ఢిల్లీలో పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష సభ్యులు ఎందరున్నారన్నది ముఖ్యం కాదని, వారిచ్చే ప్రతి సూచనా ప్రభుత్వానికి విలువైందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ హితమే లక్ష్యంగా నిష్పాక్షికంగా మెలగాలని ఆయన అన్ని పార్టీల ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ సోమవారం లోక్‌సభ సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘చురుకైన ప్రతిపక్షం పాత్ర పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైంది.
విపక్షం తమ సంఖ్య గురించి ఆలోచించ కుండా సభా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని, మాట్లాడతారని ఆశిస్తున్నా. వారి ప్రతి మాట, స్పందనా ప్రభుత్వానికి విలువైందే’ అని పేర్కొన్నారు. ‘సభ్యులంతా పార్లమెంట్‌లో స్వపక్షం, విపక్షం అన్న వ్యత్యాసాన్ని పక్కనబెట్టాలి. దేశ సంక్షేమమే పరమావధిగా నిష్పక్షపాతంగా ఆలోచించి, వ్యవహరించాలి’ అని అన్నారు. ఈ సమావేశాలు ఫలవంతంగా సాగాలని ఆకాంక్షించారు. కొత్త లోక్‌సభకు పలు విశిష్టతలున్నాయంటూ ఆయన.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యధిక సంఖ్యలో మహిళా ఎంపీలు ఎన్నికైంది 17వ లోక్‌సభకేనన్నారు.
సభ్యుల ప్రమాణ స్వీకారం
17వ లోక్‌సభ సమావేశాల మొదటి రోజు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సభ ప్రారంభం కాగానే సంప్రదాయం ప్రకారం మొదటగా సభ్యులంతా లేచి కొన్ని నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ ప్రధాని మోదీని పిలవగానే ఎన్‌డీయే సభ్యులంతా బల్లలు చరుస్తూ ‘మోదీ, మోదీ, భారత్ మాతా కీ జై’ అంటూ కొద్దిసేపు నినాదాలు చేశారు. ఆ తర్వాత ప్రిసైడింగ్ అధికారులుగా కె.సురేశ్, బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్, భర్తృహరి మెహ్తాబ్ ప్రమాణ స్వీకారం చేశారు.
హిందీ నుంచి తెలుగు దాకా..
సభ్యుల ప్రమాణ స్వీకారం సమయంలో లోక్‌సభలో భిన్న భాషలు వినిపించాయి. ప్రధాని మోదీ సహా మంత్రులు హిందీలో ప్రమాణం చేయగా, హర్షవర్ధన్, శ్రీపాద్ నాయక్, అశ్వినీ చౌబే, ప్రతాప్ చంద్ర సారంగి సంస్కృతంలో ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రులు అర్వింద్ గన్‌పత్ సావంత్, రావ్‌సాహెబ్ పాటిల్ మరాఠీ, జితేంద్ర సింగ్ డోగ్రి, బాబుల్ సుప్రియో ఇంగ్లిష్, రాజేశ్వర్ తేలి అస్సామీ, దేబశ్రీ చౌధురి బెంగాలీ భాషల్లో ప్రమాణం చేశారు. అలాగే, కేరళలోని వయనాడ్ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇంగ్లిష్‌లో, దేవెగౌడ కన్నడ, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ పంజాబీ, బీజేడీ ఎంపీ భర్తృహరి మెహ్తాబ్ ఒడియా, గోపాల్ ఠాకూర్, అశోక్ కుమార్ యాదవ్ మధుబనిలో, ఇండోర్ ఎంపీ శంకర్ లల్వానీ సింథీలో ప్రమాణం చేశారు. అలాగే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీల్లో ఎక్కువ మంది తెలుగులో ప్రమాణం చేశారు.
ప్రజ్ఞ పేరుతో వివాదం
బీజేపీ తరఫున ఎన్నికైన సాధ్వి ప్రజ్ఞాసింగ్ తన పేరుకు ముందు ఆధ్యాత్మిక గురువుగా సంబోధించుకుంటూ ప్రమాణం చేయడంతో ప్రతిపక్షం నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. బీజేపీ సభ్యులు ఆమెకు మద్దతు పలికారు. ఆందోళనలు, కేకల మధ్య ఆమె..అదే తన అసలు పేరని, ప్రమాణ స్వీకార పత్రంలో ఆ పేరే పేర్కొన్నట్లు తెలిపారు. సాధ్వి ప్రజ్ఞాసింగ్‌కు ముందుగా స్వామి పూర్ణ చేతనానంద్ అవ్‌దేశానంద్ గిరి అంటూ జత చేశారు. దీనిపై ప్రొటెం స్పీకర్ స్పందిస్తూ..ఎన్నికల రిటర్నింగ్ అధికారి జారీ చేసిన పత్రాల ప్రకారమే ఆమె పేరు ఉంటుందని స్పష్టం చేశారు. సంస్కృతంలో ప్రమాణం చేసిన ప్రజ్ఞాసింగ్ చివరగా భారత్ మాతాజీ జై అని నినదించారు. దీంతో బీజేపీ సభ్యులు అదే నినాదం చేస్తూ, కాంగ్రెస్ సభ్యులను ఎద్దేవా చేశారు.
పాల్గొన్న ప్రముఖ నేతలు
లోక్‌సభ సమావేశాల మొదటి రోజు పాల్గొన్న ప్రముఖుల్లో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ్, సమాజ్ వాదీ పార్టీ నేతలు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేశ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే నేతలు కనిమొళి, ఎ.రాజా తదితరులున్నారు. సభ ప్రారంభంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కనిపించలేదు. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ ఎంపీ వీరేంద్ర కుమార్‌తో ప్రొటెం స్పీకర్‌గా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు.
పార్లమెంట్‌ను రబ్బర్ స్టాంపుగా మార్చరని ఆశిస్తున్నాం: కాంగ్రెస్
పార్లమెంట్‌ను రబ్బర్ స్టాంపుగా మార్చిన గత మోదీ ప్రభుత్వం.. భారీ మెజారిటీ సాధించిన నేపథ్యంలో మళ్లీ అదే వైఖరి అవలంబిస్తుందని అనుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ప్రతిపక్షం సంఖ్యాబలంలేదని ఆందోళన చెందవద్దని, వారి ప్రతిమాటా ప్రభుత్వానికి విలువైందేనంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ‘ఆర్డినెన్స్‌ల ద్వారా పాలన చేయాలనుకోవడం ప్రజాస్వామ్యంలో అనారోగ్యకర విధానం. ఆర్డినెన్స్ అవకాశాన్ని అత్యవసర సందర్భాల్లో మాత్రమే అరుదుగా వాడాల్సి ఉంది. మిగతా సమయాల్లో చట్టాల తయారీ, అమలులో నిర్దేశించిన విధానాలను ప్రభుత్వం అనుసరించాలి’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ తెలిపారు.
సంతకం మరిచారు
లోక్‌సభ సభ్యుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రమాణ స్వీకారం సమయంలో కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ ఆనవాయితీ ప్రకారం అక్కడి ఫైల్‌లో సంతకం చేయడం మర్చిపోయారు. రాజ్‌నాథ్‌తోపాటు పలువురు సిబ్బంది సంతకం చేయాలంటూ గుర్తు చేశారు. రాహుల్ పేరును లోక్‌సభ సెక్రటరీ జనరల్ పిలవగానే ఆయన తల్లి, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ సహా కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరిచారు. ప్రధాని మోదీ, ఇతర సభ్యులు ప్రమాణం చేసే సమయంలో రాహుల్ సభలో లేరు.
మరికొన్ని విశేషాలు
► బిహార్‌కు చెందిన బీజేపీ సభ్యుడు జనార్దన్ సింగ్ సిగ్రివాల్ భోజ్‌పురిలో ప్రమాణం చేస్తానని తెలపగా లోక్‌సభ సెక్రటరీ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో 8వ షెడ్యూల్‌లో ఆ భాష లేనందున వీలుకాదని పేర్కొన్నారు.
► అరుణాచల్ ఎంపీ తపిర్ గావో ప్రమాణం చేసే సమయంలో బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా బల్ల చరుస్తూ, హర్షం వ్యక్తం చేశారు.
► ప్రమాణ స్వీకారం సమయంలో లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ పొరపాటున పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరును పిలిచారు. ఆయన రాజ్యసభ సభ్యుడన్న విషయం తెలిసి పొరపాటును సరిదిద్దుకున్నారు.
► బీజేపీ సభ్యులు కొందరు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేయడంపై సభలో అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో ప్రొటెం స్పీకర్ నిర్దేశిత ఫార్మాట్ మేరకే ప్రమాణం చేయాలని సభ్యులను కోరారు.
సంప్రదాయం ఉట్టిపడేలా..
లోక్‌సభ సమావేశాల సందర్భంగా మొదటి రోజైన సోమవారం పలువురు సభ్యులు కాషాయ దుస్తులతోపాటు సంప్రదాయం ప్రతిబింబించే శాలువాలు, తలపాగాలు ధరించి వచ్చారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తమ ట్రేడ్‌మార్క్ కుర్తా, పైజమా, జాకెట్‌తో సభలోకి అడుగుపెట్టగా మంత్రులు ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్, జీకే రెడ్డి కాషాయ రంగు దుస్తులతో వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చిత్రాలతో కూడిన కండువాలు వేసుకున్నారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజస్తానీ సంప్రదాయ కాషాయ, ఆకు పచ్చ రంగుల తలపాగాతో వచ్చారు. బిహార్ ఎంపీలు గోపాల్ జీ ఠాకర్, అశోక్ కుమార్ యాదవ్ మైథిలీ సంప్రదాయం ప్రతిబింబించే తలపాగాను అస్సాం ఎంపీలు ఆ రాష్ట్ర సంప్రదాయం ప్రకారం ‘గమోచా’ ధరించారు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ తనదైన శైలిలో కాషాయ వస్త్రాలు ధరించగా తపిర్ గావో సంప్రదాయ అరుణాచల్ జాకెట్ వేసుకున్నారు.
స్మృతీ ఇరానీకి..
కేంద్ర మంత్రి, అమేథీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ను ఓడించిన స్మృతి ఇరానీకి లోక్‌సభలో బీజేపీ ప్రత్యేక ట్రీట్ ఇచ్చింది. ఆమె ప్రమాణ స్వీకారం చేసేందుకు వస్తుండగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా మంత్రులు, బీజేపీ ఎంపీలు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. వారి హర్షధ్వానాలు చాలా సేపు సాగాయి. హిందీలో ప్రమాణం చేసిన స్మృతి అనంతరం ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీలకు నమస్కారం చేశారు. ఆ సమయంలో రాహుల్ సభలో లేరు.
సభా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రొటెమ్ స్పీకర్ వీరేంద్ర
పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీలు నవనీత్ కౌర్ రాణా, సుమలత అంబరీష్
Comments
Please login to add a commentAdd a comment