సుధామూర్తి తొలి స్పీచ్‌..ప్రధాని ప్రశంసలు | PM Modi Lauds Sudha Murthy Over Her Rajya Sabha Debut Speech On Women Health, More Details Inside | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో ఎంపీ సుధామూర్తి తొలి స్పీచ్‌.. ప్రధాని ప్రశంసలు

Published Wed, Jul 3 2024 4:52 PM | Last Updated on Wed, Jul 3 2024 5:48 PM

PM Modi Lauds Sudha Murthy

న్యూఢిల్లీ: పుస్తక రచయిత్రి, దాత, ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ఎంపీగా రాజ్యసభలో తొలిసారి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్యం అంశంపై ఆమె ప్రసంగించారు. దీనిపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. బుధవారం(జులై 3) ఎగువసభకు వచ్చిన ఆయన సుధామూర్తికి కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఇటీవలే సుధామూర్తి  రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం  మూడోసారి ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆమె  సభలో మాట్లాడారు. 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలకు సర్వైకల్ వ్యాక్సిన్‌ ఇస్తారని తెలిపారు. ఆ వ్యాక్సిన్‌ను తీసుకుంటే క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చన్నారు. 

చికిత్స కంటే నివారణే  మేలని చెప్పారు. ఈసందర్భంగా తన తండ్రి చెప్పిన మాటలను సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి అది తీరని లోటు అన్నారు. కొవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించామని,  ఆ అనుభవంతో సర్వైకల్‌ వ్యాక్సిన్‌ను బాలికలకు అందించడం సులభమన్నారు. 

దీంతోపాటు వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రసంగించారు. దేశానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటే ఆదాయం పెరుగుతుందని సూచించారు. సుధామూర్తి చేసిన ఈ ప్రసంగంపై ప్రధాని స్పందించారు. మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా మాట్లాడిన సుధామూర్తిజీకి కృతజ్ఞతలని అన్నారు. 

గత పదేళ్లకాలంలో ప్రభుత్వం మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టిసారించిన విషయాన్ని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసిందని, గర్భిణీలకు వ్యాక్సినేషన్‌ తీసుకువచ్చామని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement