తుపాకీ నీడలో బాధ్యతలు చేపట్టనున్న బైడెన్‌! | Joe Biden And Kamala Harris Oath Ceremony Is Today | Sakshi
Sakshi News home page

తుపాకీ నీడలో బాధ్యతలు చేపట్టనున్న బైడెన్‌!

Published Wed, Jan 20 2021 5:21 AM | Last Updated on Wed, Jan 20 2021 11:04 AM

Joe Biden And Kamala Harris Oath Ceremony Is Today - Sakshi

వాషింగ్టన్‌:  అంగరంగ వైభవంగా జరగాల్సిన అమెరికా అధ్యక్ష పదవీ ప్రమాణస్వీకార వేడుక యుద్ధ వాతావరణం మధ్యలో జరగనుంది. అగ్రరాజ్య చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా అధికార మార్పిడి తుపాకీ నీడలో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకవైపు కరోనా ఆంక్షలు, మరోవైపు ట్రంప్‌ మద్దతుదారుల నుంచి పొంచి ఉన్న ప్రమాదంతో జో బైడెన్‌ అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 6న ఎక్కడైతే ట్రంప్‌ అనుచర గణం అరాచకం సృష్టించారో, అదే క్యాపిటల్‌ భవనం మెట్లపై నుంచి ప్రమాణస్వీకార మహోత్సవం జరుగుతుంది. ఈ సమయంలో కూడా అల్లర్లు చెలరేగుతాయని ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో 25 వేల మంది జాతీయ భద్రతా బలగాలు వాషింగ్టన్‌ అణువణువును జల్లెడ పడుతున్నారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా వేలాదిగా స్థానిక పోలీసులు రేయింబగళ్లు పహారా కాస్తున్నారు.  

జాతీయగీతాలాపనతో మొదలు  
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటలు) లేడీ గాగా జాతీయ గీతాలాపానతో కార్యక్రమం మొదలవుతుంది. ఆ తర్వాత బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ ప్రసంగిస్తారు. అనంతరం ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు, తొలి ఆసియా మహిళ కావడంతో ఆమె ప్రమాణ స్వీకారానికి ఎలా హాజరవుతారా అన్న చర్చ జరుగుతోంది. కమలా హ్యారిస్‌ సూట్‌లో వస్తారా, చీర కట్టుకుంటారా అన్న ఆసక్తి నెలకొంది. కమల ప్రమాణం చేశాక అధ్యక్షుడిగా జో బైడెన్‌తో అమెరికా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణం చేయిస్తారు. ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అతిథులకు చర్చి ఫాదర్‌ లియో జో దోనోవాన్‌ ఆహ్వా నం పలుకుతారు. ఆండ్రూ హాల్‌ ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. ఇక జెన్నిఫర్‌ లోపెజ్‌ సంగీత కచేరి నిర్వహిస్తారు. అమందా గోర్మన్‌ కవిత్వ పఠనం చేస్తే, డాక్టర్‌ సిల్వస్టర్‌ బీమెన్‌ అధ్యక్ష ఉపాధ్యక్షుల్ని ఆశీర్వదిస్తారు. మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, బిల్‌ క్లింటన్‌లు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.  
ప్రమాణ స్వీకారోత్సవం కోసం జెండాలతో ముస్తాబైన క్యాపిటల్‌ హిల్‌ భవనం  

పదవీ ప్రమాణం చేశాక? 
క్యాపిటల్‌ భవనం మెట్లపై నుంచి కొత్త అధినేత పదవీ బాధ్యతలు చేపట్టాక దేశ ప్రజలనుద్దేశించి బైడెన్‌ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సైనిక అధికారాలన్నీ కొత్త అధ్యక్షుడికి బదలాయింపు జరిగిందనడానికి సంకేతంగా పాస్‌ ఇన్‌ రివ్యూ కార్యక్రమం జరుగుతుంది. మిలటరీలో అన్ని విభాగాలకు చెందిన అధికారుల నుంచి కొత్త అధ్యక్షుడి హోదాలో బైడెన్‌ సైనిక వందనం స్వీకరిస్తారు. బైడెన్, కమలా హ్యారిస్‌ దంపతులు కలిసి అర్లింగ్టాన్‌ నేషనల్‌ సెమెటరీలో సైనికుల సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులరి్పస్తారు. అనంతరం పెరేడ్‌ ఎక్రాస్‌ అమెరికా కార్యక్రమం మొదలవుతుంది. సైనిక అధికారులు, మద్దతుదారులు వెంటరాగా క్యాపిటల్‌ భవనం నుంచి వైట్‌ హౌస్‌కి అధ్యక్ష, ఉపాధ్యక్షులు చేరుకుంటారు. చివరిగా టామ్‌ హాంక్స్‌ ఆధ్వర్యంలో ‘‘సెలబ్రేటింగ్‌ అమెరికా’’అని 90 నిముషాల సేపు కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రజలంతా ఆనందోత్సాహాల్లో ఉన్నారని చెప్పడం కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది. అమెరికాలో అన్ని ప్రధాన ఛానెళ్లు ప్రమాణస్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. 

ఎంతో తేడా..! 
ప్రపంచానికి పెద్దన్న ప్రమాణస్వీకారోత్సవం అంటే నింగీనేలా ఏకమయ్యేలా సంబరాలు జరిగేవి. అమెరికాలో ఊరూ వాడా వాషింగ్టన్‌ బాట పట్టేవి. అభిమానులు, పార్టీ కార్యకర్తల సంబరాలతో పండుగ వాతావరణం నెలకొనేది. ఈ వేడుకని ప్రత్యక్షంగా చూడడానికి 2 లక్షల టిక్కెట్లను విక్రయించేవారు. కానీ ఈ సారి కరోనా మహమ్మారితో సందర్శకులకు అనుమతినివ్వలేదు. గతంలో మాదిరిగా అధికార మార్పిడి శాంతియుతంగా జరగకపోవడంతో భయం గుప్పిట్లో దేశ రాజధాని వాషింగ్టన్‌ ఉంది. ఎటు వైపు నుంచి ఎలాంటి ముప్పు వస్తుందో తెలీక అందరిలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి గైర్హాజరు అవుతున్నారు. జనవరి 20న ఉదయమే ఆయన వాషింగ్టన్‌ వీడి వెళ్లిపోయే అవకాశాలున్నాయి. అదే జరిగితే కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరుకాని నాలుగో అధ్యక్షుడిగా ట్రంప్‌ చరిత్రలో నిలుస్తారు. బదులుగా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు.  
క్యాపిటల్‌ భవనం వద్ద పహారా, భవనం వద్ద ఏర్పాటు చేసిన ఇనుప కంచె 

అపార అనుభవం.. బైడెన్‌
అమెరికా నూతన అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్‌(జోసెఫ్‌ రాబినెట్‌ బైడెన్‌) 1942 నవంబర్‌ 20న పెన్సిల్వేనియా రాష్ట్రంలోని స్క్రాంటన్‌ పట్టణంలో జన్మించారు. స్క్రాంటన్‌లో, డెలావర్‌లోని న్యూ కాజిల్‌ టీల్లో ప్రాథమిక విద్యాభ్యాసం ముగించారు. 1965లో యూనివర్సిటీ ఆఫ్‌ డెలావర్‌ నుంచి డిగ్రీ పొందారు. 1965 నుంచి 1968 వరకు న్యూయార్క్‌లోని సిరాక్యుజ్‌  వర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. అదే సమయంలో(1966) నిలియా హంటర్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొద్ది కాలం న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. తరువాత క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించారు. 1972లో, 29 ఏళ్ల వయస్సులో సెనెట్‌కు ఎన్నికయ్యారు. అలా అత్యంత పిన్న వయస్కుడైన ఐదో సెనెటర్‌గా రికార్డులకెక్కారు. అదే సమయంలో, కార్‌ యాక్సిడెంట్‌లో భార్య, చిన్న కూతురు మరణించారు. ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ విషాదంతో, రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నారు. కానీ సన్నిహితుల ఒత్తిడితో మళ్లీ రాజకీయాల్లో బిజీ అయ్యారు. డెలావర్‌ నుంచి వరుసగా ఆరుసార్లు సెనెట్‌కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. 1977లో జిల్‌ జాకోబ్స్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె. సెనెటర్‌గా ఉంటూనే వైడెనర్‌ యూనివర్సిటీలో 1991 నుంచి 2008 వరకు న్యాయ విద్య బోధించారు. సెనెట్‌ విదేశీ సంబంధాల కమిటీకి రెండు సార్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు.  

డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున 1988లోనే అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఆయన విఫల యత్నం చేశారు. 2008లోనూ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించారు. కానీ, ఆ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన బరాక్‌ ఒబామా.. తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా బైడెన్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆ ఇద్దరు తమ రిపబ్లికన్‌ ప్రత్యర్థులు జాన్‌ మెక్‌ కెయిన్, సారా పాలిన్‌లపై సునాయాస విజయం సాధించారు. తరువాత, 2012లోనూ ఈ జోడీ అమెరికా, అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2015లో తన పెద్ద కుమారుడు బ్యూ బ్రెయిన్‌ కేన్సర్‌తో మరణించడం బైడెన్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. దాంతో, 2016 అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో నిలవాలనుకోవడం లేదని స్పష్టం చేసి, డెమొక్రాట్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ గెలుపు కోసం కృషి చేశారు. అధ్యక్ష బరిలో ఉన్నట్లు 2019 ఏప్రిల్‌లో బైడెన్‌ ప్రకటించారు. పార్టీలోని ప్రత్యర్థులపై పై చేయి సాధించి, డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం సాధించారు. ఆ తరువాత, హోరాహోరీ పోరులో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై నిశ్చయాత్మక విజయం సాధించి, దేశ 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 

ఐస్‌క్రీమ్‌ ప్రెసిడెంట్‌..! 
‘‘నా పేరు జో బైడెన్‌. ఐస్‌క్రీములంటే నాకు ప్రాణం’’ జో బైడెన్‌ ఓసారి తనని తాను పరిచయం చేసుకుంటూ చెప్పిన మాటలివి.. ప్రతీరోజూ ఆయన ఐస్‌క్రీమ్‌ తిని తీరవలసిందే. కోన్‌ ఐస్‌క్రీము అంటే ఆయనకి చెప్పలేనంత ఇష్టం. ‘‘నేను మందు ముట్టను, సిగరెట్లు తాగను. కానీ ఐçస్‌క్రీములు ఎన్నయినా లాగించేస్తా’’అని ఆయన 2016లో ఉపాధ్యక్ష పదవికి గుడ్‌ బై చెప్పే సమయంలో అన్నారు. ‘ఒకేసారి ముగ్గురు తినగలిగేనన్ని ఐస్‌క్రీములు నేను హ్యాపీగా తినేస్తాను’’అని నవ్వుతూ చెప్పారు. జెనీస్‌ కంపెనీ ఐస్‌క్రీమ్‌లు ఆయన ఫేవరెట్‌. అందుకే ఓసారి ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొలంబస్‌లో ఉన్న జెనీస్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. కంపెనీలో ఉద్యోగుల జీతభత్యాల గురించి విచారించారు. 

‘న్యాయ’ వాది.. కమల!
అమెరికా నూతన ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కమలా దేవి హ్యారిస్‌ తొలి ఇండో – ఆఫ్రో అమెరికన్‌ మహిళ. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఆక్లాండ్‌లో 1964, అక్టోబర్‌ 20న ఆమె జన్మించారు. భారతీయ అమెరికన్‌ శ్యామల గోపాలన్, జమైకన్‌ మూలాలున్న డొనాల్డ్‌ హ్యారిస్‌ ఆమె తల్లిదండ్రులు. డొనాల్డ్‌ హ్యారిస్‌ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌. పీహెచ్‌డీ చేసిన తల్లి శ్యామల బ్రెస్ట్‌ కేన్సర్‌ చికిత్సకు పరిశోధనలు చేశారు. సోదరి మాయ పబ్లిక్‌ పాలసీ సలహాదారుగా ఉన్నారు.

కమల 1986లో హోవర్డ్‌ వర్సిటీలో రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రంలతో బీఏ పూర్తి చేశారు. అనంతరం హాస్టింగ్స్‌ కాలేజ్‌ నుంచి 1989లో లా డిగ్రీ పొందారు. 1990 నుంచి 1998 వరకు ఆక్లాండ్‌లో డెప్యూటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీగా పనిచేశారు. గ్యాంగ్‌ దాడులు, లైంగిక వేధింపులు, డ్రగ్స్‌ వినియోగం.. తదితర కేసులను సమర్ధవంతంగా వాదించి, మంచి పేరు తెచ్చుకున్నారు. అనంతరం 2004లో డిస్ట్రిక్ట్‌ అటార్నీగా, 2010లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు. ఈ పదవి సాధించిన తొలి మహిళగా, తొలి ఇండో–ఆఫ్రో అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. తనఖా పెట్టుకుని వడ్డీ వ్యాపారం చేసేవారి అక్రమ విధానాలకు వ్యతిరేకంగా 2012లో ఆమె వాదించిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే, స్వలింగ వివాహాలను నిషేధిస్తూ కాలిఫోర్నియా రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ వాదించాలన్న అభ్యర్థనను ఆమె నిర్ద్వంద్వంగా తోసిపుచ్చి, రాష్ట్రంలో ఆ చట్టం అమలు కాకుండా చూశారు.  

2014లో న్యాయవాదిగా పనిచేస్తున్న డగ్లస్‌ ఎమ్‌హాఫ్‌తో ఆమెకు వివాహమయింది. అనంతరం, 2016లో డెమొక్రాటిక్‌ పార్టీ నుంచి సెనేట్‌కు ఎన్నికయ్యారు. సెనేట్‌కు ఎన్నికైన తొలి ఇండో అమెరికన్‌గా, రెండో ఆఫ్రో అమెరికన్‌గా కమల రికార్డు సృష్టించారు. సెనేట్‌లో సెలెక్ట్‌ కమిటీ ఆన్‌ ఇంటలిజెన్స్, జ్యూడీషియరీ కమిటీల్లో సభ్యురాలిగా సేవలందించారు. 2019లో డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. మొదట్లో ఆమె అభ్యర్థిత్వం పార్టీ శ్రేణుల్లో అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ క్రమంగా గట్టి పోటీదారుగా ఎదిగారు. అధ్యక్ష అభ్యర్థిత్వానికి సంబంధించిన చర్చల్లో భాగంగా పోటీదారు జో బైడెన్‌తో జాత్యహంకార అంశంపై ఆమె చేసిన వాదన పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించి పెట్టింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement