వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.10 వేల కోట్లు
నాబార్డు సీజీఎం జీజీ మమెన్
ఏలూరు : రాష్ట్రంలో వ్యవసాయ, పంట ఉత్పత్తుల కోసం సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులకు 2014-15లో రూ.10 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ జీజీ మమెన్ అన్నారు. ఏలూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 500 సహకార సంఘాలకు టర్మ్‌లోన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రైతులకు ప్రోత్సహిం చడంతో పాటు చైతన్యపరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,500 కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు.
రుణమాఫీతో బ్యాంకింగ్ వ్యవస్థ చిన్నాభిన్నం
రుణమాఫీని ప్రోత్సహించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని, ప్రతి ఒక్కరూ రుణం రద్దువుతుందనే ఆలోచనలో ఉంటే బ్యాంకు కార్యకలాపాలు ఎలా సాగుతాయని ఆయన ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న రైతులకు మాఫీ చేయడం సమంజసం కాని తరచూ రుణమాఫీలు చేయడం సరికాదన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకు న్న దృష్ట్యా రిజర్వ్ బ్యాంకు నిర్ణయానికి అనుగుణంగా తాము దీనిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
డీసీసీబీ పనితీరు సంతృప్తికరం
జిల్లా సహకార బ్యాంకు పనితీరు సంతృప్తికరంగా ఉందని మమెన్ అన్నారు. డిపాజిట్ల సేకరణలో గ్రామీ ణ సహకార సంఘాలు అగ్రస్థానంలో ఉండాలని, ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా లో వ్యవసాయాభివృద్ధికి నాబార్డు సాయంపై ఈనెల 30లోగా ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు.
లాభాల బాటలో 233 సొసైటీలు
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 253 సొసైటీలకుగాను 233 లాభాల బాటలో ఉన్నాయన్నారు. ప్రతి ఏటా రూ.70 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు సొసైటీల ద్వారా బంగారంపై వ్యవసాయ రుణాలు ఇస్తున్నామని చెప్పారు. అనంతరం మమెన్‌ను దుశ్శాలువాతో సత్కరించారు. డీ సీసీబీ సీఈవో వీవీఎన్ ఫణికుమార్ మాట్లాడుతూ తమ బ్యాంకు గతేడాది రూ.1.68కోట్ల లాభం ఆర్జిస్తే ఈ ఏడాది రూ.3 కోట్లపైబడి లాభం రావచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అనంతరం రైతు చైతన్య కరపత్రాలను మమెన్ విడుదల చేశారు. డీసీసీబీ ఉపాధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, డెరైక్టర్లు అమృతమ్మ, డీసీసీబీ జీఎం మాధవి, కె.శ్రీనివాస్, డీజీఎం శ్రీదేవి, రమణమ్మ, ఐసీడీపీ పీవో పాల్గొన్నారు.
అనుబంధ రంగాలకు చేయూత
జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలకు నాబార్డు చేయూతనందిస్తుందని సీజీఎం జీజీ మమెన్ అన్నారు. స్థానిక వైభవ్ అపార్ట్‌మెంట్స్‌లో నాబార్డు కార్యాల యాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల అధికారులతో, బ్యాంకర్లతో సమన్వయంగా పనిచేసి సమగ్ర వ్యవసాయాభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. ఆంధ్రా బ్యాంకు డీజీఎం నాగరాజునాయుడు, ఎల్‌డీఎం ఎం.లక్ష్మీనారాయణ, నాబార్డు ఏజీఎం హరిగోపాల్, వ్యవసాయశాఖ జేడీ వి.సత్యనారాయణ, పశుసంవర్ధకశాఖ జేడీజ్ఞానేశ్వర్, మత్స్యశాఖ డీడీ వి.కృష్ణమూర్తి, డీసీసీబీ సీఈవో వీవీఎన్ ఫణికుమార్, ఉద్యానశాఖ ఏడీ సుజాత పాల్గొన్నారు.