సాక్షి, ముంబై : ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన నెల అనంతరం మహారాష్ట్రలో పూర్తిస్థాయి ప్రభుత్వం కొలువుదీరింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని కేబినెట్‌లో కొత్తగా 36 మంది మంత్రులకు చోటుదక్కింది. ఆ రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ సోమవారం వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. అందరూ ఊహించినట్టుగానే ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి కేంద్రబిందువైన అజిత్.. రెండు నెలల్లో రెండోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం గమనార్హం. గతంలో దేవేంద్ర ఫడ్నవిస్‌తో చేతులు కలిపి ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఎన్సీపీ నేతల పిలుపు మేరకు రాజీనామా చేసి సొంత గూటికి చేరుకున్నారు. అలాగే ఊహాగానాలను నిజం చేస్తూ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిత్య ఠాక్రే సైతంగా తండ్రి ప్రభుత్వంలో చోటు దక్కించున్నారు. దీంతో ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీచేసి మంత్రిగా ఎన్నికైన వ్యక్తిగా ఆదిత్య నిలిచారు. కాంగ్రెస్ నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ మంత్రిగా ప్రమాణం చేశారు. త్వరలోనే వీరికి శాఖలు అప్పగించనున్నారు.
ముఖ్యమంత్రి నుంచి మంత్రిగా..
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన అశోక్ చవాన్.. గతంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తాజాగా మంత్రిగా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా 2008 డిసెంబర్ 8 నుంచి 2010 నవంబర్ 9 వరకు ఆయన పదవిలో ఉన్నారు. అయితే ఆదర్శ కుంభకోణం వ్యవహారంలో ఆయన పేరు స్పష్టంగా వినిపించడంతో పార్టీ ఆధిష్టానం ఒత్తిడి మేరకు సీఎం పదవికి రాజీనామా చేశారు. తరువాతి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమిని చవిచూసింది. దీంతో 2014 లోక్‌సభ ఎన్నికల్లో నాందేడ్ స్థానం నుంచి గెలుపొందారు. 2015లో పార్టీ రాష్ట్ర చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పీసీసీ పదవికి రాజీనామా చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన కూడా ఓటమి చెందారు. తాజాగా ఉద్ధవ్ ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కించున్నారు.
మంత్రిగా ప్రమాణం చేసిన మాజీ సీఎం
Published Mon, Dec 30 2019 2:06 PM | Last Updated on Mon, Dec 30 2019 2:22 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment