‘కేజ్రీవాల్ 18 వజ్రాలు’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బలంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని దెబ్బకొట్టేందుకు బీజేపీ-అకాళీదళ్ ప్రభుత్వం 18 మంది ఆప్ కళంకిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతల చర్యలను ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశ రాజధాని నగరంలో ‘పోల్ ఖోల్ యాత్ర’ను ప్రారంభించింది. బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, పంజాబ్ డిప్యూటీ సీఎం సలహాదారు మన్‌జిందర్ సింగ్ సిర్సా, ఆ పార్టీ నేతల నేతృత్వంలో.. ఆటోలపై ఆప్ కళంకిత నేతల చిత్రాలు, వారి చర్యలను వివరిస్తూ ‘కేజ్రీవాల్ 18 వజ్రాలు’ అంటూ ప్రచారం ప్రారంభించింది.
క్లీన్, అవినీతి రహిత పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ప్రజలకు చేసిందేమి లేదని సిర్సా విమర్శించారు. నేరచరితులకు టిక్కెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేశారని, వీరు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్ లో వీడియో తీసి విమర్శలపాలైన ఆప్ ఎంపీ భగవంత్ మాన్ ను వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్చాలని సూచించారు.