వికటించిన సెక్యులర్ ప్రయోగం
కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్ పవార్)తో పొత్తు పెట్టుకోవడంతో నష్టం
ముంబై: హిందుత్వ ఫైర్‌బ్రాండ్ బాల్ ఠాక్రే కుమారుడైన ఉద్ధవ్ ఠాక్రే అదే హిందుత్వకు దూరమై, అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. మహారాష్ట్రలో సరిగ్గా ఐదేళ్ల క్రితం బీజేపీతో జట్టుకట్టి, ముఖ్యమంత్రి కూడా అయిన ఉద్ధవ్ ఇప్పుడు మళ్లీ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారు.
మహా వికాసఅఘాడీ పేరిట చేసిన సెక్యులర్ ప్రయోగం ప్రయోజనం చేకూర్చలేదు. శివసేన సిద్ధాంతానికి సరిపడని కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్ పవార్)తో కలిసి కూటమి కట్టడం ఉద్ధవ్‌కు నష్టం చేకూర్చింది. కూటమి పొత్తులో భాగంగా 95 సీట్లలో పోటీకి దిగిన శివసేన(ఉద్ధవ్) 20 సీట్లు మాత్రమే సాధించగలిగింది. ఉద్ధవ్ రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
సమాధానం చెప్పాల్సిందే
శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ బాల్ ఠాక్రే వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఉద్ధవ్ తొలుత సొంత పార్టీ నేతల నుంచే తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నారు. సీనియర్ నేత నారాయణ రాణేతోపాటు వరుసకు సోదరుడయ్యే రాజ్ ఠాక్రే నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ తండ్రి అండతో నిలదొక్కుకున్నారు. బీజేపీతో దశబ్దాలుగా కొనసాగుతున్న పొత్తు శివసేనకు లాభించింది. 2019 ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి నెగ్గింది.
ఉద్ధవ్‌ను ముఖ్యమంత్రి పదవి వరించింది. కోవిడ్–19 మహమ్మారి ఉధృతి సమయంలో ఉద్ధవ్ అందించిన సేవలు ప్రశంసలందుకున్నాయి. సీఎం అయిన కొన్నాళ్లకే ఉద్ధవ్‌పై సొంత పారీ్టలో అసంతృప్తి బయలుదేరింది. శివసేనలో ఒక వర్గం నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 2022 జూన్‌లో శివసేనను ఏక్‌నాథ్ షిండే చీల్చేశారు. ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోయింది. మరోదారి లేక ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్ పవార్)తో పొత్తు పెట్టుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పొత్తు పనిచేయలేదు. అసలైన శివసేన తమదేనని ఏక్‌నాథ్ షిండే శనివారం ఫలితాల తర్వాత ప్రకటించారు. ఉద్ధవ్‌ఠాక్రే వయసు64 ఏళ్లు. పారీ్టలో అరకొరగా మిగిలిన నేతలను, కార్యకర్తలను ఆయన ముందుకు నడిపించగలరా? పార్టీని సజీవంగా ఉంచగలరా? అనేదానిపై చర్చ మొదలైంది. శివసేన పార్టీ, ఆ పార్టీ గుర్తు ఇప్పటికే ఏక్‌నాథ్ షిండే వర్గానికి దక్కాయి. వాటిని తిరిగి సాధించుకోవడం అనుకున్నంత సులభం కాదు.
Comments
Please login to add a commentAdd a comment