
ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ: పదకొండు రోజుల సస్పెన్స్‌కు తెర పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. కొన్నాళ్లుగా ముఖ్యమంత్రులుగా కొత్త ముఖాలకు అవకాశమిస్తున్న ఆనవాయితీని ఢిల్లీ విషయంలోనూ బీజేపీ అధిష్టానం కొనసాగించింది. అంతటితో ఆగకుండా ఓ మహిళకు పట్టం కడుతూ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 50 ఏళ్ల రేఖా గుప్తాను సీఎంగా ఎంచుకుంది.
సుష్మా స్వరాజ్ (బీజేపీ), షీలా దీక్షిత్ (కాంగ్రెస్), ఆతిశి (ఆప్) తర్వాత ఆమె ఢిల్లీకి నాలుగో మహిళా సీఎం కానున్నారు. మదన్‌లాల్ ఖురానా, సుష్మ, సాహెబ్‌సింగ్ వర్మ తర్వాత రాష్ట్రానికి మొత్తమ్మీద నాలుగో బీజేపీ సీఎం కూడా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రస్తుతం మహిళలెవరూ సీఎంగా లేరు. దాంతో ఆ పార్టీ నుంచి ఏకైక మహిళా ముఖ్యమంత్రిగానూ రేఖ నిలవనున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే మమతా బెనర్జీ తర్వాత రెండో మహిళా సీఎం అవుతారు. గురువారం సాయంత్రం రాంలీలా మైదానంలో అట్టహాసంగా జరిగే బహిరంగ సభలో రేఖ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో పాటు సినీ, పారిశ్రామిక ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేఖకు అమిత్ షా అభినందనలు తెలిపారు. రాజధాని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆమె నాయకత్వంలో నూతన బీజేపీ ప్రభుత్వం రేయింబవళ్లూ కృషి చేస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. తాజా మాజీ సీఎం ఆతిశితో పాటు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా రేఖకు అభినందనలు తెలిపారు.
పర్వేశ్ అనుకున్నా...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి ఆప్ పదేళ్ల పాలనకు తెర దించడం తెలిసిందే. రాష్ట్రంలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అధికారం చేపట్టబోతోంది. మాజీ సీఎం సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మకు సీఎంగా చాన్స్ దక్కుతుందని తొలుత భావించారు. కేజ్రీవాల్‌ను ఓడించి జెయింట్ కిల్లర్‌గా నిలవడంతో ఆయన పేరు మార్మోగింది. కానీ క్రమంగా పలువురు ఇతర నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈసారి మహిళకే అవకాశమని కొద్ది రోజులుగా బీజేపీ నేతలే చెబుతుండటంతో రేఖ పేరు ప్రముఖంగా విన్పించింది. చివరికదే నిజమైంది. బుధవారం సాయంత్రం ఢిల్లీ బీజేపీ శాసనసభా పక్ష భేటీ జరిగింది. రేఖను శాసనసభా పక్ష నేతగా పర్వేశ్ వర్మ తదితర సీనియర్లు ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం ఎల్పీ భేటీకి పరిశీలకులుగా వచ్చిన బీజేపీ అగ్ర నేతలు రవిశంకర్ ప్రసాద్ తదితరులతో కలిసి రేఖ రాజ్‌నివాస్‌కు వెళ్లారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వెలిబుచ్చారు.
‘‘నాకు అవకాశమిచ్చినందుకు ప్రధాని మోదీకి, బీజేపీ నాయకత్వానికి, అగ్ర నేతలకు కృతజ్ఞతలు. ఢిల్లీ సమగ్రాభివృద్ధికి సంక్షేమానికి పూర్తి నిజాయితీతో, చిత్తశుద్ధితో కృషి చేస్తా. నగరాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తా’’
– రేఖా గుప్తా
..అలా కలిసొచ్చింది!
రేఖా గుప్తాను వరించిన అదృష్టం
కలిసొచ్చిన బనియా సామాజికవర్గం
ఏబీవీపీతో రాజకీయ ప్రస్థానం మొదలు
ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గిన రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా ఎంచుకోవడం ద్వారా బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంతోమంది సీనియర్లున్నా చాలా సమీకరణాలు ఆమెకు అనుకూలించాయి. మహిళ కావడంతో పాటు వైశ్య (బనియా) సామాజికవర్గం కూడా కలిసొచ్చింది. ఆప్ అధినేత కేజ్రీవాల్‌ది కూడా బనియా సామాజికవర్గమే. ఇక ఆ పార్టీకి చెందిన మహిళా నేత ఆతిశి తాజా మాజీ సీఎం. రేఖ ఎంపిక వెనక ఈ రెండు అంశాలనూ బీజేపీ అధిష్టానం దృష్టిలో ఉంచుకున్నట్టు కన్పిస్తోంది. పార్టీ పట్ల తిరుగులేని విధేయత వీటికి తోడైంది.
మహిళల్లో మరింత ఆదరణ కోసం...
ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఓట్లేశారు. పురుషుల ఓట్లపై అధికంగా ఆధారపడ్డ ఆప్ పరాజయం పాలవగా మహిళల ఆదరణే తమకు అధికారం అందించిందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అందుకే మహిళను సీఎం చేసి వారి రుణం తీర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి 9 మంది మహిళలు పోటీ చేయగా నలుగురు గెలిచారు.
ఆరెస్సెస్‌తో బంధం
50 ఏళ్ల రేఖ వివాదాలకు సుదూరం. ఆర్‌ఎస్‌ఎస్‌తో ఆమెది సుదీర్ఘ అనుబంధం. 1974 జూలై 19న హరియా ణాలో జన్మించారు. ఢిల్లీలోని దౌలత్‌రామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేస్తుండగానే ఏబీవీపీలో చేరారు. ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలతో ఏబీవీపీ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేశారు. విద్యార్థి సంఘం కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా పనిచేశారు. తర్వాత న్యాయ విద్య అభ్యసించి కొంతకాలం అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. 2002లో బీజేపీలో చేరి యువజన విభాగం జాతీయ కార్యదర్శి సహా పలు హోదాల్లో పని చేశారు. మూడుసార్లు ఢిల్లీ కౌన్సిలర్‌గా గెలిచారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ) మేయర్‌గా సేవలందించారు. మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కృషి చేశారు. బాలికల విద్య కోసం సుమేధ యోజన ప్రారంభించారు. 2022లో ఢిల్లీ మేయర్ పదవికి పోటీ పడి ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ చేతిలో ఓడారు. ప్రస్తుతం రేఖ బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు. అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్‌బాగ్ నుంచి 29,595 వేల ఓట్ల మెజార్టీతో ఆప్ అభ్యర్థిపై గెలిచారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment