అన్ని వర్గాలకు నచ్చే విధంగా... ఢిల్లీ కేబినెట్‌ కూర్పు | Delhi CM Rekha Gupta announces cabinet portfolio allocation | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాలకు నచ్చే విధంగా... ఢిల్లీ కేబినెట్‌ కూర్పు

Published Fri, Feb 21 2025 6:18 AM | Last Updated on Fri, Feb 21 2025 6:20 AM

Delhi CM Rekha Gupta announces cabinet portfolio allocation

న్యూఢిల్లీ: ఢిల్లీలో దాదాపు 26 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తాజాగా ఏర్పాటైన రేఖా గుప్తా  ప్రభుత్వంలో అన్ని ప్రధాన వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా(50) బనియా వర్గానికి  చెందిన ఎమ్మెల్యే. మంత్రులుగా పర్వేశ్‌ వర్మ, ఆశిష్‌ సూద్, మంజిందర్‌ సింగ్‌ సిర్సా, కపిల్‌ మిశ్రా, రవీందర్‌ ఇంద్రజ్‌ సింగ్, పంకజ్‌ సింగ్‌ ప్రమాణం చేశారు. 

వీరిలో పర్వేశ్‌ వర్మ జాట్‌ నేత. సీఎం పదవికి పోటీ పడిన వారిలో ఈయన ముందు వరుసలో ఉన్నారు. రవీందర్‌ ఇంద్రజ్‌ సింగ్‌ దళిత నేత కాగా,  మజిందర్‌ సింగ్‌ సిర్సా సిక్కు నేత . కపిల్‌ మిశ్రా, పంకజ్‌ సింగ్‌లు  పూర్వాంచల్‌ ప్రాంత వాసులు. ఆశిష్‌ సూద్‌ బీజేపీ పంజాబీ నేతల్లో  ప్రముఖుడిగా ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఆయా వర్గాల వారికి సంతుష్టి కలిగించేందుకు బీజేపీ పెద్దలు యత్నించినట్లు చెబుతున్నారు.

కేబినెట్‌లో జాట్‌ వర్గం నేత 
ఢిల్లీ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో న్యూఢిల్లీ సీటు నుంచి ఆప్‌ చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్‌పై ఘన విజయం సాధించడం ద్వారా ఒక్కసారిగా తెరపైకి వచ్చారు పర్వేశ్‌ వర్మ(47). ఢిల్లీ సీఎం కుర్చీ కోసం పోటీ పడిన బీజేపీ నేతల్లో ఈయన కూడా ఉన్నారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పర్వేశ్‌ వర్మ పేరు జాతీయ రాజకీయాల్లో వినపడింది. అయితే, మూడుసార్లు సీఎంగా పనిచేసిన కేజ్రీవాల్‌ను ఓడించిన తర్వాత ఈయన పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఢిల్లీలోని జాట్‌ నేతల్లో ప్రముఖంగా ఉన్నారు.  

గురువారం సీఎం రేఖా గుప్తాతోపాటు మంత్రిగా ప్రమాణం చేసిన వారిలో పర్వేశ్‌ వర్మ ఒకరు. మాజీ సీఎం సాహిబ్‌ సింగ్‌ వర్మ కుమారుడే పర్వేశ్‌. కేజ్రీవాల్‌పై పోటీ చేస్తానంటూ బహిరంగంగా ప్రకటించిన ఫైర్‌ బ్రాండ్‌ నేత. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు గట్టి పోటీ ఇచ్చేది తానేనంటూ ముందుకు వచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో నాలుగు వేల ఓట్ల తేడాతో కేజ్రీను ఓడించారు. కాగా, మూడు పర్యాయాలు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఇదే న్యూఢిల్లీ నియోజకవర్గంలో 2013లో కేజ్రీవాల్‌ ఓడించడం గమనార్హం. 1977లో పుట్టిన పర్వేశ్‌ వర్మ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుని 1991లో ఆర్‌ఎస్‌ఎస్‌లో బాల్‌ స్వయంసేవక్‌గా చేరారు. 

బీజేపీ యువ మోర్చాలో చేరి నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడి స్థాయికి ఎదిగారు. బీజేపీ ఢిల్లీ విభాగం ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు. ఫోర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ డిగ్రీ చేసిన వర్మ తన తండ్రి నెలకొల్పిన రాష్ట్రీయ స్వాభిమాన్‌ అనే ఎన్‌జీవో ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 2013లో మెహ్రౌలీ నుంచి మొదటి సారిగా ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం ఢిల్లీ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 2019 ఎన్నికల్లో ఏకంగా 5.78 లక్షల ఓట్ల తేడాతో పర్వేశ్‌ వర్మ సాధించిన విజయం ఒక రికార్డుగా ఉంది.

దంత వైద్యుడు.. పూర్వాంచల్‌ నేత 
పంకజ్‌ కుమార్‌ సింగ్‌ రేఖా గుప్తా ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన మరో ఎమ్మెల్యే పంకజ్‌ కుమార్‌ సింగ్‌(48). వృత్తి రీత్యా దంతవైద్యుడైన పంకజ్‌ కుమార్‌ గుప్తా పూర్వాంచల్‌ ప్రాంతానికి చెందిన నేత. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా వికాస్‌పురి నుంచి పోటీ చేసి, ప్రత్యరి్థపై 12వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ పూర్వాంచల్‌ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు పంకజ్‌ కుమార్‌. 

ఢిల్లీలో ఉండే ఉత్తరప్రదేశ్, తూర్పు ప్రాంతం బిహార్, జార్ఖండ్‌ వారిని పూర్వాంచల్‌ వాసులుగా పిలుస్తుంటారు. ఢిల్లీలోని పలు నియోజకవర్గాల్లో వీరిదే పైచేయి. బిహార్‌లోని బోధ్‌గయలో ఉన్న మగధ్‌ యూనివర్సిటీ నుంచి 1998లో డెంటల్‌ సర్జరీలో ఇగ్రీ చేశారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ నేతగా పనిచేశారు. మరికొద్ది నెలల్లో బిహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ ఈయనకు కేబినెట్‌లో స్థానం కల్పించడం గమనార్హం.  

ఒకప్పుడు మోదీ విమర్శకుడు.. నేడు హిందుత్వ వీరాభిమాని 
ఢిల్లీ మంత్రిగా గురువారం ప్రమాణం చేసిన కపిల్‌ మిశ్రా(44) ఒకప్పుడు ఆప్‌ సభ్యుడు. ప్రధాని మోదీని, బీజేపీ, ఆర్‌ఎస్‌లను తీవ్రంగా విమర్శించిన వివాదాస్పద నేతగా ఉన్నారు. అటువంటి వ్యక్తి పూర్తిగా మారిపోయారు. నేడు హిందుత్వకు వీరాభిమాని అయ్యారు. కపిల్‌ మిశ్రాను కేబినెట్‌లో తీసుకోవడాన్ని బీజేపీ వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు. 2010లో ఢిల్లీలో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ జరిగిన సమయంలో కపిల్‌ మిశ్రా అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 

ఆప్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన కుమార్‌ విశ్వాస్‌కు సన్నిహితుడిగా భావిస్తారు. ఢిల్లీ వర్సిటీ నుంచి సోషల్‌ వర్క్‌లో ఎంఏ చేసిన మిశ్రా 2015లో ఆప్‌ తరఫున కరవల్‌ నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేజ్రీవాల్‌ కేబినెట్‌లో జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, కేజ్రీవాల్, కుమార్‌ విశ్వాస్‌ మధ్య విభేదాలు తలెత్తడంతో కపిల్‌ మిశ్రా కూడా కేజ్రీకి దూరమయ్యారు. 

అనంతరం కుమార్‌ విశ్వాస్, కపిల్‌ మిశ్రాలు కేజ్రీతోపాటు ఆప్‌ మరో నేత సత్యేందర్‌ జైన్‌లకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు చేశారు. 2017లో మంత్రి పదవి కోల్పోయారు. అయినప్పటికీ, ఆప్‌ ఎమ్మెల్యేగా ఉంటూనే కేజ్రీవాల్‌పై విమర్శలు మాత్రం మానలేదు. 2019లో ఆయనపై ఆప్‌ బహిష్కరణ వేటు వేసింది. 2019లోనే బీజేపీలో చేరారు కపిల్‌ మిశ్రా. బీజేపీ ఢిల్లీ విభాగం ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. 2020 ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

అనంతరం, బీజేపీ, హిందుత్వకు అనుకూలంగా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలైంది. 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో విద్వేష ప్రసంగాలు చేశారంటూ ఆయనపై ఆరోపణలొచ్చాయి. తాజాగా బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన నేపథ్యంలో గతంలో ఆయన ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల తీరును ఎండగడుతూ ఆయన చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇటీవలి ఎన్నికల్లో ఆప్‌ నేత మనోజ్‌ కుమార్‌ త్యాగిపై 23 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.

పంజాబీ నేత ఆశిష్‌ సూద్‌ 
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడైన ఆశిష్‌ సూద్‌(58) ఢిల్లీలోని బీజేపీ పంజాబీ నేతల్లో ఒకరు. తాజా ఎన్నికల్లో జనక్‌పురి నుంచి 18 వేల ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా గెలుపొంది గురువారం రేఖా గుప్తా కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణం చేశారు. సంస్థాగత వ్యవహారాల్లో నిపుణుడిగా పేరున్న సూద్‌ ప్రస్తుతం బీజేపీ గోవా వ్యవహారాలతోపాటు జమ్మూకశ్మీర్‌ సహ ఇన్‌చార్జిగా ఉన్నారు. 

ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగాను పనిచేశారు. 2003లో బీజేపీ యువమోర్చా జనరల్‌ సెక్రటరీగా పనిచేసిన ఈయన, ఆ తర్వాత రెండేళ్లకే జాతీయ ఉపాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2009లో ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2012లో దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు బీజేపీ అగ్ర నాయకులకు ఆశిష్‌ సూద్‌ ఎంతో నమ్మకస్తుడని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వ్యాపారవేత్త అయిన ఈయన కామర్స్‌లో డిగ్రీ చేశారు. 

దళిత వర్గం నేత రవీందర్‌ 
రేఖా గుప్తా సారథ్యంలోని ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన రవీందర్‌ ఇంద్రజ్‌ సింగ్‌(50) కేబినెట్‌లో దళిత వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ ఎస్‌సీ మోర్చాలో కీలక సభ్యుడిగా ఉన్న రవీందర్‌ ఇటీవలి ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఓపెన్‌ లెరి్నంగ్‌(ఎస్‌వోఎల్‌) నుంచి బీఏ పట్టా అందుకున్న రవీందర్‌కు ఢిల్లీ బీజేపీలో దళిత నేతగా మంచి పేరుంది.

 ఇటీవలి ఎన్నికల్లో బావన ఎస్‌సీ రిజర్వుడ్‌ స్థానంలో ఆమ్‌ఆద్మీ పార్టీ నేత జై భగవాన్‌ ఉప్కార్‌ను 31 వేల ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. నార్త్‌ ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీకి మద్దతు కూడగట్టడంలో రవీందర్‌ కీలకంగా వ్యవహరించారు. మొదట్నుంచీ బావన నియోజకవర్గంతోనే ఆయనకు ఎక్కువగా అనుబంధం ఉంది. ఈయన తండ్రి ఇంద్రజ్‌ సింగ్‌ గతంతో నరేల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్నికల కమిషన్‌కు సమరి్పంచిన అఫిడవిట్‌ను అనుసరించి ఈయన ఆస్తులు రూ.7 కోట్లు కాగా, ఎటువంటి క్రిమినల్‌ కేసులు లేవు.

సిక్కుల ప్రతినిధి మంజిందర్‌ సింగ్‌ సిర్సా 
ఢిల్లీ రాజకీయ ముఖచిత్రంలో బాగా వినిపించే పేరు మంజిందర్‌ సింగ్‌ సిర్సా(53). కోవిడ్‌ మహమ్మారి ప్రబలంగా ఉన్న సమయంలో ఆక్సిజన్‌ లాంగార్స్‌ నిర్వహించి చురుగ్గా వ్యవహరించిన సామాజిక కార్యకర్తగా సిక్కు నేతగా సిర్సాకు మంచి పేరుంది. తాజాగా రేఖా గుప్తా ప్రభుత్వంలో మంత్రిగా మాతృభాష పంజాబీలో ప్రమాణం చేశారు. సిక్కు వర్గం మద్దతు కూడగట్టేందుకే ఈయనకు బీజేపీ మంత్రి వర్గంలో స్థానం కల్పించినట్లు పరిశీలకులు చెబుతున్నారు. తాజా ఎన్నికల్లో ఆప్‌కు చెందిన ధన్వతి చండేలాపై 18 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

రాజౌరీ గార్డెన్‌ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మజీందర్‌ సింగ్‌ శిరోమణి అకాలీదళ్‌ను వీడి 2021లో బీజేపీలో చేరారు. 2013లో మొదటిసారిగా రాజౌరీ గార్డెన్‌ సీటును గెలుచుకున్నారు. 2013 నుంచి 2019 వరకు ఢిల్లీ సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ(డీఎస్‌జీఎంసీ)కి సుదీర్ఘకాలం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం డీఎస్‌జీఎంఎంసీకి అధ్యక్షుడిగా 2019–2022 మధ్య సేవలందించారు. ఎన్నికల సంఘానికి సమరి్పంచిన అఫిడవిట్‌లో తనకు రూ.188 కోట్ల ఆస్తులు, భార్య సత్విన్దర్‌ కౌర్‌ సిర్సాకు కూడా రూ.71 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. మంజిందర్‌పై ఒక ఎఫ్‌ఐఆర్, నాలుగు పరువు నష్టం కేసులు నమోదై ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement