ఎస్డీఎంసీ కృషి భేష్!
న్యూఢిల్లీ: ‘నీవ్’ పేరుతో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ) చేపట్టిన కార్యక్రమం 12,000 మంది అనాథ పిల్లలను బడిబాట పట్టించింది. 4,000 మంది టీచర్లు, 300 స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తల సహకారంతో జూన్ 14 నుంచి 30 వరకు చేపట్టిన ప్రచార కార్యక్రమం ద్వారా 12,050 మంది అనాథ పిల్లలు వివిధ పాఠశాలల్లో చేరారని ఎస్డీఎంసీ విద్యాకమిటీ చైర్మన్ ఆశీష్ సూద్ మంగళవారం తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని ఎస్‌డీఎంసీకి చెందిన సెంట్రల్, సౌత్, వెస్ట్, నజఫ్‌గఢ్ విభాగాల్లో ప్రారంభించామని, తద్వారా 5,118 మంది బాలురు, 6,932 మంది బాలికలు తమ పేర్లను పాఠశాలల్లో నమోదు చేసుకున్నారని చెప్పారు.
జోన్ల వారీగా బాలుర సంఖ్య.. సెంట్రల్ 2,002, సౌత్ 1,038, వెస్ట్ 898, నజఫ్‌గఢ్ 1,180గా ఉండగా బాలికల సంఖ్య సెంట్రల్ 3,429, సౌత్ 1,062, వెస్ట్ 1,220, నజఫ్‌గఢ్ 1221గా ఉందని చెప్పారు. ప్రచార సమయంలో ఎస్డీఎంసీ ప్రారంభించిన హెల్ప్‌లైన్‌కు 70 ఫోన్‌కాల్స్ వచ్చాయన్నారు. ఎన్డీఎంపీ పరిధిలోని ప్రాంతాల నుంచి కూడా దాదాపు నాలుగు డజన్ల ఫోన్‌కాల్స్ వచ్చాయన్నారు. తూర్పు, ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి 16, 12 కాల్స్ వచ్చినట్లు చెప్పారు. ఇక దక్షిణ ఢిల్లీలోని విభాగాలైన సెంట్రల్ నుంచి 10, సౌత్ నుంచి 16, వెస్ట్ నుంచి 6, నజఫ్‌గఢ్ నుంచి 10 కాల్స్ వచ్చినట్లు చెప్పారు.
అయితే వేసవి సెలవుల కారణంగా అన్ని పాఠశాలల పరిధిలో ప్రచారాన్ని పూర్తిస్థాయిలో చేపట్టలేకపోయామన్నారు. ఈ పథకం ప్రచారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. నిర్మాణ రంగంలో ఉన్న కార్మికుల పిల్లల్ని బడిలో చేర్చాలనేదే ఎస్డీఎంసీ ప్రధాన లక్ష్యమని, ముఖ్యంగా బాలికలను బడిలోకి పంపాలన్న లక్ష్యంతోనే ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలను గుర్తించేందుకు ఇంటింటికీ తిరిగామని చెప్పారు.