్లో పరిశీలన: రాష్ట్ర కేబినెట్‌లో ప్రస్తుతం 12 మంది మంత్రులు ఉండగా, మరో 6 స్థానాలు భర్తీ చేసేందుకు అవకాశం ఉంది. ఈ ఆరు స్థానాలకు ప్రస్తుతం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి లాంటి వారు రేసులో ఉన్నారు. 

అయితే ఇప్పటివరకు అసలు  ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నా, ఇటీవలే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచి్చన సీనియర్‌ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేరు సైతం తాజాగా తెరపైకి వచి్చనట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు రైతు కమిషన్‌ చైర్మన్‌ పోస్టు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.  

సీఎంతో రాష్ట్ర నేతల సమావేశాలు 
సుదర్శన్‌రెడ్డికి సీనియర్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్కలు మద్దతిస్తున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలు ఇద్దరూ గడిచిన మూడ్రోజులుగా ఢిల్లీలోనే ఉండి బలంగా లాబీయింగ్‌ చేస్తున్నారు. బుధవారం ఈ ఇద్దరు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. బీసీ సామాజిక వర్గం నుంచి మహేశ్‌గౌడ్, వాకాటి శ్రీహరి పేర్లు పరిశీలనలో ఉండగా, ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరికి మంత్రి పదవి దాదాపు ఖరారైందని అంటున్నారు. 

వీరిద్దరు కూడా మూడ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. శ్రీహరి సైతం బుధవారం ముఖ్యమంత్రిని కలిసి తన పేరు పరిశీలనకు విన్నవించినట్లు తెలిసింది. వెలమ సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌ రావు, మదన్‌మోహన్‌తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ల మధ్య పోటీ నెలకొన్నట్లు సమాచారం. అయితే ఈ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే జూపల్లి  కృష్ణారావు ఉన్నందున మరొకరికి అవకాశం ఇస్తారా? లేదా? అన్న దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. 

ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించినట్లు తెలిసింది. ఇక ఎస్సీ కోటాలో జి.వివేక్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రాతినిథ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాలతో పాటు ఇటీవలి పార్లమెంట్‌ ఎన్నికల్లో వారి పనితీరు ఆధారంగా మంత్రి పదవులు భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.  

నేతలు బిజీబిజీ 
మంత్రివర్గ విస్తరణపై రెండ్రోజుల కిందటే మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాం«దీ, కేసీ వేణుగోపాల్‌తో చర్చలు జరిపిన సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మరోమారు వారితో సమావేశమయ్యారు. విస్తరణ విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరోపక్క పదవుల పంపకంపై చర్చించేందుకు ఢిల్లీకి వచి్చన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌బాబులు ముందు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీప్‌దాస్‌ మున్షీతో భేటీ అయ్యారు. కాగా కేబినెట్‌ విస్తరణపై హైకమాండ్‌ పెద్దలు  రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, జూలై 1 లేదా 2న విస్తరణ జరగవచ్చని తెలిసింది.   

పీసీసీ రేసులో ముగ్గురు 
పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా మూడు పేర్లపై హైకమాండ్‌ పెద్దల వద్ద  చర్చలు జరిగినట్లు తెలిసింది. ఎంపీలు బలరాం నాయక్, సురేశ్‌ షెట్కార్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఈ పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పీసీసీ పదవిని ఎస్టీకి ఇవ్వనందున బలరాం పేరును ముఖ్యమంత్రి ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే ఆయన పేరును కొందరు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దీంతో మహేశ్‌గౌడ్‌కు రేవంత్, ఇతర సీనియర్లు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. మహేశ్‌గౌడ్‌ కూడా హైకమాండ్‌ పెద్దలతో తనకున్న పరిచయాలను ఆధారంగా చేసుకుని లాబీయింగ్‌ చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement