crop production
-
వార్షిక రుణ ప్రణాళిక రూ.7,800 కోట్లు
సంగారెడ్డి టౌన్: 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.7,800 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించినట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2023–24 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను అదనపు కలెక్టర్ వీరారెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయం, వాణిజ్యం, విద్య, గృహ రుణాలు, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక రంగాలకు రూ.6,565 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,235 కోట్లు కేటాయించామన్నారు. ఈ ప్రణాళికలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని, సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్ కోసం రైతులకు పంట రుణాలు ఇవ్వనున్నామన్నారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు, టర్మ్ రుణాలకు రూ. 4,147 కోట్లు, సూక్ష్మ సంస్థలకు రూ. 516.60 కోట్లు, చిన్న సంస్థలకు రూ.167.40 కోట్లు, మధ్యతరహా సంస్థలకు రూ. 326 కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించామన్నారు. ఎంఎస్ఎంఈ కింద మొత్తం రూ.1,010 కోట్ల రుణాలివ్వడం లక్ష్యమని చెప్పారు. విద్యా రుణాలు కింద రూ.85 కోట్లు, గృహ రుణాలు రూ. 1,270 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 46 కోట్లు, పునరుత్పాదక శక్తి కింద రూ.7 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,235 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని స్పష్టం చేశారు. ఆయా రంగాలకు బ్యాంకర్లు సహకరించి జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. అంతకుముందు 2022–23(మార్చి 31 నాటికి) వార్షిక రుణ ప్రణాళికలో సాధించిన లక్ష్యాలను ఎల్డీఎం గోపాల్ రెడ్డి వివరించారు. ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు సంబంధించి రూ.7080.80 కోట్ల లక్ష్యం కాగా 10,269.42 కోట్ల రుణాలు అందించి 145 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారికి, బ్యాంకర్లకు కోఆర్డినేషన్ అవసరమని అన్నారు. ఏఈఓ వారీగా గ్రామం, బ్యాంకు బ్రాంచ్, పంట రుణాల టార్గెట్, సాధించిన లక్ష్యాల వివరాలు అందించా లని సూచించారు. అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పథకంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ గోపాల్ రెడ్డి, నాబార్డ్ ఏజీఎం కష్ణ తేజ, ఆర్బీఐ ఏజీఎం అలీ బాబా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, మెప్మా పీడీ, జిల్లా వ్యవసాయ అధికారి, సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకర్స్ పాల్గొన్నారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలి సంగారెడ్డి టౌన్: జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందీ కలగకూడదని అదనపు కలెక్టర్ వీరారెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వ్యవసాయ, పంచాయితీ, అటవీ, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, ఏపీవోలు ఏఈవోలు పాల్గొన్నారు. -
AP: ఉత్పత్తి అదిరింది.. ఆర్బీఐ నివేదిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ పంట పండింది. గత సీజన్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో అన్ని ప్రధాన పంటల ఉత్పత్తి, దిగుబడిలో వృద్ధి నమోదైంది. 2021–22 కన్నా 2022–23లో ధాన్యం, ముతక, చిరు ధాన్యాలు, పప్పులు, నూనెగింజల ఉత్పత్తితో పాటు దిగుబడిలోనూ పెరుగుదల నమోదైనట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. దేశంలో గత ఖరీఫ్‌లో (2021–22) వ్యవసాయ ఉత్పత్తుల నాల్గవ ముందస్తు అంచనాలు, 2022–23 ఖరీఫ్ మొదటి ముందస్తు అంచనాలతో ఆర్బీఐ ఈ నివేదికను విడుదల చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో ప్రధాన పంటల ఉత్పత్తి, దిగుబడి, విస్తీర్ణంలో ఏ రాష్ట్రంలో ఎంతమేర వృద్ధి నమోదైందో ఈ నివేదికలో ఆర్బీఐ విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజస్థాన్, ఒడిశా, పంజాబ్, గుజరాత్, హరియాణా, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే ధాన్యం ఉత్పత్తి గత ఖరీఫ్ కన్నా ఈ ఖరీఫ్‌లో పెరిగింది. మిగతా రాష్ట్రాల్లో క్షీణత నమోదైంది. జాతీయ స్థాయిలో కూడా గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో ధాన్యం ఉత్పత్తిలో 6.1 శాతం క్షీణత నమోదైంది. ఈ ఖరీఫ్‌లో మధ్యప్రదేశ్‌లో అత్యధికంతా ధాన్యం ఉత్పత్తి 46 శాతం వృద్ధి నమోదైంది. ఆ తరువాత రాజస్థాన్‌లో 32.3 శాతం.. ఆంధ్రప్రదేశ్‌లో 16.2, ఒడిశాలో 5.9, గుజరాత్లో 5.1, పంజాబ్‌లో 3.8, హరియాణాలో 2.9, ఉత్తరాఖండ్‌లో 1.7 శాతం వృద్ధి నమోదైంది. ఖరీఫ్ విస్తీర్ణంలో వృద్ధి ఇలా.. ► అలాగే, దేశం మొత్తం ఖరీఫ్ విస్తీర్ణంలో 47 శాతం విస్తీర్ణం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, గుజరాత్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉంది. ► ఇక మన రాష్ట్రం విషయానికొస్తే.. వరి సాగు విస్తీర్ణం గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో ఐదు శాతం మేర పెరిగింది. ► ధాన్యం దిగుబడి 10.6 శాతం మేర వృద్ధి నమోదైంది. ► రాష్ట్రంలో ముతక, చిరు ధాన్యాల విస్తీర్ణం తగ్గినప్పటికీ ఉత్పత్తి, దిగుబడిలో భారీ వృద్ధి నమోదైంది. ► పప్పు ధాన్యాల విస్తీర్ణం, నూనె గింజల విస్తీర్ణం తగ్గినప్పటికీ ఉత్పత్తి, దిగుబడుల్లో భారీగా పెరుగుదల ఉంది. ► పత్తి విస్తీర్ణం, ఉత్పత్తి కూడా పెరిగినప్పటికీ దిగుబడి మాత్రం ఈ ఖరీఫ్‌లో తగ్గింది. నిజానికి.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లో కాలువల కింద సాగుకు నీటిని ముందస్తుగా విడుదల చేసింది. అలాగే, రైతులకు అవసరమైన విత్తనాలతో పాటు, ఎరువులను రైతుభరోసా కేంద్రాల ద్వారానే సకాలంలో అందించింది. సాగు విషయంలో రైతుల అవసరాలను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. -
తెలంగాణలో సిరుల ‘పంట’.. లక్ష కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అదే స్థాయిలో పంట దిగుబడులూ గణనీయంగా పెరుగుతున్నాయి. కాలం కలిసి రావడం, సాగునీటి వసతులు పెరగడం, ప్రభుత్వం రైతుబంధు కింద అన్నదాతలకు ఆర్థిక సాయం చేయడంతో పరిస్థితి మరింత మెరుగుపడింది. దీంతో 2020-21లో రెండు సీజన్లలో వ్యవసాయ, ఉద్యాన పంటల స్థూల ఉత్పత్తి విలువ (ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి మొత్తం దిగుబడుల విలువ) ఏకంగా రూ.లక్ష కోట్లని ఉద్యానశాఖ తేల్చింది. 2019-20లో మొత్తం పంటల విలువ రూ.89,058 కోట్లని పేర్కొంది. ఏడాది కాలంలోనే అదనంగా పంటల ఉత్పత్తి విలువ రూ. 10,942 కోట్లు పెరగడం విశేషం. ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి.. 2020–21లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 2.09 కోట్ల ఎకరాలు కావడం గమనార్హం. 2014–15 వానాకాలం, యాసంగి కలిపి పంటల సాగు విస్తీర్ణం 1.40 కోట్ల ఎకరాలు. ఈ ఏడేళ్లలో సాగు విస్తీర్ణం ఏకంగా 69 లక్షల ఎకరాలు పెరిగింది. 2020–21 ఖరీఫ్‌లో 1.20 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి కాగా, రబీలో దాదాపు 1.35 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా వస్తుందని అంచనా. ఈ యాసంగిలో 65.02 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇది తెలంగాణలో ఆల్‌టైం రికార్డుగా వ్యవసాయశాఖ పేర్కొంది. యాసంగి వరిసాగు కూడా ఆల్‌టైం రికార్డు నమోదైనట్లు వెల్లడించింది. 50.49 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడినట్లు తెలిపింది. యాసంగిలో సాధారణ వరి సాగు విస్తీర్ణం 22.19 లక్షల ఎకరాలు కాగా, గతేడాది యాసంగిలో 26.97 లక్షల ఎకరాల్లో సాగైంది. అదే ఇప్పటివరకు యాసంగి రికార్డు సాగు. కానీ ఈయేడు యాసంగిలో భారీగా వరి సాగై కొత్త రికార్డును నెలకొల్పింది. వరి సాగు విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌గా నిలిచినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 12.50 లక్షల ఎకరాలు ఉండగా, దాన్ని దీర్ఘకాలికంగా 66లక్షల ఎకరాలకు విస్తరించాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. అంటే 5 రెట్లకుపైనే ఉద్యాన పంటలను విస్తరించాలని భావిస్తోంది. 2027 నాటికి ఎగుమతి చేసే స్థాయికి ఆయిల్‌పాం వంట నూనెలను ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో విదేశీ మారకద్రవ్యం కరిగిపోవడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గులు నూనె ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆయిల్‌పాం సాగు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణలోనూ ఆయిల్‌పాం సాగుపై ఉద్యాన శాఖ దృష్టి సారించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆయిల్‌ఫాం సాగు విస్తీర్ణం కేవలం 38 వేల ఎకరాలు మాత్రమే. దీంట్లో 2.08లక్షల మెట్రిక్ టన్నులే ఉత్పత్తి వస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని.. 2026 నాటికి స్వయం సమృద్ధి సాధించాలని, 2027 నుంచి ఎగుమతులు చేసే స్థాయికి చేరుకోవా లని ఉద్యానశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో స్వల్పకాలిక విస్తరణలో భాగంగా 8.52 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం ఆయిల్‌ఫెడ్ సహా వివిధ కంపెనీలకు సాగు ప్రాంతాలను అప్పగించింది. దీర్ఘకాలిక విస్తరణ కింద 15 లక్షల ఎకరాల్లో సాగు, 1.65 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. పండ్లు, కూరగాయల సాగు నాలుగున్నర రెట్లు రాష్ట్రంలో పండ్లు, కూరగాయలు సమృద్ధిగా పండటం లేదు. టమాటా సహా అనేక కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నాం. పండ్లదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంలో రాష్ట్రంలో పండ్లు, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని నాలుగున్నర రెట్ల వరకు పెంచాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పండ్ల సాగు విస్తీర్ణం 4.49 లక్షల ఎకరాలు కాగా, స్వల్పకాలిక విస్తరణలో భాగంగా 5.13 లక్షల ఎకరాలకు, మధ్యకాలిక లక్ష్యంలో భాగంగా 10 లక్షల ఎకరాలు, దీర్ఘకాలిక విస్తరణలో భాగంగా 19.50 లక్షల ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఉల్లి సహా అన్ని రకాల కూరగాయల సాగు ప్రస్తుత విస్తీర్ణం 2.73 లక్షల ఎకరాలు కాగా, దీర్ఘకాలికంగా దీన్ని 12 లక్షల ఎకరాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఇక సుగంధ ద్రవ్యాల ప్రస్తుత సాగు విస్తీర్ణం 3.73 లక్షల ఎకరాలు కాగా, దీర్ఘకాలికంగా 16 లక్షల ఎకరాలకు విస్తరించాలని భావిస్తున్నట్లు ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. అంటే మొత్తం ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం అదనంగా 53.50 లక్షల ఎకరాలు పెంచాలని దీర్ఘకాలిక లక్ష్యంగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఉల్లి సాగు లక్ష్యం.. 3 లక్షల ఎకరాలు ఉల్లి లొల్లి నుంచి బయటపడే దిశగా ఉద్యానశాఖ కసరత్తు ప్రారంభించింది. ఉల్లి కోసం మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలపై ఆధారపడే పరిస్థితి ఇక ఉండకూడదని నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో ఉల్లి కొరత ఉంటే, ఇక్కడ ధరలు పెరగడం... ఫలితంగా వినియోగదారులు ఇబ్బందులు పడటం తెలిసిందే. దానికి కారణం రాష్ట్రంలో ఉల్లి విస్తీర్ణం పెద్దగా లేకపోవడమే. ప్రస్తుతం రాష్ట్రంలో 18 వేల ఎకరాల్లోనే ఉల్లి సాగవుతోంది. 1.82 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపులో భాగంగా స్వల్పకాలిక, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను ఉద్యానశాఖ నిర్దేశించుకుంది. ఆ ప్రకారం స్వల్పకాలిక విస్తరణలో భాగంగా 75 వేల ఎకరాలకు ఉల్లి సాగు విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా 7.90 లక్షల టన్నుల దిగుబడి సాధించాలని నిర్ణయించింది. ఆపై లక్షన్నర ఎకరాలకు ఉల్లి సాగు పెంచి, ఉత్ప త్తిని 16.50 లక్షల టన్నులు చేయడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక దీర్ఘకాలిక విస్తరణలో భాగంగా 3 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు చేపట్టి, 35 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. -
గ్రామాల్లోనే కొనుగోళ్లు
-
పండించిన ప్రతి గింజనూ కొంటం
సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణలో ప్రస్తుతం 50 లక్షల ఎకరాల పైచిలుకు పంటలున్నయి. 40 లక్షల ఎకరాల వరి, 14.50 లక్షల టన్నుల దిగుబడినిచ్చే మొక్కజొన్న పంటలున్నయి. యాసంగిలో ఇది రికార్డు. ఒక గింజ కూడా రైతులు బయట అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అంతా ప్రభుత్వమే కొంటది. ప్రస్తుతం మొక్క జొన్నకు ధరలేదు. బయట అమ్ముకుంటే నష్టపోతారు. దాని దృష్ట్యా ప్రభుత్వమే కొనాలని నిర్ణయించింది. క్వింటాల్ మక్కలకు రూ. 1,200 కూడా కొన్ని చోట్ల ఇస్తలేరు. రూ. 800 అని కొన్నిచోట్ల అంటున్నరు. వరి, మొక్కజొన్న ప్రతి గింజనూ ప్రభుత్వమే 100 శాతం కొంటుంది’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రైతులకు హామీ ఇచ్చారు. వరి, మక్కల కొనుగోళ్లపై ఆదివారం ప్రగతి భవన్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియంత్రిత విధానంలో కూపన్లలో ఇచ్చిన తేదీ రోజుల్లోనే రైతులు ధాన్యం, మక్కలను తీసుకురావాలి. లేకుంటే కొనరు.. వెనక్కి పంపిస్తారు. రవాణా డబ్బులు మీద పడుతాయి అని రైతులను హెచ్చరించారు. ఇతర వివరాలు ఆయన మాటల్లోనే.. హార్వెస్టర్ల మెకానిక్‌లకు అనుమతి... వరి పంట కోతకు మన రాష్ట్రంలో 5 వేల హార్వెస్టర్లున్నయి. తమిళనాడు నుంచి 500–1,500 వరకు వస్తున్నాయి. ట్రాక్టర్ ఆధారిత హార్వేస్టర్లు మనవి. ఒకటే ట్రాక్టర్‌ను రైతులు అనేక పనులకు వాడుతున్నరు. హార్వెసర్లన్నీ ట్రాక్టర్ల నుంచి దించి ఉన్నయి. రైతులు ఎవరికి వారు ఎక్కించుకోలేరు. పట్టణాల్లో ఉన్న హార్వెస్టర్ టెక్నిషియన్లకు ప్రత్యేక పాసులు ఇచ్చి గ్రామాలకు అనుమతించాలని ఆదేశించినం. హార్వెస్టర్ల స్పేర్‌పార్ట్స్ కోసం షాపులు తెరిపించి ఇప్పించాలని, స్థానికంగా లభించకపోతే హైదరాబాద్‌లోని పరిశ్రమలు, డీలర్లను సంప్రదించేందుకు సీఎస్‌కు ఫోన్ చేసి చెప్పండి. బిహార్ నుంచి హమాలీలను .. రైస్ మిల్లుల్లో పనిచేసే హమాలీల్లో 95 శాతం బిహార్వాళ్లే. హోలీ పండుగకు బిహార్ వెళ్లిన వారు అక్కడే ఉన్నరు. పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరించి కస్టమైజ్డ్ మిల్లింగ్ కోసం మిల్లులకు పంపిస్తది. ఆ మిల్లుల నుంచి బియ్యం ఎఫ్‌సీఐ గోదాములకు వెళ్లాలి. ఈ పనిచేసేటోళ్లు బిహార్ హమాలీలు. వారిని రప్పిస్తున్నాం. అవసరమైతే ప్రత్యేక ట్రైన్స్ పెట్టించి వారిని రప్పిస్తం. నేడు రైస్ మిల్లర్లతో సమావేశం.. రైస్ మిల్లర్లు, వ్యాపారస్తులు కొంటామంటే వారిని గ్రామాలకు రానీయాలి. వారు కచ్చితంగా కనీస మద్దతు ధర చెల్లించాలి. సోమవారం ఉదయం 11.30 రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌కి చెందిన ఆరుగురు ప్రతినిధులతో సమావేశమై చర్చిస్తా. కంచెలు తొలగించాలి గ్రామాలకు బయటి వారు రాకుండా ముళ్ల కంచెలు, రాళ్ల గోడవు పెట్టారు. కరోనా వరకు మంచిదే. రైతులు వడ్లు అమ్ముకోవాలి. హమాలీ వాళ్లు రావాలి. కూపన్లు ఇచ్చే అధికారి రావాలి. వారిని అనుమతించే విష యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతు సమితి సభ్యులు సమన్వయం చేసుకోవాలి. వారి కోసం కంచెలను తొలగించాలి. తెల్లకార్డుదారులకు ఒకట్రెండు రోజుల్లో బియ్యం, రూ. 1,500 పంపిణీ ప్రారంభమవుతుంది. బియ్యం వాహనాన్ని గ్రామాల్లో రానివ్వాలి. మీ ఊర్లకు నిత్యవసర సరులకు రానీయండి. గంగాళం, శానిటైజర్, సబ్బులు పెట్టి వచ్చిపోయే వారు కాళ్లు చేతులు కడుక్కోవాలనే నిబంధన పెట్టండి. రోడ్లు మూసేయొద్దు. ధాన్యం, మక్కల కొనుగోళ్లకు రూ. 30 వేల కోట్లు.. ధాన్యం కొనడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లు లేవు. ప్రభుత్వ రెవెన్యూ పడిపోయింది. ఇంత కఠిన పరిస్థితిలో కూడా ధాన్యం సేకరణ కోసం సివిల్ సప్లైస్ కార్పొ రేషన్‌కు రూ. 25 వేల కోట్లు సమీకరిం చినం. కార్పొరేషన్‌కు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సమీకరించడం చరిత్రలో ఇదే తొలిసారి. ఉమ్మడి ఏపీలోనూ ఇన్ని డబ్బు లు ఎన్నడూ ఇవ్వలేదు. మక్కల కొనుగోళ్ల కోసం మార్క్‌ఫెడ్‌కు రూ. 3,200 కోట్లు కలిపి రైతుల కోసం సుమారు రూ. 30 వేల కోట్లను ప్రభుత్వం సమీకరించింది. ఏ రాష్ట్రంలోనూ ఇన్ని ఏర్పాట్లు లేవు. ప్రతి గింజా కొంటామనిది డైలాగ్ కాదు. ప్రతి కిలో వరి, మక్కలను కొంటామని సీఎంగా చెబుతున్న. ఒక కోటీ 5 లక్షల టన్నుల వరి వచ్చే అవకాశముంది. ఒక్క కేజీ మిగల కుండా ప్రభుత్వమే కొంటది. ఆన్లైన్లో డబ్బులు వేస్తది. రైతులకు ఆందోళన వద్దు. 2, 3 రోజుల్లో జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు సమన్వయం చేసుకుని కూపన్లు ఇస్తరు. రైతులు వచ్చేటప్పుడు ఖాతా నంబర్, పాస్‌బుక్ తీసుకుని రావాలి. -
ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యవంతమైన దిగుబడి
రంగన్నగూడెం (హనుమాన్‌జంక్షన్ రూరల్): తక్కువ పెట్టుబడి, ఆరోగ్యవంతమైన పంటల ఉత్పత్తికి రైతులందరూ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా రంగన్నగూడెంలోని ప్రకృతి వ్యవసాయం జరుగుతున్న వరి క్షేత్రాలను గవర్నర్ ఆదివారం పరిశీలించారు. కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, వైఎస్సార్సీపీ నేత డాక్టర్ దుట్టా రామచంద్రరావు గ్రామానికి చెందిన రైతులతో కలిసి గవర్నర్‌కు స్వాగతం పలికారు. అనంతరం యువరైతు మైనేని గణేష్ సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని గవర్నర్ సందర్శించారు. అతనితో ప్రకృతి వ్యవసాయ విధానం, జీవ రసాయనాల తయారీ, సేంద్రియ ఎరువుల ఉత్పత్తిపై అడిగి తెలుసుకున్నారు. విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి, స్వగ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఎందరో యువకులకు ఆదర్శంగా నిల్చిన మైనేని గణేష్‌ను గవర్నర్ అభినందించారు. కృత్రిమ ఎరువులు, రసాయనాలను వినియోగించకపోవటం వల్ల ఎకరాకు దాదాపు రూ.15 వేలు పెట్టుబడి వ్యయం తగ్గిందని, ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి పంటకు సగటున ఎకరాకు రూ.40 వేల వరకు ఆదాయం వస్తోందని గవర్నర్‌కు గణేష్ తెలిపారు. -
పంట ఉత్పత్తికి విత్తనమే కీలకం: పోచారం
సాక్షి, హైదరాబాద్: ‘‘పంట ఉత్పత్తికి విత్తనమే కీలకం. నకిలీ విత్తన సరఫరా దార్లపై ఉక్కుపాదం మోపుతాం. నకిలీ విత్తన సరఫరా సంస్థలపై పీడీ యాక్ట్ తెచ్చాం’’ అని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం సచివాలయంలో ‘‘ఇండో– జర్మన్ కోఆపరేషన్ ఆన్ సీడ్ సెక్టార్ డెవలప్మెంట్’’ లో భాగంగా జరిగిన ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ సమావేశంలో ప్రస్తుత విత్తన చట్టం స్థానంలో కొత్త విత్తన చట్టం తీసుకు రావడం, దేశీయ అవసరాలకు అనుగుణంగా సేంద్రియ ధ్రువీకరణ విధానాన్ని రూపొందించుకోవడం, సీడ్ పా ర్క్స్ ఏర్పాటు, ప్రైవేటు విత్తన సంస్థలను ప్రోత్సహించ డం అనే 4 అంశాలపై పలు ప్రతిపాదనలు తీర్మానించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ దేశంలోని రాష్ట్రాలన్నీ తెలంగాణ వైపు చూసే విధంగా వ్యవ సాయరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్య లు చేపట్టిందన్నారు. ప్రస్తుతం దేశ విత్తన అవసరా లలో 60% రాష్ట్రం నుంచే ఎగుమతి అవుతున్నా యని, ఈ ఏడాది 20 దేశాలకు విత్తనాల ఎగుమతి జరుగుతుందన్నారు. స్వయంగా రైతే సీఎంగా ఉం డటం తెలంగాణ అదృష్టమన్నారు. జర్మనీ సాంకేతికతో రాష్ట్రంలో నాణ్యమైన విత్తనోత్పత్తి జరుగుతుందన్నారు. త్వరలోనే వ్యవసాయ శాఖ అధికారులతో కూడిన బృందంతో జర్మనీ సందర్శిస్తామన్నారు. -
అప్పుడే రైతుకు రుణ విముక్తి
⇒ పంట ఉత్పత్తి, గిట్టుబాటు ధర, నికరాదాయం పెరగాలి.. ⇒ ఆ దిశగా శాస్త్రవేత్తలు, అధికారులు కృషి చేయాలి ⇒ వ్యవసాయ మంత్రి పోచారం సాక్షి, హైదరాబాద్: పంట ఉత్పత్తి, గిట్టుబాటు ధర, నికరాదాయం.. ఈ మూడు పెరిగితేనే రైతులు రుణ విముక్తులవుతారని, ఆ దిశగా శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్)లో సోమవారం జరిగిన ‘వ్యవసాయంలో నైపుణ్యాభివృద్ధి’పై వర్క్‌షాప్‌ను పోచారం ప్రారంభించారు. మొత్తం 8 రాష్ట్రాల నుంచి 400 మంది వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో వ్యవసాయంపై వచ్చే ఆదాయం రైతుల జీవన వ్యయానికే సరిపోతుంటే ఇక వారి కుటుంబాలకు మెరుగైన జీవితం ఎలా అందుతుందని ప్రశ్నించారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి కానీ అంతే మొత్తంలో రైతుల ఆదాయాలు పెరగలేదని పేర్కొన్నారు. డిపాజిట్ చేయడానికి రైతులు రావాలి.. కేంద్ర బడ్జెట్లో ప్రతి ఏడాది వ్యవసాయ రుణాలను పెంచుతున్నారని, అసలు రుణమే అవసరం లేకుండా సొంతంగా పెట్టుబడుల ను సమకూర్చుకోగలిగే స్థితికి రైతులు చేరుకోవాలని ఆకాంక్షించారు. రైతులు రుణాల కోసం కాదు లాభాలను డిపాజిట్ చేయడానికి బ్యాంకులకు వచ్చే రోజు రావా లన్నారు. 1947లో 50 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న దేశ ఆహారధాన్యాల దిగుబడులు 2017లో 272 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరడం సంతోషమన్నారు. అయితే సగటు దిగుబడులను ఇతర దేశాలతో పోల్చినప్పుడు తక్కువగా ఉన్నాయని తెలిపారు. పాలీహౌస్‌లకు ప్రోత్సాహం రాష్ట్రంలో పాలీహౌస్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం అధిక ప్రోత్సాహం కల్పిస్తుందని పోచారం తెలిపారు. ఎకరాకు రూ.40 లక్ష లు ఖర్చు కాగా.. రూ.30 లక్షలు సబ్సిడీగా సమకూరుస్తున్నామని వివరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు 1,000 ఎకరాల్లో పాలీహౌస్‌ల నిర్మాణానికి అను మతులిచ్చామని వెల్లడించారు. వచ్చే ఏడా ది 3,000 ఎకరాల్లో నిర్మించడానికి సహకా రం అందించాల్సిందిగా కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరగా.. ఆయన అంగీకరించా రని తెలిపారు. వ్యవసాయ రంగం బాగుప డాలంటే సాంకేతికత, పెట్టుబడులు, యాంత్రీకరణ పెరగాలని పేర్కొన్నారు. -
దిగుబడిపై.. దిగులు!
♦ ఖరీఫ్ దిగుబడులపై రైతుల్లో ఆందోళన ♦ సకాలంలో కురవని వర్షాల ఫలితం ♦ మొక్కజొన్న, పత్తి పంటలపై తీవ్ర ప్రభావం ♦ మరిన్ని వానలు కురిస్తేనే గట్టెక్కనున్న కంది.. ♦ ప్రాథమిక అంచనాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖ ఖరీఫ్‌లో సాధారణ, సాగైన విస్తీర్ణం వివరాలు(హెక్టార్లలో)... పంట సాధారణం సాగు వరి 25,600 20,338 జొన్న 9,171 6,418 మొక్కజొన్న 42,857 48,723 కంది 35,247 42,282 పెసలు 5,651 6,387 మినుములు 4,465 5,532 ఆముదం 2,118 1,188 సోయా 17,200 5,259 పత్తి 57,247 40,069 ఖరీఫ్ చివరి దశకు చేరింది. ఈ నెలాఖరుతో సీజన్ ముగియనుంది. అడపాదడపా వర్షాలు కురిసినప్పటికీ ఈసారి విస్తీర్ణం ఆశాజనకంగానే ఉంది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 2,17,295 హెక్టార్లు కాగా ఇప్పటివరకు 1,85,713 హెక్టార్లే సాగైంది. సీజన్ ముగియడానికి మరో పక్షం రోజులు గడువున్నప్పటికీ విస్తీర్ణం పెరిగే అవకాశం లేదు. ఈసారి సాధారణ విస్తీర్ణంలో 85శాతం సాగు జరిగినప్పటికీ... వర్షాల మధ్య అంతరం భారీగా ఉండడం, కొన్నిచోట్ల వర్షాభావ పరిస్థితులే నెలకొనడంతో దిగుబడిపై రైతాంగం ఆందోళన చెందుతోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా : రెండేళ్లుగా జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఈసారీ పునరావృతమయ్యాయి. సీజన్లో క్రమంగా కురవాల్సిన వర్షాలు అడపాదడపా భారీగా కురిశాయి. దీంతో రైతులు మెట్టపంటలు సాగుచేశారు. అయితే, సాగుచేసిన తర్వాత వర్షాలు కురవకపోవడంతో పలుచోట్ల పంటలు నేలవాలాయి. అప్పుడప్పుడు కురిసిన వర్షాలతో అవి తిరిగి జీవం పోసుకున్నప్పటికీ దిగుబడి చేతికి వచ్చే అంశంపై తీవ్ర సందిగ్ధం నెలకొంది. ఈ ఏడాది జిల్లాలో మొక్కజొన్న, కంది, పత్తి పంటలు భారీ విస్తీర్ణంలో సాగయ్యాయి. సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువ మొత్తంలో సాగైనప్పటికీ... వాటిలో ప్రస్తుతం పూర్తిస్తాయి దిగుబడి ఇచ్చే పంటలు తక్కువని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. జూ నెలలో వర్షాలు మురిపించినా జూలైలో మాత్రం కాస్త మందగించాయి. ఆ తర్వాత ఆగస్టు చివరి వారంలో భారీ వర్షాలే నమోదయ్యాయి. సీజన్లో 58.7 సెంటీమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా... ఇప్పటివరకు 45.5 సెంటీమీటర్లు మాత్రమే కురిసింది. ఈ వర్షాలతో అక్కడక్కడా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. అయితే పంటల ఎదుగుదలపై మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. వర్షాల మధ్య అంతరం 3 రోజులకుగాను కొన్ని చోట్ల 7 నుంచి 10 రోజుల వరకు ఉంది. ఈ సమయంలో పంటల ఎదుగుదల నిలిచిపోయే ప్రమాధం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో పంటల దిగుబడి భారీగా పతనం కానుంది. వివిధ మండలాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఈ మేరకు విశ్లేషిస్తున్నారు. వరి పంటతో పాటు మొక్కజొన్న, పత్తి పంటలపై ఈ ప్రబావం పడనుంది. కంది పంటకు మరింత సమయం ఉన్నందున... ఆ లోపు మరిన్ని వర్షాలు కురిస్తే సత్ఫలితాలు ఉంటాయని వ్యవసాయ శాఖ భావిస్తోంది. -
పంట చేతికి రాదేమోనని రైతు ఆత్మహత్య
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కాబ్రి గ్రామంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బద్దం జంగారెడ్డి (37)కి నాలుగు ఎకరాల పొలం ఉంది. దీంతోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. వర్షాభావంతో పంటలు ఎండిపోవడంతో పంట చేతికి రాదేమోననే వేదనతో ఆదివారం పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
చెరువులు తవ్వితే చేనంతా వెలుగే
ఎకరానికి 40 ట్రాక్టర్లు లేదా 200 టన్నుల చెరువు మట్టిని వేయడం ద్వారా 3 సంవత్సరాల వరకు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి 100 శాతం అధికోత్పత్తిని సాధించవచ్చు. ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటల ఉత్పత్తిలో పురుగు మందుల అవశేషాలను లేకుండా చేయవచ్చు. పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవచ్చు. పుష్కర కాలం సాగిన పోరాటం తరువాత ఏర్ప డిన తెలంగాణ రాష్ట్ర సాగు, తాగు నీటి అవస రాలను తీర్చడానికి ప్రభు త్వం దృష్టి కేంద్రీకరిం చింది. 3.6 కోట్ల తెలం గాణ ప్రజల ఆహార, వ్యవ సాయ అవసరాలను తీర్చడానికి సమస్త శక్తులు కేంద్రీకరించి రాష్ట్రంలో చెరువుల మీద సర్వే చేయిం చింది. 45,300 చిన్న నీటి వనరులు, చెరువులు, కుంటలు ఉన్నట్టు లెక్కతేలింది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతంలో ముఖ్యంగా తెలంగాణలోని చెరువుల, కుంటల పూడిక తీత, దాని వినియోగం అంశం మీద పరిశోధన చేయడానికి మిచిగన్ విశ్వ విద్యాలయం (అమెరికా) ముగ్గురు విద్యార్థులు, ఫ్రీడమ్ సంస్థ ఈ ఆగస్ట్‌లో నల్లగొండ జిల్లాలోని 33 గ్రామాలను సందర్శించారు. ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనాయి. చెరువులలో పూడిక తీసిన గ్రామాలకు చెందిన 700 మంది రైతులను వారు కలుసుకున్నారు. స్థాని కులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి పంట ఉత్పత్తి పెరుగుదల, భూగర్భ నీటిమట్టం పెరుగుదల, రసాయనిక, పురుగు మందుల వాడకం తగ్గుదల వంటి అంశాలు ఈ ప్రక్రియలో ప్రధానంగా ఉన్నట్టు విద్యార్థులు గమనించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మెట్ట భూముల పరిశోధన సంస్థ పూడిక మట్టిని పరిశోధించింది. రాష్ట్ర వ్యవసాయ, అటవీ, పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖల మంత్రు లకు, ఇతర అధికారులకు కూడా ఈ పరిశోధనల గురించి విద్యార్థులు తెలియజేశారు. 1,500 కిలోల తలసరి కర్బన ఉద్గారాలతో, ప్రపంచ సగటుకు భారతదేశం దిగువనే ఉన్నం దున, చెరువుల పూడిక ద్వారా రసాయనిక ఎరు వులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించు కోవచ్చు. అలాగే భూగర్భ జలమట్టాన్ని పెంచి, బోర్ బావులకు ఇస్తున్న సబ్సిడీ విద్యుత్ విని యోగాన్ని తగ్గించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి పూడికతీత ఖర్చులో సుమారు 30 శాతానికి పైగా కార్బన్స్ క్రెడిట్స్ రూపేణా పారిశ్రామిక దేశాల నుంచి తిరిగి రాబట్టుకోవచ్చని మిచిగాన్ విద్యా ర్థులు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు వివరించారు. సుస్థిర అభివృద్ధికి ఈ పూడిక తీత ప్రాజెక్టు చరిత్రలో ఒక గొప్ప నమూనాగా నిలిచిపో గలదని కూడా వారు వివరించారు. దహగామ ఆదిత్య (స్టూడెంట్ గవర్నమెంట్ అధ్యక్షుడు), జాన్ మానెట్, లియాన్ ఎన్పెరా బృందం పూడిక తీతతో కలిగే ప్రయోజనాలను వర్గీకరించి చెప్పారు. అందులో ముఖ్యమైనవి- ఎకరానికి 40 ట్రాక్టర్లు లేదా 200 టన్నుల చెరువు మట్టిని వేయడం ద్వారా 3 సంవత్సరాల వరకు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి 100 శాతం అధికోత్పత్తిని సాధించవచ్చు. ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటల ఉత్పత్తిలో పురుగు మందుల అవశేషాలను లేకుండా చేయవచ్చు. పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవచ్చు. అధికోత్పత్తితో ప్రతి ఎకరా సాగు భూమికి అదనం గా 60 మానవ పనిదినాలను పెంచవచ్చు. తక్కు వైన స్థూల, మధ్య సూక్ష్మ పోషకాలను సమృద్ధిగా సాగు భూమికి అందజేసి ఎరువులు, పురుగు మం దుల వినియోగంలో 80 శాతం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. తెలంగాణలోని 10 జిల్లాల్లోని 45,300 చెరువు లలో ఉన్న పూడిక మట్టిని తొలగించినట్లయితే అదనపు భూసేకరణ ఖర్చులు, చట్టపరమైన పేచీలు, జాప్యాలు లేకుండానే మూడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు సమానమైన నీటిని అదనంగా పొం దవచ్చు. ఉపరితల అదనపు నీటి పారుదల అవకాశాన్ని, ఇప్పుడున్న దానికి రెండింతలకు పెం చవచ్చు. అదనపు భూగర్భ జల మొత్తాన్ని పెం చవచ్చు. మునుగోడు మండలంలోని మెల్మకన్నె గ్రామంలో మూడు సంవత్సరాలలో తీసిన 50 వేల ట్రాక్టర్ల పూడిక మట్టిని 1,200 ఎకరాల సాగు భూమిలో వేసుకున్నారు. ఈ కాలంలో దాదాపు 3 కోట్ల రూపాయల అదనపు ఫలసాయాన్ని వారు పొందారు. పర్యవసానంగా 140 అడుగుల తోతున ఉన్న భూగర్భ జలాలు 30 అడుగుల పైకి ఉబికి వచ్చాయి. విద్యుత్ వినియోగం మీద ఒత్తిడిని బాగా తగ్గింది. రెండవ పంట గగనమై ఊహించడానికి అవకాశం లేని పరిస్థితులలో పంటలకు సమృద్ధిగా సాగు నీరు లభించింది. ప్రతి క్యూబిక్ మీటర్ చెరువు మట్టికి సమా నంగా సృష్టించిన అదనపు వెయ్యి లీటర్ల నీటి పరి మాణానికి అనుగుణంగా కనీసం ఒక కేజీ నుంచి గరిష్టంగా 2 కేజీల వరకు చేపల ఉత్పత్తిని సాధిం చవచ్చని జాతీయ చేపల పెంపకం అభివృద్ధి సంస్థ తెలియజేస్తుంది. దహగామ ఆదిత్య బృందం చేసిన విశ్లేషణలో ఒకే ఒక్కసారి యంత్రాలతో, ట్రాక్టర్లతో పూడిక తీసిన అనంతరం గ్రామీణ ఉపాధి హామీ పథకం సాలీనా సగటున ఇవ్వగలిగిన 42 పని దినాలకంటే రెట్టింపుగా 100 శాతం గ్రామీణ ఉపాధి అవకాశాలు మానవ పనిదినాలు పెరిగినట్లు, అదే పెట్టుబడి మొత్తానికి సమకూరినట్లుగాను వెల్లడైంది. 100 రోజుల ఉపాధి హామీ పథకానికి కేటాయించిన బడ్జెట్ ఒక్కరికి 10 వేల రూపాయలు. లభ్యమైన దేశీయ సగటు పని దినాలు ఒకరికి 42 మాత్రమే. తర్వాత ఉపాధి హామీ అవసరం లేకుండానే అధిక ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఎరువుల, పురు గు మందుల వాడకంలో ఆదాను భూగర్భ నీటి మట్టంలో పెరుగుదలను, విద్యుత్ వినియోగంలో తగ్గింపును, ఫ్లోరోసిన్ నివారణను ఏకకాలంలో సాధించగలదు. నిర్లక్ష్యానికి గురైన రైతుల ఆత్మ హత్యలను నివారించి, విలువైన రైతుల ప్రాణాలను కాపాడగలదు. (వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి నాయకుడు) నైనాల గోవర్ధన్ -
వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.10 వేల కోట్లు
నాబార్డు సీజీఎం జీజీ మమెన్ ఏలూరు : రాష్ట్రంలో వ్యవసాయ, పంట ఉత్పత్తుల కోసం సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులకు 2014-15లో రూ.10 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ జీజీ మమెన్ అన్నారు. ఏలూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 500 సహకార సంఘాలకు టర్మ్లోన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రైతులకు ప్రోత్సహిం చడంతో పాటు చైతన్యపరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,500 కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. రుణమాఫీతో బ్యాంకింగ్ వ్యవస్థ చిన్నాభిన్నం రుణమాఫీని ప్రోత్సహించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని, ప్రతి ఒక్కరూ రుణం రద్దువుతుందనే ఆలోచనలో ఉంటే బ్యాంకు కార్యకలాపాలు ఎలా సాగుతాయని ఆయన ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న రైతులకు మాఫీ చేయడం సమంజసం కాని తరచూ రుణమాఫీలు చేయడం సరికాదన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకు న్న దృష్ట్యా రిజర్వ్ బ్యాంకు నిర్ణయానికి అనుగుణంగా తాము దీనిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డీసీసీబీ పనితీరు సంతృప్తికరం జిల్లా సహకార బ్యాంకు పనితీరు సంతృప్తికరంగా ఉందని మమెన్ అన్నారు. డిపాజిట్ల సేకరణలో గ్రామీ ణ సహకార సంఘాలు అగ్రస్థానంలో ఉండాలని, ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా లో వ్యవసాయాభివృద్ధికి నాబార్డు సాయంపై ఈనెల 30లోగా ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. లాభాల బాటలో 233 సొసైటీలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 253 సొసైటీలకుగాను 233 లాభాల బాటలో ఉన్నాయన్నారు. ప్రతి ఏటా రూ.70 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు సొసైటీల ద్వారా బంగారంపై వ్యవసాయ రుణాలు ఇస్తున్నామని చెప్పారు. అనంతరం మమెన్ను దుశ్శాలువాతో సత్కరించారు. డీ సీసీబీ సీఈవో వీవీఎన్ ఫణికుమార్ మాట్లాడుతూ తమ బ్యాంకు గతేడాది రూ.1.68కోట్ల లాభం ఆర్జిస్తే ఈ ఏడాది రూ.3 కోట్లపైబడి లాభం రావచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అనంతరం రైతు చైతన్య కరపత్రాలను మమెన్ విడుదల చేశారు. డీసీసీబీ ఉపాధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, డెరైక్టర్లు అమృతమ్మ, డీసీసీబీ జీఎం మాధవి, కె.శ్రీనివాస్, డీజీఎం శ్రీదేవి, రమణమ్మ, ఐసీడీపీ పీవో పాల్గొన్నారు. అనుబంధ రంగాలకు చేయూత జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలకు నాబార్డు చేయూతనందిస్తుందని సీజీఎం జీజీ మమెన్ అన్నారు. స్థానిక వైభవ్ అపార్ట్‌మెంట్స్‌లో నాబార్డు కార్యాల యాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల అధికారులతో, బ్యాంకర్లతో సమన్వయంగా పనిచేసి సమగ్ర వ్యవసాయాభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. ఆంధ్రా బ్యాంకు డీజీఎం నాగరాజునాయుడు, ఎల్డీఎం ఎం.లక్ష్మీనారాయణ, నాబార్డు ఏజీఎం హరిగోపాల్, వ్యవసాయశాఖ జేడీ వి.సత్యనారాయణ, పశుసంవర్ధకశాఖ జేడీజ్ఞానేశ్వర్, మత్స్యశాఖ డీడీ వి.కృష్ణమూర్తి, డీసీసీబీ సీఈవో వీవీఎన్ ఫణికుమార్, ఉద్యానశాఖ ఏడీ సుజాత పాల్గొన్నారు.