Manjinder Singh Sirsam
-
అన్ని వర్గాలకు నచ్చే విధంగా... ఢిల్లీ కేబినెట్ కూర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీలో దాదాపు 26 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తాజాగా ఏర్పాటైన రేఖా గుప్తా ప్రభుత్వంలో అన్ని ప్రధాన వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా(50) బనియా వర్గానికి చెందిన ఎమ్మెల్యే. మంత్రులుగా పర్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ ప్రమాణం చేశారు. వీరిలో పర్వేశ్ వర్మ జాట్ నేత. సీఎం పదవికి పోటీ పడిన వారిలో ఈయన ముందు వరుసలో ఉన్నారు. రవీందర్ ఇంద్రజ్ సింగ్ దళిత నేత కాగా, మజిందర్ సింగ్ సిర్సా సిక్కు నేత . కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్‌లు పూర్వాంచల్ ప్రాంత వాసులు. ఆశిష్ సూద్ బీజేపీ పంజాబీ నేతల్లో ప్రముఖుడిగా ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఆయా వర్గాల వారికి సంతుష్టి కలిగించేందుకు బీజేపీ పెద్దలు యత్నించినట్లు చెబుతున్నారు.కేబినెట్లో జాట్ వర్గం నేత ఢిల్లీ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో న్యూఢిల్లీ సీటు నుంచి ఆప్ చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్‌పై ఘన విజయం సాధించడం ద్వారా ఒక్కసారిగా తెరపైకి వచ్చారు పర్వేశ్ వర్మ(47). ఢిల్లీ సీఎం కుర్చీ కోసం పోటీ పడిన బీజేపీ నేతల్లో ఈయన కూడా ఉన్నారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పర్వేశ్ వర్మ పేరు జాతీయ రాజకీయాల్లో వినపడింది. అయితే, మూడుసార్లు సీఎంగా పనిచేసిన కేజ్రీవాల్‌ను ఓడించిన తర్వాత ఈయన పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఢిల్లీలోని జాట్ నేతల్లో ప్రముఖంగా ఉన్నారు. గురువారం సీఎం రేఖా గుప్తాతోపాటు మంత్రిగా ప్రమాణం చేసిన వారిలో పర్వేశ్ వర్మ ఒకరు. మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేశ్. కేజ్రీవాల్‌పై పోటీ చేస్తానంటూ బహిరంగంగా ప్రకటించిన ఫైర్ బ్రాండ్ నేత. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు గట్టి పోటీ ఇచ్చేది తానేనంటూ ముందుకు వచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో నాలుగు వేల ఓట్ల తేడాతో కేజ్రీను ఓడించారు. కాగా, మూడు పర్యాయాలు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఇదే న్యూఢిల్లీ నియోజకవర్గంలో 2013లో కేజ్రీవాల్ ఓడించడం గమనార్హం. 1977లో పుట్టిన పర్వేశ్ వర్మ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుని 1991లో ఆర్ఎస్ఎస్లో బాల్ స్వయంసేవక్‌గా చేరారు. బీజేపీ యువ మోర్చాలో చేరి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడి స్థాయికి ఎదిగారు. బీజేపీ ఢిల్లీ విభాగం ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు. ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ డిగ్రీ చేసిన వర్మ తన తండ్రి నెలకొల్పిన రాష్ట్రీయ స్వాభిమాన్ అనే ఎన్జీవో ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 2013లో మెహ్రౌలీ నుంచి మొదటి సారిగా ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం ఢిల్లీ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 2019 ఎన్నికల్లో ఏకంగా 5.78 లక్షల ఓట్ల తేడాతో పర్వేశ్ వర్మ సాధించిన విజయం ఒక రికార్డుగా ఉంది.దంత వైద్యుడు.. పూర్వాంచల్ నేత పంకజ్ కుమార్ సింగ్ రేఖా గుప్తా ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన మరో ఎమ్మెల్యే పంకజ్ కుమార్ సింగ్(48). వృత్తి రీత్యా దంతవైద్యుడైన పంకజ్ కుమార్ గుప్తా పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన నేత. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా వికాస్పురి నుంచి పోటీ చేసి, ప్రత్యరి్థపై 12వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ పూర్వాంచల్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు పంకజ్ కుమార్. ఢిల్లీలో ఉండే ఉత్తరప్రదేశ్, తూర్పు ప్రాంతం బిహార్, జార్ఖండ్ వారిని పూర్వాంచల్ వాసులుగా పిలుస్తుంటారు. ఢిల్లీలోని పలు నియోజకవర్గాల్లో వీరిదే పైచేయి. బిహార్‌లోని బోధ్‌గయలో ఉన్న మగధ్ యూనివర్సిటీ నుంచి 1998లో డెంటల్ సర్జరీలో ఇగ్రీ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కార్పొరేషన్ నేతగా పనిచేశారు. మరికొద్ది నెలల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ ఈయనకు కేబినెట్లో స్థానం కల్పించడం గమనార్హం. ఒకప్పుడు మోదీ విమర్శకుడు.. నేడు హిందుత్వ వీరాభిమాని ఢిల్లీ మంత్రిగా గురువారం ప్రమాణం చేసిన కపిల్ మిశ్రా(44) ఒకప్పుడు ఆప్ సభ్యుడు. ప్రధాని మోదీని, బీజేపీ, ఆర్ఎస్లను తీవ్రంగా విమర్శించిన వివాదాస్పద నేతగా ఉన్నారు. అటువంటి వ్యక్తి పూర్తిగా మారిపోయారు. నేడు హిందుత్వకు వీరాభిమాని అయ్యారు. కపిల్ మిశ్రాను కేబినెట్లో తీసుకోవడాన్ని బీజేపీ వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు. 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ జరిగిన సమయంలో కపిల్ మిశ్రా అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్‌కు సన్నిహితుడిగా భావిస్తారు. ఢిల్లీ వర్సిటీ నుంచి సోషల్ వర్క్‌లో ఎంఏ చేసిన మిశ్రా 2015లో ఆప్ తరఫున కరవల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేజ్రీవాల్ కేబినెట్లో జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, కేజ్రీవాల్, కుమార్ విశ్వాస్ మధ్య విభేదాలు తలెత్తడంతో కపిల్ మిశ్రా కూడా కేజ్రీకి దూరమయ్యారు. అనంతరం కుమార్ విశ్వాస్, కపిల్ మిశ్రాలు కేజ్రీతోపాటు ఆప్ మరో నేత సత్యేందర్ జైన్లకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు చేశారు. 2017లో మంత్రి పదవి కోల్పోయారు. అయినప్పటికీ, ఆప్ ఎమ్మెల్యేగా ఉంటూనే కేజ్రీవాల్‌పై విమర్శలు మాత్రం మానలేదు. 2019లో ఆయనపై ఆప్ బహిష్కరణ వేటు వేసింది. 2019లోనే బీజేపీలో చేరారు కపిల్ మిశ్రా. బీజేపీ ఢిల్లీ విభాగం ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. 2020 ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం, బీజేపీ, హిందుత్వకు అనుకూలంగా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలైంది. 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో విద్వేష ప్రసంగాలు చేశారంటూ ఆయనపై ఆరోపణలొచ్చాయి. తాజాగా బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన నేపథ్యంలో గతంలో ఆయన ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీల తీరును ఎండగడుతూ ఆయన చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇటీవలి ఎన్నికల్లో ఆప్ నేత మనోజ్ కుమార్ త్యాగిపై 23 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.పంజాబీ నేత ఆశిష్ సూద్ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడైన ఆశిష్ సూద్(58) ఢిల్లీలోని బీజేపీ పంజాబీ నేతల్లో ఒకరు. తాజా ఎన్నికల్లో జనక్‌పురి నుంచి 18 వేల ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా గెలుపొంది గురువారం రేఖా గుప్తా కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. సంస్థాగత వ్యవహారాల్లో నిపుణుడిగా పేరున్న సూద్ ప్రస్తుతం బీజేపీ గోవా వ్యవహారాలతోపాటు జమ్మూకశ్మీర్ సహ ఇన్చార్జిగా ఉన్నారు. ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగాను పనిచేశారు. 2003లో బీజేపీ యువమోర్చా జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఈయన, ఆ తర్వాత రెండేళ్లకే జాతీయ ఉపాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2009లో ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2012లో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికయ్యారు. ఆర్ఎస్ఎస్తోపాటు బీజేపీ అగ్ర నాయకులకు ఆశిష్ సూద్ ఎంతో నమ్మకస్తుడని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వ్యాపారవేత్త అయిన ఈయన కామర్స్‌లో డిగ్రీ చేశారు. దళిత వర్గం నేత రవీందర్ రేఖా గుప్తా సారథ్యంలోని ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన రవీందర్ ఇంద్రజ్ సింగ్(50) కేబినెట్లో దళిత వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ ఎస్సీ మోర్చాలో కీలక సభ్యుడిగా ఉన్న రవీందర్ ఇటీవలి ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెరి్నంగ్(ఎస్‌వోఎల్) నుంచి బీఏ పట్టా అందుకున్న రవీందర్‌కు ఢిల్లీ బీజేపీలో దళిత నేతగా మంచి పేరుంది. ఇటీవలి ఎన్నికల్లో బావన ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో ఆమ్ఆద్మీ పార్టీ నేత జై భగవాన్ ఉప్కార్ను 31 వేల ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. నార్త్ ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీకి మద్దతు కూడగట్టడంలో రవీందర్ కీలకంగా వ్యవహరించారు. మొదట్నుంచీ బావన నియోజకవర్గంతోనే ఆయనకు ఎక్కువగా అనుబంధం ఉంది. ఈయన తండ్రి ఇంద్రజ్ సింగ్ గతంతో నరేల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్నికల కమిషన్‌కు సమరి్పంచిన అఫిడవిట్‌ను అనుసరించి ఈయన ఆస్తులు రూ.7 కోట్లు కాగా, ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు.సిక్కుల ప్రతినిధి మంజిందర్ సింగ్ సిర్సా ఢిల్లీ రాజకీయ ముఖచిత్రంలో బాగా వినిపించే పేరు మంజిందర్ సింగ్ సిర్సా(53). కోవిడ్ మహమ్మారి ప్రబలంగా ఉన్న సమయంలో ఆక్సిజన్ లాంగార్స్ నిర్వహించి చురుగ్గా వ్యవహరించిన సామాజిక కార్యకర్తగా సిక్కు నేతగా సిర్సాకు మంచి పేరుంది. తాజాగా రేఖా గుప్తా ప్రభుత్వంలో మంత్రిగా మాతృభాష పంజాబీలో ప్రమాణం చేశారు. సిక్కు వర్గం మద్దతు కూడగట్టేందుకే ఈయనకు బీజేపీ మంత్రి వర్గంలో స్థానం కల్పించినట్లు పరిశీలకులు చెబుతున్నారు. తాజా ఎన్నికల్లో ఆప్‌కు చెందిన ధన్వతి చండేలాపై 18 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజౌరీ గార్డెన్ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మజీందర్ సింగ్ శిరోమణి అకాలీదళ్‌ను వీడి 2021లో బీజేపీలో చేరారు. 2013లో మొదటిసారిగా రాజౌరీ గార్డెన్ సీటును గెలుచుకున్నారు. 2013 నుంచి 2019 వరకు ఢిల్లీ సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ(డీఎస్‌జీఎంసీ)కి సుదీర్ఘకాలం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం డీఎస్జీఎంఎంసీకి అధ్యక్షుడిగా 2019–2022 మధ్య సేవలందించారు. ఎన్నికల సంఘానికి సమరి్పంచిన అఫిడవిట్లో తనకు రూ.188 కోట్ల ఆస్తులు, భార్య సత్విన్దర్ కౌర్ సిర్సాకు కూడా రూ.71 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. మంజిందర్‌పై ఒక ఎఫ్ఐఆర్, నాలుగు పరువు నష్టం కేసులు నమోదై ఉన్నాయి. -
అది సీఎం ఆఫీస్.. లిక్కర్ షాపు కాదు.. బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు
ఢిల్లీ: జైలు నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ జాతీయ కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన తర్వాత ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తొలిసారి సీఎం హోదాలో ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల వివరాలను మీడియా సమావేశంలో ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించగా మంజీందర్ సింగ్ సిర్సా స్పందించారు. ‘ఆప్ మంత్రి అతిషి విలేకరుల సమావేశం ద్వారా జారీ చేసిన లేఖ నకిలీది. ఆమె ఢిల్లీ ప్రజలను మోసం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. అది సీఎం కార్యాలయం.. మద్యం షాపు కాదని మంత్రి అతిషీకి, ఆ పార్టీకి చెప్పాలనుకుంటున్నాను. ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కోర్టు అనుమతి ఇచ్చే వరకు ఎటువంటి ఉత్తర్వును జారీ చేయలేడు’ అని సిర్సా వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేని సమయంలో సీఎం కార్యాలయాన్ని ఎవరు ఉపయోగించారు? అధికారిక లేఖను ఎవరు రూపొందించారు.. జారీ చేశారు? ఈ విషయాలు నేరపూరిత కుట్రలో భాగమని, దీనిపై విచారణ జరిపించాలని ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనాను కోరుతున్నాను’ అన్నారు. #WATCH | Delhi: As Delhi CM Arvind Kejriwal issues first order from ED custody on water shortage during summer in National Capital, BJP National Secretary Manjinder Singh Sirsa says, "The letter that has been issued by AAP Minister Atishi through a press conference is… pic.twitter.com/HtrbVkxQdI — ANI (@ANI) March 24, 2024 -
లిక్కర్ స్కాంలో ‘హైదరాబాద్’ లింకులను కోర్టులో అందిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనానికి తెరలేపిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో హైదరాబాద్‌కు ఉన్న లింకులను కోర్టులో సమర్పిస్తామని బీజేపీ ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. గతంలో తాము చేసిన ఆరోప ణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున వివరాలన్నీ అక్కడే చెబుతామన్నారు. ఎంపీ సుధాంశు త్రివేది, బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశ్‌గుప్తాలతో కలిసి గురువారం ఇక్కడి బీజేపీ కేంద్ర కార్యాలయంలో మంజిందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో హైదరాబాద్ నుంచి ఎవరెవరు ఢిల్లీకి వచ్చారు, ఎవరెవరిని కలిశారు... ఢిల్లీ నుంచి ఎవరు హైదరాబాద్ వెళ్లి ఎవరెవరిని, ఎప్పుడు కలిశారు.. అనే వాటి గురించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. హైకోర్టు స్టే విధించిన కారణంగా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడట్లేదన్నారు. ఢిల్లీలో అక్రమంగా లిక్కర్ ద్వారా వచ్చిన డబ్బులను పంజాబ్, గోవా ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ ఖర్చు పెట్టిందని సుధాంశు త్రివేది, ఆదేశ్గుప్తా ఆరోపించారు. అవినీతిని అంతం చేస్తా అని అధికారంలోకి వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో అవసరానికి మించి లిక్కర్ సరఫరా చేశారని, బ్లాక్ దందా అంతా దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఢిల్లీ నుంచే సప్లయ్ అయిందని ఆరోపించారు. కేజ్రీవాల్ ఆయన మిత్రులకు లాభం చేకూర్చారని, నిందితుడు అమిత్ అరోరాపై జరిగిన స్టింగ్ ఆపరేషన్‌లో అన్ని విషయాలు బయట పడ్డాయన్నారు. ఇప్పటికైనా కేజ్రీవాల్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ? -
కరణ్ జోహార్ డ్రగ్ పార్టీపై ఎన్సీబీ కన్ను
ముంబై: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ 2019లో నిర్వహించిన డ్రగ్ పార్టీపై విచారణ జరపాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఫిర్యాదు చేశారు. దీంతో కరన్‌తో పాటు అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. డ్రగ్ పార్టీ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించామని, ఆ వీడియో నిజమని తేలితే, విచారణ చేపట్టనున్నట్లు ఎన్సీబీ తెలిపింది. 2019, ఆగస్టు 1న ఈ డ్రగ్ పార్టీపై ఫిర్యాదు చేశానని, అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ముంబై పోలీసులు ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకొని ఉంటే, సుశాంత్ సింగ్ రాజ్పుత్ని రక్షించుకోగలిగేవారమని శిరోమణి అకాలీదళ్ నాయకులు సిర్సా తెలిపారు. ఆ రోజు జరిగిన డ్రగ్స్ పార్టీలో దీపికా పదుకొణె, షాహిద్ కపూర్, రణ్‌బీర్ కపూర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, జోయా అక్తర్ లాంటి ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. హిందీ చలన చిత్ర పరిశ్రమలో కరణ్ ఆశ్రిత పక్షపాతానికి పాల్పడతారని, ఆయనపై అనేక మార్లు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విమర్శలు చేశారు. -
కమల్‌నాథ్‌పై సిక్కు అల్లర్ల కేసు!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్ చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీలో 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కమల్‌నాథ్‌పై నమోదైన కేసును రీ–ఓపెన్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారించనుంది. కమల్‌నాథ్ కేసుతో పాటు మరో 6 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులను సిట్ పునర్విచారణ జరపనుంది. ఈ విషయమై ఢిల్లీ సిక్కుల గురుద్వారా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, అకాలీదళ్ ఎమ్మెల్యే మన్జిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ..‘1984 అల్లర్ల కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌పై నమోదైన కేసును సిట్ పునర్విచారించనుంది. సిక్కుల ఊచకోతకు సంబంధించి 7 కేసుల్లో నిందితులైన ఐదుగురికి కమల్‌నాథ్ ఆశ్రయం కల్పించారు. గతేడాది నేనుచేసిన విజ్ఞప్తి మేరకు స్పందించిన హోంశాఖ, తాజా సాక్ష్యాల ఆధారంగా మళ్లీ విచారణ జరిపేందుకు వీలుగా కేసు నంబర్ 601/84ను రీ–ఓపెన్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇది అకాలీదళ్ సాధించిన విజయమే. ఈ కేసును మళ్లీ విచారించనున్న సిట్‌కు ధన్యవాదాలు. సిక్కులను కమల్‌నాథ్ చంపుతుండగా చూసిన సాక్షులు ధైర్యంగా ముందుకు రండి. భయపడాల్సిన పనిలేదు. కమల్‌నాథ్ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు ముక్తియార్ సింగ్, సంజయ్ సూరీ సిట్ ముందు హాజరై తమ వాంగ్మూలాలు ఇచ్చేందుకు అంగీకరించారు. త్వరలోనే కమల్‌నాథ్ అరెస్ట్ అవుతారు. కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌కు పట్టిన గతే(యావజ్జీవ శిక్ష) కమల్‌నాథ్‌కు పడుతుంది. ’ అని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వెంటనే కమల్‌నాథ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలనీ, విచారణ నిష్పక్షపాతంగా సాగేందుకు సహకరించాలని మన్జిందర్ సింగ్ కోరారు. కమల్‌నాథ్‌ను వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ డిమాండ్ చేశారు. అసలేం జరిగింది? అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో దాక్కున్న ఖలిస్తాన్ ఉగ్రవాది జర్నైల్‌సింగ్ బింద్రన్‌వాలేను పట్టుకునేందుకు ప్రధాని ఇందిర ఆదేశాలతో ఆర్మీ ‘ఆపరేషన్ బ్లూస్టార్’ను చేపట్టింది. ఆపరేషన్‌లో స్వర్ణ దేవాలయం తీవ్రంగా దెబ్బతినడం, ఆర్మీ బూట్లతో ఆలయంలోకి వెళ్లడంతో ఈ చర్యను తమ మతంపై దాడిగా సిక్కులు భావించారు. ఈ క్రమంలో 1984, అక్టోబర్ 31న సిక్కు మతస్తులైన సొంత బాడీగార్డులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఇందిరాగాంధీని కాల్చిచంపారు. దీంతో దేశవ్యాప్తంగా సిక్కు మతస్తులు లక్ష్యంగా అల్లరిమూకలు దాడులకు తెగబడ్డాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ అల్లర్లలో దేశవ్యాప్తంగా 3,500 మంది సిక్కులు చనిపోగా, ఒక్క ఢిల్లీలోనే 2,800 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ ఢిల్లీలోని రాకాబ్‌గంజ్ గురుద్వారా వద్ద కమల్‌నాథ్ నేతృత్వంలో విధ్వంసానికి దిగిన అల్లరిమూక ఇద్దరు సిక్కులను చంపేసింది. ఈ ఘటనపై 2000లో బీజేపీ ప్రభుత్వం నానావతి కమిషన్‌ను నియమించింది. ఈ సందర్భంగా కమిషన్ ముందు విచారణకు హాజరైన కమల్‌నాథ్.. ‘ఆ రోజున నేను ఘటనాస్థలిలోనే ఉన్నా. ఆవేశంతో ఊగిపోతున్న అల్లరిమూకను శాంతింపజేసేందుకు ప్రయత్నించా’ అని వాంగ్మూలమిచ్చారు. చివరికి నానావతి కమిషన్ ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కమల్‌నాథ్‌ను ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద విడిచిపెట్టింది. తాజాగా ఈ కేసులో కమల్‌నాథ్ పాత్రకు సంబంధించి కొత్త ఆధారాలున్నాయని భావించిన కేంద్రం, కేసును రీ–ఓపెన్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. -
వివాదాస్పదమైన టైట్లర్ హాజరు
న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా షీలా దీక్షిత్ బాధ్యతలు స్వీకరించిన వేడుకకు ఆ పార్టీ సీనియర్ నేత జగదీశ్ టైట్లర్ హాజరు కావడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల సాక్షులను బెదిరించేందుకే టైట్లర్‌ను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించిందని శిరోమణి అకాళీదళ్ నేత, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ జనరల్ సెక్రటరీ మజిందర్ సింగ్ సిర్సా మండిపడ్డారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంచిన జగదీశ్ టైట్లర్‌ను షీలా దీక్షిత్ మళ్లీ పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించి ఆయనకు అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని సిర్సా తీవ్రంగా విమర్శించారు. ‘‘1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన కేసులో సాక్షులను జగదీశ్ టైట్లర్ భయపెట్టారన్న సంగతి బహిరంగ రహస్యమే. అటువంటి వ్యక్తికి కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు. ఈ అల్లర్లకు సంబంధించి జగదీశ్ టైట్లర్ తోపాటుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు కూడా జైలు శిక్ష పడుతుంది. సిక్కు అల్లర్ల కేసులో సాక్షులను బెదిరించేందుకు, టైట్లర్‌కు అధిష్టానం మద్దతు మెండుగా ఉందన్న సందేశాన్ని తెలియచెప్పేందుకే కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరించింది’’అని ఆయన తన ట్విటర్లో పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ బుధవారం బాధ్యతల్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు కరణ్‌సింగ్, జనార్దన్ ద్వివేది, మీరా కుమార్, పీసీ చాకో, సందీప్ దీక్షిత్, అజయ్ మాకెన్‌తో పాటుగా పార్టీ ఇతర ముఖ్యనేతలు కూడా హాజరయ్యారు. అయితే జగదీశ్ టైట్లర్‌ను ఆహ్వానించడాన్ని షీలా దీక్షిత్ సమర్థించుకున్నారు. ‘ఆయన ఎందుకు రాకూడదు? ఆయనను ఇక్కడ మేము గౌరవించుకున్నామ’ని ఆమె వ్యాఖ్యానించారు. ఇందిర నుంచి రాహుల్ గాంధీ వరకు టైట్లర్ వారికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారని కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ పేర్కొన్నారు. దీన్ని బట్టే సిక్కుల పట్ల కాంగ్రెస్ వైఖరి అర్థమవుతుందన్నారు. -
‘కేజ్రీవాల్ 18 వజ్రాలు’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బలంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని దెబ్బకొట్టేందుకు బీజేపీ-అకాళీదళ్ ప్రభుత్వం 18 మంది ఆప్ కళంకిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతల చర్యలను ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశ రాజధాని నగరంలో ‘పోల్ ఖోల్ యాత్ర’ను ప్రారంభించింది. బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, పంజాబ్ డిప్యూటీ సీఎం సలహాదారు మన్జిందర్ సింగ్ సిర్సా, ఆ పార్టీ నేతల నేతృత్వంలో.. ఆటోలపై ఆప్ కళంకిత నేతల చిత్రాలు, వారి చర్యలను వివరిస్తూ ‘కేజ్రీవాల్ 18 వజ్రాలు’ అంటూ ప్రచారం ప్రారంభించింది. క్లీన్, అవినీతి రహిత పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ప్రజలకు చేసిందేమి లేదని సిర్సా విమర్శించారు. నేరచరితులకు టిక్కెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేశారని, వీరు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్ లో వీడియో తీసి విమర్శలపాలైన ఆప్ ఎంపీ భగవంత్ మాన్ ను వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్చాలని సూచించారు.