
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రెబల్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా షాకిచ్చారు. అసెంబ్లీకి తక్కువ హాజరు అయ్యారంటూ కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా సోమవారం ఢిల్లీ హైకోర్టులో కపిల్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. తాగునీటి శాఖను తన వద్దే ఉంచుకున్న కేజ్రీవాల్.. ఆ సమస్యను పరిష్కరించటంలో ఘోరంగా విఫలం అయ్యారని, అంతేకాకుండా అసెంబ్లీ సెషన్స్‌ను ఎగ్గొడుతూ.. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నారని కపిల్ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
‘ముఖ్యమైన అంశాలపై చర్చించే సమయంలో పట్టుమని పది నిమిషాలు కూడా ఆయన అసెంబ్లీలో లేరు. 2017 నుంచి ఇప్పటిదాకా 27 అసెంబ్లీ సెషన్స్ జరగ్గా.. ఏడింటికి మాత్రమే కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈయనేం ముఖ్యమంత్రో అర్థం కావట్లేదు. ప్రజా సమస్యలపట్ల ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమయ్యేందుకు ఇదే ఉదాహరణ. దయచేసి.. ఆయన(కేజ్రీవాల్) అసెంబ్లీ రికార్డులను ఓసారి క్షుణ్ణంగా పరిశీలించండి. అంతేకాదు నియోజకవర్గాల్లో ఆయన ఎన్నిసార్లు పర్యటించారో.. ప్రజల దగ్గరి నుంచి ఎన్ని విజ్ఞప్తులు పరిశీలించారో ఆరా తీయండి. ఆయన ఆస్తుల వివరాలను కూడా ఓసారి పరిశీలించండి’ అని కపిల్ పిటిషన్‌లో న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
కాగా, ఈ పిటిషన్‌ను బెంచ్ అత్యవసరంగా స్వీకరించగా.. మంగళవారం విచారణకు రానుంది. మరోవైపు ఈ పిటిషన్‌పై ఆప్ మాత్రం గప్‌చుప్‌గా ఉంది.