ఆసియా వర్తక సామ్రాజ్యంలో చైనాకు భంగపాటు ఎదురైంది. భారత్‌లాంటి దేశంతో ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనాను వెనక్కి నెట్టేసి మరీ అమెరికా ముందుకు వచ్చేసింది. ఈ ఏడాది తొమ్మిది నెలల కాలానికి గానూ భారత్-అమెరికా మధ్య వాణిజ్యం గతంలో కంటే సగానికి సగం పెరగడం విశేషం.
భారత వాణిజ్య విభాగం నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. జనవరి-సెప్టెంబర్ మధ్య అమెరికాతో భారత్ వాణిజ్య సంబంధాలు మరింత మెరుగయ్యాయి. ఇరుదేశాల మధ్య గతంలో కంటే 50 శాతం పెరిగి.. 28 బిలియన్ డాలర్ల విలువ మేర వర్తకం పెరిగింది. అదే సమయంలో చైనాతో ఒప్పందం స్వల్ఫ పతనం అయినట్లు తెలుస్తోంది. 46 శాతంతో 25.3 బిలియన్ డాలర్ల మేర విలువైన వర్తకాల పెరుగుదల కనిపించింది.
అయితే తొలి భాగంలోనే మాత్రం డ్రాగన్ దూకుడే కనిపించింది. ముఖ్యంగా ఏప్రిల్-జులై(రెండో క్వార్టర్) మధ్యకాలంలో అమెరికాతో(36.5 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే.. చైనా( 36.6 బిలియన్ డాలర్లు) కొంత మెరుగ్గా ఉండడం విశేషం. అదే సమయంలో ఆస్ట్రేలియా(85 శాతం), యూఏఈ(67 శాతం), బెల్జియం(80 శాతం)తోనూ భారత ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మెరుగయ్యాయి. దక్షిణాఫ్రికాతో 91 శాతం పెరిగింది. నిత్యావసరాల ధరల పెంపు కారణంగా ఆసియా దేశాలతో భారత్ సంబంధాలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఇండోనేసియాతో 6.1 బిలియన్ డాలర్లు, థాయ్‌లాండ్‌తో 60 శాతం వర్తకం పెరిగి 3.8 బిలియన్ డాలర్ల విలువైన వర్తకం పెరిగింది.
భారత్-చైనా అధికారిక ఏజెన్సీల నుంచి సేకరించిన వాణిజ్య డేటా ప్రకారం.. ఈ సంవత్సరం జనవరి-జూన్ కాలంలో రెండు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు 65 శాతానికి పైగా పెరిగాయి.
సెంచరీ ఖాయం!
బాయ్‌కాట్ చైనా ప్రొడక్ట్స్, ‘ఆత్మ నిర్భర్’ నినాదాలు ఈ ఏడాది కూడా పెద్దగా వర్కవుట్ అయినట్లు కనిపించడం లేదు. భారత్-చైనా మధ్య కోట్ల డాలర్ల విలువైన వ్యాపారం నడుస్తోంది. పైగా ఈ ఏడాది వందల బిలియన్ మార్క్‌ను దాటేసే సూచనలు కనిపిస్తున్నాయి. మూడో క్వార్టర్ ముగిసేసరికి 90 బిలియన్ డాలర్ల వర్తకం జరగడం విశేషం. గత బుధవారం చైనా వాణిజ్య పన్నుల శాఖ విడుదల చేసిన నివేదికలోనూ ఈ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. చైనా నుంచి ఇప్పటిదాకా సుమారు 68.3 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తుల్ని భారత్ దిగమతి చేసుకోగా.. అదే సమయంలో భారత్ నుంచి 21.9 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల్ని చైనా దిగుమతి చేసుకుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కరోనా ముందు పరిస్థితులతో పోలిస్తే ఈ వాణిజ్య సంబంధం మరింతగా పెరగడం. ఐరన్ ఓర్, ఇతరత్ర రా మెటీరియల్‌ను చైనా దిగుమతి చేసుకుంటుండగా, మెకానికల్, ఎలక్ట్రానిక్ గూడ్స్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, వీటికి కంటే మెడికల్ సప్లైలు గత రెండేళ్లలో భారత్ దిగుమతి చేసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment