సాక్షి, ముంబై: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇటీవల ముగియడంతో ఇక అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపై పడింది. మంత్రి పదవి దక్కనివారు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందోనని కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు ముగియగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో తమకు మంత్రి వర్గంలో చోటు లభిస్తుందా..లేదా.. ఒకవేళ చోటు లభిస్తే ఏ శాఖ తమకు లభిస్తుందని మహావికాస్ ఆఘాడి ఎమ్మెల్యేలు ఇప్పటినుంచే బేరీజు వేసుకుంటున్నారు.
ఇదిలాఉండగా అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్నుకునేందుకు గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ నుంచి ఇప్పటికీ అనుమతి లభించలేదు. ఫలితంగా బడ్జెట్ సమావేశాలు స్పీకర్ లేకుండానే కొనసాగాయి. దీంతో కనీసం మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసుకోవాలని మహా వికాస్ ఆఘాడి మంత్రులందరు భావిస్తున్నారు. అందుకు ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మంత్రులు చొరవ తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఇరుపార్టీల మంత్రులు ఈ నెల ఏడు లేదా ఎనిమిదో తేదీన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు.
రెండేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు...
ఓ యువతి ఆత్మహత్య కేసులో సంజయ్ రాఠోడ్ అటవీ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ శాఖ ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే వద్ద ఉంది. అదేవిధంగా వంద కోట్ల అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అనిల్ దేశ్‌ముఖ్ హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం దేశ్‌ముఖ్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఖాళీగా ఉన్న హోం శాఖ పదవీ బాధ్యతలు దిలీప్ వల్సే పాటిల్ చూసుకుంటున్నారు. మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 50 శాతం కాలవ్యవధి పూర్తయింది. దీంతో మంత్రి వర్గ విస్తరణ అంశం జోరందుకుంది. ఇదిలాఉండగా మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు నానా పటోలే 2021 ఫిబ్రవరిలో అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి స్పీకర్ పదవి ఖాళీగానే ఉంది.
చదవండి: (పెరిగిన ఇళ్ల విక్రయాలు.. రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు)
అయితే తాత్కాలికంగా ఈ పదవి బాధ్యతలు ఉపాధ్యక్షుడు నరహరీ జిరవల్ వద్ద ఉన్నాయి. జిరవల్ ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే. విధాన్ పరిషత్ స్పీకర్ రామ్‌రాజే నింబాల్కర్ నాయిక్ సభ్యత్వం 2022 జూలైలో పూర్తికానుంది. దీంతో విధాన్‌సభ, విధాన్ పరిషత్‌లో కీలకమైన స్పీకర్ పదవులు పరస్పరంగా మార్చుకునే అవకాశాలున్నాయి. దీనిపై కూడా మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఆలోచిస్తోంది. అసెంబ్లీలో స్పీకర్ పదవికి రాజీనామా చేసిన నాటి నుంచి నానా పటోలేకు మంత్రి పదవిపై ఆసక్తి పెరిగిపోయింది. ప్రస్తుతం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కోటాలోని మంత్రి పదవులు ఖాళీగా లేవు. దీంతో తమ వాటాలోని మంత్రుల పదవుల్లో మార్పులు జరిగితే తప్ప తమకు అవకాశం లభించదని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
ఇప్పటికే నిధుల పంపిణీ విషయంలో తమను చిన్నచూపు చూస్తున్నారని, ఫలితంగా తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని అసంతృప్తికి గురైన 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత్రి సోనియా గాం«ధీకి నేరుగా లేఖ రాశారు. ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేశారు. దీంతో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్ధానం కల్పించి వారిని సంతోషపెట్టే ప్రయత్నం జరుగుతోంది. అందుకు గురువారం లేదా శుక్రవారం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కావాలని భావిస్తున్నారు. ఈ భేటీలో ఏఏ అంశాలపై చర్చిస్తారు? మంత్రివర్గ విస్తరణపై ఏం నిర్ణయం తీసుకుంటారనేదానిపై అందరూ దృష్టి సారించారు.
Comments
Please login to add a commentAdd a comment