న్యూఢిల్లీ: రానున్న త్రైమాసికాలలో రుణ చెల్లింపులను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు డైవర్సిఫైడ్ గ్రూప్ వేదాంతా రీసోర్సెస్ తాజాగా స్పష్టం చేసింది. మైనింగ్, మెటల్, చమురు, గ్యాస్ రంగాలలో కార్యకలాపాలు విస్తరించిన గ్రూప్ ఆర్థిక పరిస్థితిపై ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని పాదుకొల్పే బాటలో 175 కోట్ల డాలర్ల రుణాలను పొందనున్నట్లు తెలియజేసింది. బ్యాంకుల నుంచి సిండికేట్, బైలేటరల్ రుణాలను అందుకునే సన్నాహాలు చివరి దశలో ఉన్నట్లు వెల్లడించింది. 2023 మార్చివరకూ అన్ని రుణాలనూ ముందస్తుగా చెల్లించినట్లు తెలియజేసింది.
ఈ బాటలో 11 నెలల్లో 200 కోట్ల డాలర్ల రుణ భారాన్ని తగ్గించుకున్నట్లు పేర్కొంది. రాను న్న ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అవసరమైన లిక్విడిటీని సమకూర్చుకోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. హిందుస్తాన్ జింక్(హెచ్‌జెడ్‌ఎల్)లో 6.8% వాటా మినహా ఎలాంటి తనఖాలూ లేవని వెల్లడించింది. అంతర్జాతీయ జింక్ ఆస్తుల విక్రయం లేదా 200 కోట్ల డాలర్ల నిధులను సమకూర్చుకోకుంటే వేదాంతా క్రెడిట్ రేటింగ్స్ ఒత్తిడిలో పడే వీలున్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ ఫిబ్రవరి నెల మొదట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేదాంతా తాజా వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment