న్యూఢిల్లీ: భారత పర్యటన సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పరమత సహనం, వ్యక్తిగత మత విశ్వాసాల హక్కుల ఆవశ్యకతను భారత ప్రధాని మోదీతోనూ గతంలో ప్రస్తావించానని చెప్పారు. భారతీయ ముస్లింలు మొదట తాము భారతీయులమనే భావిస్తారని ప్రశంసించారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో, ఆ తరువాత ఒబామా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలోనూ ప్రసంగించారు. ఆ తర్వాత మోదీని కలుసుకున్నారు. భిన్న సంస్కృతులకు నిలయమైన భారత్‌ను మత ప్రాతిపదకన విభజించొద్దని సదస్సులో ఒబామా అన్నారు. ఇక్కడి ముస్లిం లు తాము భారతీయులమనే భావిస్తారని, ఈ నిజాన్ని మనసులో ఉంచుకోవాలన్నారు.
మోదీతోనూ ప్రస్తావించా..
‘ఓ దేశం మత ప్రాతిపదికన విడిపోవొద్దు. ఇదే విషయాన్ని మోదీకి, అమెరికా ప్రజలకు చెప్పా’ అని ఒబామా తెలిపారు. ‘2015లో భారత్‌కొచ్చినపుడు మోదీతో ఈ విషయమై మాట్లాడానన్నారు. ఆ సందర్భంలో మోదీ ఎలా స్పందించారని ప్రశ్నించగా, ఒబామా సూటిగా సమాధానం ఇవ్వకుండా.. ఆ వ్యక్తిగత సంభాషణలను వెల్లడించడం తనకిష్టం లేదన్నారు. ‘ఇతర దేశాలకు భిన్నంగా భారత్‌లో ముస్లిం వర్గం ఎన్నో విజయాలు సాధించింది. తమను తాము భారతీయులుగా పరిగణిస్తూ ఈ దేశంలో అంతర్భాగంగా ఉంది’ అని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రధాని కార్యాలయమో, అధ్యక్షుడి కార్యాలయమో ముఖ్యమైనవి కావని, ఓ రాజకీయ పార్టీకి మద్దతు తెలిపి ఏ సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నానని తనను తాను ప్రశ్నించుకునే పౌరుడే కీలకమని పేర్కొన్నారు. ఓ నాయకుడు ఏదైనా చేయకూడనిది చేస్తుంటే, దాన్ని సమర్థిస్తున్నానో లేదో పౌరుడు ప్రశ్నించుకోవాలని సూచించారు. మత సామరస్యం గురించి తాను చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా చేసినవి కావని, అమెరికా, యూరోప్‌ల్లోనూ పలు సందర్భాల్లో ఇవే విషయాలను చెప్పానని వివరణ ఇచ్చారు.
ఆ విషయం పాక్‌కు తెలియదేమో...
9–11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ పాక్‌లోనే దాక్కున్న సంగతి ఆ దేశానికి తెలుసని నిరూపించే ఆధారాలు అమెరికా వద్ద లేవని ఒబామా అన్నారు. 2008లో ముంబైలో దాడుల తర్వాత ఉగ్ర స్థావరాలను నిర్మూలించాలని భారత్‌లాగే అమెరికా కూడా బలంగా కోరుకుందని, భారత్‌కు తమ నిఘా అధికారుల సేవలు అందించామని పేర్కొన్నారు.
ట్వీట్ చేసేముందు జాగ్రత్త...
సోషల్ మీడియా శక్తి ఏంటో తెలుసుకున్నాకే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ట్వీట్లు, కామెంట్లు చేయాలన్నారు. టైపింగ్, స్పెల్లింగ్ దోషాలు ఎక్కువగా చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ...‘పోస్ట్ చేసే ముందు నేను స్పెల్లింగ్, విరామ చిహ్నాలను సరిచూసుకుంటా. జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించాల్సిన అవసరం రాదు’ అని అన్నారు. పర్యావరణ మార్పు ఓ బూటకమని ట్రంప్ చేసిన ట్వీట్‌ను గుర్తుచేస్తూ.. కీలక విషయాలపై బాధ్యతా రాహిత్యంగా ట్వీట్ చేస్తే చర్చలకు తలుపులు మూసుకుపోతాయన్నారు. ప్రతి మీడియా సంస్థ తనదైన అభిప్రాయాలతో పనిచేస్తోందని అన్నారు.
యువ నాయకుల శిక్షణపై దృష్టిసారిస్తా...
21వ శతాబ్దపు భాగస్వామ్యాన్ని నిర్ణయించేది భారత్–అమెరికాల సంబంధాలే అని ఒబా మా పేర్కొన్నారు. అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా యువ నాయకులకు శిక్షణ ఇవ్వడంపైనే ఇకపై దృష్టిపెడతానన్నారు. యువత ఎక్కువగా ఉన్న భారత్‌లోనే తనకు ఎక్కువ పని ఉంటుందని తెలిపారు. కాగా, బరాక్ ఒబామాను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం కలుసుకున్నారు. ఒబామాను మరోసారి కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ఆ తరువాత రాహుల్ ట్వీట్ చేశారు.
పప్పు బాగా చేస్తా...
యువకుడిగా ఉన్నప్పుడు తనకు రూమ్ మేట్లుగా భారతీయులు, పాకిస్తానీయులు ఉండేవారని, వారి తల్లుల నుంచి పప్పు వండటం నేర్చుకున్నానని ఒబామా చెప్పారు. ఇప్పుడు తాను పప్పు బాగా చేస్తానని తెలిపారు. కీమా బాగానే వండుతానని, చపాతీలు చేయడం రాదని చెప్పారు . ‘ బుధవారం రాత్రి ఓ డిన్నర్‌కు వెళ్లా. అక్కడ పప్పు కూడా వడ్డిస్తున్నారు. దాని గురించి నాకు కొందరు వివరించే ప్రయత్నం చేశారు. కానీ నాకు పప్పు చేయడం వచ్చని, నా రూమ్‌మేట్ల తల్లుల నుంచి నేర్చుకున్నానని వారికి చెప్పా. పప్పు వండటం నేర్చుకున్న తొలి అమెరికా అధ్యక్షుడిని నేనే అనుకుంటున్నా’ అని ఒబామా సరదాగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment