సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపే కేబినెట్ విస్తరణ ఉండవచ్చని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉండటంతో.. ఎవరెవరికి అవకాశం వస్తుందన్న దానిపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. కొత్తగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి, అగ్రవర్ణాలకు చెందిన ఇద్దరు నేతలకు అమాత్యయోగం దక్కుతుందన్న చర్చ జరుగుతోంది. అయితే అందుబాటులో ఉన్న ఆరు పదవులను ఒకేసారి భర్తీ చేస్తారా? పలు సమీకరణాల నేపథ్యంలో ఒకట్రెండు బెర్తులు ఖాళీగా ఉంచుతారా? అన్నదానిపై స్పష్టత రావడం లేదు. వచ్చే 15 రోజుల్లోనే కేబినెట్ విస్తరణ జరిగినా ఆశ్చర్యం లేదని టీపీసీసీ నేతలు చెప్తున్నారు.
ఏ కోటాలో ఎవరికి?
రాష్ట్ర కేబినెట్‌లో సీఎం సహా మొత్తం 18 మంది అవకాశం ఉంది. ఇప్పటికే 12 మందితో రేవంత్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇందులో ఎస్టీలకు ఒకటి, బీసీలు, ఎస్సీలకు రెండు చొప్పున ఇవ్వగా, ఏడు పదవులను అగ్రవర్ణాలకు కేటాయించారు. ఇందులో రెడ్డి సామాజికవర్గానికి నాలుగు.. వెలమ, కమ్మ, బ్రాహ్మణ వర్గాలకు ఒక్కోటి ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా విస్తరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి, ఎస్టీ కోటాలో దేవరకొండ నుంచి బాలూనాయక్‌లకు.. బీసీ కోటాలో మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కుగానీ, ఎంబీసీ కోటాలో ఈర్లపల్లి శంకర్ (షాద్‌నగర్)కుగానీ అవకాశం రావొచ్చని అంటున్నారు. అగ్రవర్ణాలకు సంబంధించి.. రెడ్డి సామాజికవర్గం నుంచి పి.సుదర్శన్‌రెడ్డి (బోధన్), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం)ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో మల్‌రెడ్డికి అసెంబ్లీలో చీఫ్‌విప్ హోదా ఇవ్వొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక వెలమ సామాజికవర్గ కోటాలో కె.ప్రేమ్‌సాగర్‌రావు (మంచిర్యాల), మదన్‌మోహన్‌రావు (ఎల్లారెడ్డి) పేర్లు వినిపిస్తున్నాయి.
మరికొందరు నేతలూ రేసులో..
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కాబోతున్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు కూడా మంత్రి పదవి రేసులో వినిపిస్తోంది. ఆయనకు శాసనమండలిలో విప్ హోదా ఇస్తారని కూడా అంటున్నారు. అయితే వెంకట్‌కు మంచి హోదా కలి్పంచాలని స్వయంగా రాహుల్‌గాంధీ చెప్పారని.. ఈ నేపథ్యంలో ఆయనకు కేబినెట్ అవకాశం దక్కవచ్చని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తమ్మీద 15 రోజుల్లోనే, లేదా బడ్జెట్ సమావేశాల్లోపు కేబినెట్ విస్తరణ ఉంటుందని అంటున్నాయి. మంత్రి పదవుల కోసం సామాజిక వర్గాల వారీగా మరికొందరు నేతలు, మహిళా ఎమ్మెల్యేలు కూడా పోటీలో ఉన్నారని పేర్కొంటున్నాయి.
మైనార్టీ కోటాలో ఎవరికి?
కేబినెట్‌లో మైనార్టీ కోటా కింద ఎవరిని, ఎలా ఎంపిక చేస్తారన్న దానిపై స్పష్టత రావడం లేదు. ఈసారి విస్తరణలో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులు భర్తీ చేస్తారా, నాలుగైదు మాత్రమే నింపుతారా అన్నది మైనార్టీ కోటాను బట్టే ఉంటుందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ తరఫున మైనార్టీ నేతలెవరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికకాకపోవడంతో.. వారికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తేనే మంత్రి పదవి లభించనుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా బీసీ, ఓసీ వర్గాలకు చెందిన ఇద్దరిని కాంగ్రెస్ ఎంపిక చేసింది. నల్లగొండ గ్రాడ్యుయేట్స్, పాలమూరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మైనార్టీలు పోటీచేసే అవకాశం లేదన్న అంచనాలు ఉన్నాయి.
ఈ క్రమంలో గవర్నర్ కోటాలో మైనార్టీ నేతను శాసనమండలికి పంపి మంత్రి పదవి కేటాయించాల్సి ఉంటుంది. ఈ విషయంలో అటు అధిష్టానం, ఇటు సీఎం రేవంత్‌ల మదిలో ఏముందనే దానిపై స్పష్టత లేదు. మైనార్టీ కోటాలో మంత్రిపదవి రేసులో.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్‌ఖాన్‌ల పేర్లు ఉన్నాయి. ఆమేర్ అలీఖాన్, జాఫర్ జావేద్‌ల పేర్లు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితాలో ఉండటం గమనార్హం.
త్వరలోనే నామినేటెడ్ పదవులు కూడా..
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పంపకాలను చేపట్టేందుకూ కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. విదేశ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 22న ఉదయం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. తర్వాత రెండు, మూడు రోజుల్లో నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉంటుందని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఆర్టీసీ, టీఎస్‌ఐఐసీ, రైతు సమన్వయసమితి, మహిళా కమిషన్‌తోపాటు పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటించే అవకాశం ఉందని వివరిస్తున్నాయి.
‘బడ్జెట్’ లోపే కేబినెట్ విస్తరణ!
Published Sun, Jan 21 2024 4:21 AM | Last Updated on Sun, Jan 21 2024 4:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment