వాషింగ్టన్: భారత్, అమెరికాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆకాంక్షించారు. వాణిజ్య, వ్యాపారాల్లో పెట్టుబడులను పెంచుకోవడానికి సంయుక్తంగా ఒక ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేసుకోవాలని కూడా నిశ్చయించారు. రెండు రోజుల పాటు మోదీ, ఒబామాల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ మేరకు ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి.
భారత్‌లో పునరుత్పాదక ఇంధన అభివృద్ధి ఏజెన్సీకి తక్కువ వడ్డీ రేటుతో అమెరికా ఎగ్జిమ్ బ్యాంక్ బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6,100 కోట్లు) రుణ సదుపాయం కల్పించనుంది. అదేవిధంగా దైపాక్షిక వాణిజ్యాన్ని ఇప్పుడున్న 100 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి 500 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచాలని కూడా ఇరు దేశాధినేతలు అంగీకరించారు.
‘స్థిరమైన, ప్రజలందరి భాగస్వామ్యంతో, ఉద్యోగకల్పనే లక్ష్యం గా దేశాభివృద్ధి, జీడీపీ వృద్ధి విషయంలో అమె రికా, భారత్ వ్యాపార రంగం కీలక పాత్ర పోషించనుందని మోదీ, ఒబామా ఒక నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చారు’ అని భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటన పేర్కొంది. సంస్థాగత ఇన్వెస్టర్లు, కార్పొరేట్ కంపెనీలతో పాటు ఇండో-యూఎస్ ఇన్వెస్ట్‌మెంట్ పోగ్రామ్‌ను కూడా కార్యరూపంలోకి తీసుకురానున్నారు. ఇరు దేశాల ఆర్థిక శాఖలు నేత్వత్వం వహిస్తాయి. మౌలిక ప్రాజెక్టులు, క్యాపిటల్ మార్కెట్ అభివృద్ధిపై ఇది ప్రధానంగా దృష్టిసారించనుంది.
ట్రేడ్ పాలసీ ఫోరమ్ ద్వారా భారత్, అమె రికాల్లో తయారీ రంగం, పెట్టుబడుల విషయంలో కంపెనీలకు ఆకర్షణీయ వ్యాపార వాతావరణాన్ని కల్పించేందుకు ఇరు పక్షాలు కృషిచేయనున్నాయి. అధునాతన తయారీ రంగంలో వినూత్న ఆవిష్కరణలు, కొత్త రంగాల్లో సహకారం కోసం వచ్చే ఏడాది ఆరంభంలో ప్రభుత్వ-ప్రైవేటు(కంపెనీలు) చర్యల ప్రక్రియను భారత్-అమెరికా చేపట్టనున్నాయి.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న యూఎస్- ఇండియా ఎకనమిక్ అండ్ ఫైనాన్షియల్ పార్ట్‌నర్‌షిప్ సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్లు మోదీ, ఒబామా తెలిపారు. ఇండియా-యూఎస్ సీఈఓ ఫోరమ్‌ను మళ్లీ పునరుత్తేజం చేయాలని కూడా మోదీ-ఒబామా అంగీకరించారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఫోరమ్ సదస్సుకు రెండోసారి ఆతిథ్యమిస్తామన్న భారత్ ప్రతిపాదనను కూడా స్వాగతించారు.
ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం.. 500 బిలియన్ డాలర్లు
Published Thu, Oct 2 2014 1:01 AM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM
Advertisement
Advertisement