అబుధాబిలో గౌరవవందనం స్వీకరిస్తున్న మోదీ; మోదీకి స్వాగతం పలుకుతున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ అల్‌నహ్యాన్
అబుధాబి: భారత్–యూఏఈ సంబంధాలు మరో కీలక మైలురాయికి చేరుకున్నాయి. వాణిజ్య చెల్లింపులను ఇకపై సొంత కరెన్సీలోనే చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఫ్రాన్సులో పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తిరుగు ప్రయాణంలో శనివారం యూఏఈ రాజధాని అబుదాబిలో ఆగారు. అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశమయ్యారు.
సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా) కుదిరిన ఏడాదిలోనే రెండు దేశాల మధ్య వాణిజ్యం 20 శాతం మేరకు పెరగడంపై నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం 85 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఏడాది సెపె్టంబర్‌లో ఢిల్లీలో జరిగే జీ20 భేటీ సమయానికి 100 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని ఆకాక్షించారు. వాణిజ్య చెల్లింపులను సొంత కరెన్సీలోనే చేపట్టాలని, ఇండియన్ యూనిఫైడ్ పేమెంట్స్ వ్యవస్థ(యూపీఐ)ను యూఏఈకి చెందిన ఇన్‌స్టంట్ పేమెంట్ ప్లాట్‌ఫాం(ఐపీపీ)తో అనుసంధానం చేయాలని అంగీకారానికి వచ్చారు.
రెండు దేశాల పేమెంట్స్ మెసేజింగ్ సిస్టమ్స్‌ను లింక్ చేసే విషయం పరిశీలించాలని కూడా నిర్ణయించారు. ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌ను యూఏఈలో ఏర్పాటు చేసే విషయమై రెండు దేశాల విద్యాశాఖాధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు. పరస్పర వాణిజ్య చెల్లింపులను భారత్ కరెన్సీ రూపాయి, యూఏఈ కరెన్సీ దిర్హంలో చేసేందుకు ఉద్దేశించిన ఎంవోయూపై రెండు దేశాల సెంట్రల్ బ్యాంకుల ప్రతినిధులు సంతకాలు చేశారని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య బలపడుతున్న ఆర్థిక సహకారం, పరస్పర విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు.
ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు కాప్28 అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న యూఏఈకి భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రధాని తెలిపారు. మరింత సుస్థిర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై కాప్28 అధ్యక్షుడిగా నియమితులైన సుల్తాన్ అల్ సబేర్‌తో చర్చించానన్నారు. కాప్28 వార్షిక సమావేశాలు దుబాయ్‌లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12వరకు జరగనున్నాయి. ఈ సమావేశాలకు మోదీని సబేర్ ఆహా్వనించారు. పర్యావరణ మార్పులకు గురైన దేశాలకు వాగ్దానం ప్రకారం 100 బిలియన్ డాలర్ల సాయం అందించాలని సంపన్న మోదీ, అల్ నహ్యాన్ సంయుక్త ప్రకటనలో కోరారు.
‘‘యూఏఈ అధ్యక్షునితో భేటీ సంతోషం కలిగించింది. అభివృద్ధిపై ఆయన దార్శనికత ప్రశంసనీయం. భారత్–యూఏఈ సంబంధాలపై సమగ్రంగా చర్చించాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. అంతకుముందు అబుధాబి అధ్యక్ష భవనం వద్ద నహ్యాన్ మోదీకి ఎదురేగి ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికారు. మోదీ సైనిక వందనం స్వీకరించారు. అనంతరం మోదీకి నహ్యాన్ విందు ఇచ్చారు. రాత్రికి ప్రధాని భారత్ చేరుకున్నారు. యూఏఈ సెంట్రల్ బ్యాంకుతో ఒప్పందం అన్ని లావాదేవీలకూ వర్తిస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. ‘‘పెట్టుబడులు, రెమిటెన్స్‌లకు దీనితో ఊతం లభిస్తుంది. యూఏఈలోని భారతీయులకు లావాదేవీల చార్జీలు తగ్గడమే గాక సమయం కూడా కలిసొస్తుంది’’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment