లౌకిక ప్రజాస్వామ్యం నిర్మించాలి: వరవరరావు
హైదరాబాద్, న్యూస్‌లైన్: హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్మించాలని దేశ ప్రజలకు విరసం(విప్లవ రచయితల సంఘం) సభ్యుడు వరవరరావు పిలుపునిచ్చారు. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ హైదరాబాద్ రాకను నిరసిస్తూ ‘హిందూ ఫాసిస్టు వ్యతిరేక కలాల, గళాల, కవి, గాయక సమయం’ కార్యక్రమాన్ని స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వరవరరావు మాట్లాడుతూ.. హిందూ మతోన్మాదంతో దేశానికి అభివృద్ధి కంటే ప్రమాదమే ఎక్కువని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ అధికార దాహంతో ప్రధాని పదవి కోసం అర్రులు చాస్తున్నారని విమర్శించారు.
మార్కెట్ ప్రేరేపిత విధ్వంసకర అభివృద్ధి నమూనాతో ముందుకు వస్తున్న మోడీని దేశ ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. తెలంగాణలో ముస్లింలు సవాలుగా మారారని భావించిన ఆర్ఎస్ఎస్, బీజేపీలు మోడీని రప్పించాయని ఆరోపించారు. విరసం రూపొందిం చిన ‘ఖబడ్దార్, గుజరాత్ గాయం-2’ ఫోల్డర్‌ను ప్రముఖ కవి దేవీ ప్రియ ఆవిష్కరించారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైన మోడీని ఆహ్వానించడాన్ని నిర్మొహమాటంగా వ్యతిరేకించాలని దేవీప్రియ అన్నారు. కార్యక్రమంలో అరుణోదయ విమలక్క, వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్, విర సం సభ్యులు గీతాంజలి, కృష్ణబాయి, ప్రజా కళామండలి నాయకులు కోటి, ఇంద్రవెల్లి రమేష్, రవిచంద్ర, వివేర, తెలంగాణ విద్యావంతుల వేదిక నేతలు శ్రీధర్ దేశ్‌పాండే, పిల్లలమర్రి రాములు, జంధ్యాల సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.